దీపావళి వేళ రైల్వే శాఖ కీలక హెచ్చరిక! | Diwali Travel Alert, South Coast Railway Warns Passengers Against Carrying Firecrackers, Petrol And Other Flammable Items On Trains | Sakshi
Sakshi News home page

దీపావళి వేళ రైల్వే శాఖ కీలక హెచ్చరిక!

Nov 7 2026 9:29 AM | Updated on Nov 7 2026 10:12 AM

Dont Carry Diwali Firecrackers On Trains Railways Tell Passengers

దీపావళి పండుగ వస్తోంది. చాలామంది సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో రైళ్లలో ప్రయాణించే వారికి సౌత్ కోస్ట్ రైల్వే కీలక హెచ్చరిక జారీ చేసింది. రైళ్లలో టపాసులు, పేలుడు పదార్థాలు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, కిరోసిన్ వంటి మండే వస్తువులను తీసుకెళ్లవద్దని స్పష్టం చేసింది. ఇలాంటి వస్తువుల వల్ల రైళ్లలో అగ్నిప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని, తోటి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని అధికారులు హెచ్చరించారు.

రైల్వే చట్టం 1989 ప్రకారం.. రైళ్లలో పేలుడు పదార్థాలు, మండే వస్తువులను తీసుకెళ్లడం నేరం. ఎవరైనా టపాసులు, గ్యాస్ సిలిండర్లు, యాసిడ్, పెట్రోల్, కిరోసిన్ వంటి వస్తువులతో పట్టుబడితే చట్టపరమైన చర్యలు తప్పవు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది.

అంతేకాకుండా, వారు తీసుకెళ్లే ప్రమాదకర వస్తువుల వల్ల రైల్వే ఆస్తులకు లేదా ఇతర ప్రయాణికులకు నష్టం జరిగితే అందుకు కూడా వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరోవైపు దీపావళి నేపథ్యంలో రైల్వే అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలో ప్రత్యేక భద్రతా బృందాలను ఏర్పాటు చేసి రైళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP), సివిల్ డిఫెన్స్ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొంటున్నారు. ఎవరైనా నిషేధిత వస్తువులను రైళ్లలో తీసుకెళ్తున్నారా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు.

అంతేకాకుండా.. రైళ్లలో విధులు నిర్వహించే టీటీఈలు, కోచ్ అటెండెంట్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మేనేజర్లకు కూడా అధికారులు కీలక సూచనలు చేశారు. ప్రయాణ సమయంలో ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. దీపావళి పండుగ సమయంలో ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: తగ్గనున్న ట్రైన్ టికెట్ ధరలు.. కొత్త రూల్స్ వస్తున్నాయ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement