పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెత అరుణ్ దేవ్ పోతులకు కరెక్టుగా సరిపోతుంది. ‘35 చిన్న కథ కాదు’ (2024) సినిమాతో పరిచయమైన ఈ బాలనటుడు తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. అంతేకాదు.. తొలి చిత్రంతోనే భారత ప్రభుత్వం నుంచి జాతీయ అవార్డుతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ బాలనటుడిగా గద్దర్ అవార్డుని సైతం అందుకున్నాడు. అరుణ్ దేవ్ ఓ లీడ్ రోల్‌లో నటించిన బాలల చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’ శుక్రవారం(నవంబరు 6) విడుదలైంది. కాగా దీపావళి సందర్భంగా ఈ లిటిల్ గెస్ట్ సాక్షితో పంచుకున్న ఎక్స్‌క్లూజివ్ విశేషాలు...
దీపావళి అంటే చాలా ఇష్టం. ప్రత్యేకించి టపాసుల్లో ఎక్కువగా తారాజువ్వలంటే చాలా చాలా ఇష్టం. జువ్వల చివర మంట పెడితే చాలు జువ్వున ఆకాశంలోకి దూసుకెళతాయి. అవి కింద పేలవు కాబట్టి ధైర్యంగా కాలుస్తాను. అదే విధంగా మ్యాచ్ బాక్సెస్ అన్నా కూడా ఇష్టమే. వాటిని కూడా కాలుస్తుంటాను.
నాకు చిన్నప్పటి నుండి క్రాకర్స్ అంటే ఇష్టమే. అయితే పేలే వాటికి కొంచెం దూరంగానే ఉంటానన్నమాట. ఎందుకంటే నాకు కొంచెం భయంగా ఉంటుంది. ఒకవేళ అవి కాల్చాలంటే నాతో పెద్దవాళ్లు ఉండాల్సిందే. పైగా శబ్ద కాలుష్యం కూడా ఎక్కువ కదా. అందుకే క్రాకర్స్, జువ్వలు వంటివి అయితే శబ్ద కాలుష్యం లేకుండా ఉంటుంది.. మనకి వినోదంగా ఉంటుంది.
నా లైఫ్‌లో బెస్ట్ దీపావళి అంటే 2024. ఎందుకంటే ఆ రోజు వైజాగ్‌లోని మా ఇంట్లో ఎక్కువగా ఫైర్ క్రాకర్స్, ఫైర్ వర్క్స్ తెచ్చుకొని మా కుటుంబమంతా కలిసి రాత్రి 8:30 నుంచి 10 గంటల వరకు కాల్చాం. మళ్లీ ఉదయాన్నే లేచి క్రాకర్స్ కాల్చుకున్నాం. దీపావళి తర్వాత నాగుల చవితి పండగ రావడంతో కొన్ని క్రాకర్స్, టపాసులు దాచుకొని మళ్లీ ఆ రోజు కాల్చాను. దీపావళి తర్వాతి రోజు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, మా కజిన్స్, మా బ్రదర్స్.. ఇలా అందరూ వస్తారు. అప్పుడు మా ఇల్లు ఒక చిన్న సంతలా ఉంటుంది (నవ్వుతూ). అందరం కలిసి భోజనం చేసి, కబుర్లు చెప్పుకుంటాం. అలాగే నాగుల చవితికి కూడా కలుస్తాం.
మా కుటుంబంలో నాకున్న పేరు జీరో. (‘35 చిన్న కథ కాదు’ చిత్రంలో పాత్ర తాలూకు మార్కులనుద్దేశించి). మా కజిన్ బ్రదర్స్ జీరో బావ, జీరో మావయ్య పేరుతోనే నన్ను ఎక్కువ పిలుస్తారు. ఎందుకంటే నా ఫస్ట్ మూవీ ‘35 చిన్న కథ కాదు’ని మా ఫ్యామిలీలో ఉన్న 99 శాతం మంది చూశారు. సో చిన్న పిల్లలతో సహా అందరికీ నేను, నా పేరు జీరో అని నోటెడ్ అయింది. అరుణ్ అని ఎవరికీ గుర్తులేదు. పిల్లలు జీరో బావ, జీరో మామ అంటుంటే పెద్దవాళ్లు అరుణ్ అని పిలుస్తారు. అన్నట్టు నాకో చెల్లి ఉంది. మేము టపాసుల కోసం ఎప్పుడూ పోటీ పడలేదు.
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని..
‘‘దీపావళి టపాసులన్నింటిలో నాకు నచ్చేవి ఆటమ్ బాంబ్. నేను ఎక్కువగా ఆటమ్ బాంబులను పేల్చుతాను కాబట్టి నన్ను అందరూ ఆటమ్ బాంబ్ అని పిలుస్తుంటారు. మేము, మా మావయ్యగారి కుటుంబం కలిసి దీపావళి జరుపుకుంటుంటాం. అలాగే మా అ΄ార్ట్‌మెంట్‌లో కూడా’’ అని బాలనటుడు రోహన్ రాయ్ తెలిపారు. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ వంటి పలు సినిమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు రోహన్ రాయ్. తాను ఓ ప్రధాన పాత్ర పోషించిన ‘సమ్మర్ హాలిడేస్’ శుక్రవారం విడుదలైంది. దీ΄ావళి సందర్భంగా ఈ లిటిల్ గెస్ట్ సాక్షితో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడాడు.
నాకు సంక్రాంతి, దీపావళి పండగలంటే ఇష్టం. నా లైఫ్‌లో ది బెస్ట్, ది వరస్ట్ దీపావళి 2018లో ఒకే రోజు జరిగాయి. చోటా దీపావళి, బడా దీపావళి అని రెండు రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్న దీపావళి రోజు చాలా బాగా ఎంజాయ్ చేశాను. పెద్ద దీపావళి రోజు ఫ్లవర్ పాట్ వెలిగించాను. ఒక్కసారిగా ఫైర్ రావడంతో నా కంట్లో పడింది.. కళ్లు ఎర్రగా అయిపోయాయి.
చాలా మంటగా అనిపించింది. దీంతో మా అమ్మానాన్నలు చాలా టెన్షన్ పడ్డారు. అయితే దేవుడి దయ వల్ల ఏం కాలేదు. కొద్ది సేపైన తర్వాత మళ్లీ ఏడ్చి కిందకి వెళ్లి అగరబత్తీతో చిల్లీ బాంబ్ కాల్చాను. అది వచ్చి నా చేతికి తగలడంతో చేయి బాగా వాపు వచ్చింది. ఆ తర్వాత నుంచి దూరం నుంచి కాల్చడం, చెవుల్లో కాటన్ పెట్టుకోవడం.. ఇలా చాలా జాగ్రత్తలు తీసుకుని, కాల్చుతున్నాను.
చిన్నప్పుడు టపాసులు బాగా కాల్చేవాణ్ణి. కానీ శబ్ద కాలుష్యం, గాలి కాలుష్యం వద్దని ఇప్పుడు చాలా తగ్గించాను. ఏదో రెండు మూడు బాంబ్స్ పేల్చి వెళ్లి΄ోతాను. ప్రత్యేకించి స్నేక్ బాల్, స్నేక్ పిల్స్ వంటి వాటిని ఎక్కువ కాలుస్తున్నాను. ఫ్లవర్ పాట్ కూడా పేల్చడం మానేశాను. పర్యావరణానికి హాని చేయని ΄ాపప్స్ వంటివి పేల్చుతాను... అంతే. ఎక్కువ శబ్దం, వాయుకాలుష్యం వచ్చేవాటిని ఇప్పుడు స΄ోర్ట్ చేయట్లేదు.
నాకు అన్నయ్య ఉన్నాడు. శబ్దం, గాలి కాలుష్యం అంటే మా అన్నకి అస్సలు నచ్చదు. అందుకే కాల్చడం ఎప్పుడో ఆపేసాడు. నా చిన్నప్పుడు అంటే 9 సంవత్సరాలున్నప్పుడు టపాసులు బాగా కొనేవాడిని.
బాగా ఏడ్చి ఏడ్చి ఐదారు వేల రూపాయలకు కొనిపించేవాణ్ణి. కానీ, తక్కువ కాల్చేవాణ్ణి. దీంతో అవి తర్వాతి రెండు సంవత్సరాల వరకూ పనికొచ్చేవి. ప్రస్తుతం కేవలం ఓ వెయ్యి రూయల వరకు కొంటున్నాను. చిన్నప్పుడు నాకు ఆటమ్ బాంబ్ పేల్చడం రాదు. అందుకే మా నాన్నని తోడు తీసుకెళ్లేవాడిని. ఆరేళ్లవరకు కలర్‌ఫుల్‌వి తీసుకునేవాణ్ణి. పదేళ్లు వచ్చాక చిన్నగా బాంబుల వైపునకు వచ్చాను. ఈ దీపావళిని నేను ‘సమ్మర్ హాలిడేస్’ మూవీ సక్సెస్‌తో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను.
– డేరంగుల జగన్ మోహన్


