దీపావళి
– భువనచంద్ర, గీత రచయిత
చిన్నప్పటి నుంచి డబ్బు విలువ బాగా తెలుసు. మాది కలిగిన కుటుంబమే అయినా నేటికి 75 ఏళ్ల క్రితం దేశంలో డబ్బు తక్కువ ఉండేది. అందుబాటులో లేకుండా ఉండేది. మా కుటుంబం వారు స్వాతంత్య్ర పోరాటానికి నిధులు ఇచ్చి, ఆ తర్వాత ఆస్తుల అమ్మకాలు అయ్యి ఒన్ ఫైన్ మార్నింగ్ ఆర్థికంగా కష్టాలలోకి వచ్చిపడ్డాం. అప్పటికి నాకు ఊహ తెలిసే వయసు. స్కూలు ఫీజు నెలనెలా కట్టడానికి కూడా కష్టపడుతున్నారు మా నాన్న. ఆ కాలానికి ఐదు, పది రూపాయలకు కూడా టపాకాయలు చాలా వచ్చేవి. కాని వాటికి డబ్బు వృధా అని నేను ఇంట్లో అడిగేవాణ్ణి కాదు. అడిగినా ఇచ్చేవారు కాదు.
అలాగని దీపావళి చేసుకోవడం పిల్లలం ఆపలేము కాదు. అందుకని సూరేకారం, గంధకం, బొగ్గుపొడి తెచ్చుకుని సిసీంద్రీలు, చిచ్చుబుడ్లు తయారు చేసి కాల్చేవాడిని. ‘రోలూ రోకలి’ ఎక్కువ ఉపయోగించేవాళ్లం. కొంచెం పొడి వేసి గోడకు కొడితే ఢామ్మని సౌండ్ వచ్చేది. ఇక దీపావళి చాలా తక్కువ ఖర్చులో అయిపోవాలంటే తాటాకు టపాసులు చాలు. ఐదు పైసలకు కూడా చాలా తాటాకు టపాసులు వచ్చేవి. వాటిని కాల్చేవాళ్లం. పండగ అనుభూతి మిస్ అయ్యేది కాదు. అలాగని డబ్బు వేస్ట్ అయ్యేది కాదు. డబ్బు జాతీయ ధనం... దానిని వేస్ట్ చేయడం ఏమిటి అని నా భావన.
నా దృష్టిలో దీపావళి అంటే ఏమిటంటే కుటుంబ సభ్యులంతా పరస్పర ప్రేమ, అనురాగాలతో ఉండటమే. మా నాలుగో అక్కకూ నాకూ 11 నెలలే తేడా. తను ఒక క్లాసు తప్పి నా క్లాసులోకి వచ్చింది. మేమిద్దరం స్కూలు ఫైనల్ వరకూ కలిసే చదివాం. ఎంత అభిమానం ప్రేమతో ఉండేవాళ్లం. మా పెద్దన్నయ్య వాడిన టెక్ట్స్‌బుక్స్ మా రెండో అన్నయ్య... మా రెండో అన్నయ్య వాడిన టెక్ట్స్‌బుక్స్ నేను... అలా గడించింది జీవితం. అయినా సరే ఎప్పుడూ నవ్వుతూ నేటికీ మా బంధం అంతే గట్టిగా ఉంది. అది కదా జీవితం.
మళ్లీ జన్మంటూ ఉంటే అలా పుట్టాలి ఇలా పుట్టాలి అని అందరూ అనుకుంటారు. నేను ఇలాగే ఇదే తండ్రులకు పుట్టి ఇవే కష్టాలను అనుభవించాలని కోరుకుంటాను. ఆ సమయానికి అవి కష్టాలు. కాని తర్వాత మనకు అర్థమవుతుంది... అవి మనం ఎదుర్కొన్న సవాళ్లు అని. ఆ సవాళ్లే జీవితం అంటే ఏమిటో నాకు తెలియచేశాయి. మా నాన్నకు ఆరోగ్యం బాగలేనప్పుడు నేను స్కూలు వయసులోనే పొగాకు బోర్డులో రైతులకు అర్జీలు రాసిపెట్టి (పొలాలకు పురుగు మందు కొట్టించమని) ఒకరోజు చాలా చిల్లర సంపాదించాను.
సాయంత్రం పరిగెత్తుకుంటూ వెళ్లి మా నాన్నకు ఇస్తే ఆయన తడిదేరిన కళ్లతో అమ్మను పిలిచి ‘వీడు బతుకుతాడు.... నలుగురినీ బతికిస్తాడు’ అన్నాడు. నలుగురినీ బతికించానో లేదోగానీ నేను బతికాను. మనల్ని మనం సజావుగా బతికించుకోవడం దీపావళి. నలుగురిని బతికించగలిగితే పెద్ద దీపావళి.
నన్నడితే దీపావళి ఎప్పుడు లేదు? ఒక చినుకు కురిస్తే అది దీపావళి. చెట్టున ఒక చివురు తొడిగితే దీపావళి. ఒక ఆత్మీయ స్పర్శ దీపావళి. పసిపాప నవ్వు దీపావళి.
దీపావళి వస్తే నేను ఇష్టంగా చేసే పని ఇల్లంతా ప్రమిదలు పెట్టి నేనే స్వయంగా నూనె పోసి దీపాలు వెలిగించడం. ఆ వెలుగుని సంతోషంగా చూస్తూ కూచోవడం. ఒక దివ్వె మరో దివ్వెను వెలిగించాలి. ఒకరిని మరొకరం వెలిగించుకుంటూ ముందుకు సాగడమే జీవితం. ‘జ్యోత్ సే జ్యోత్ జగాతే చలో ప్రేమ్ కీ గంగా బహాతే చలో’.
హ్యాపీ దీపావళి. గాడ్ బ్లెస్.


