ఐదు రోజుల దీపావళి పండుగలో రెండోరోజు నరక చతుర్దశి. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు... దీపావళికి ముందురోజు జరుపుకునే ఈ పర్వదినం, చెడుపై మంచి సాధించిన విజయానికి, స్త్రీ శక్తికి నిదర్శనం. లోక కంటకుడైన నరకాసురుడి పీడ విరగడైనందుకు ఆనందంగా జరుపుకునే ఈ పండుగ వెనుక ఒక గొప్ప పురాణ గాథ, విశిష్టమైన ఆచారాలు ఉన్నాయి.
నరక చతుర్దశిలో సత్యభామ పాత్ర అత్యంత విశిష్టమైనది కీలకమైనది. ఎందుకంటే ఈ పండుగ సత్యభామ శౌర్యానికి, ధైర్యానికి, స్త్రీ శక్తికి దక్కిన గొప్ప గౌరవం అని చెప్పాల్సి ఉంటుంది.
భాగవత పురాణం ప్రకారం, భూదేవి కుమారుడైన నరకాసురుడు బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేసి చావులేకుండా వరం కోరతాడు. బ్రహ్మ అది అసాధ్యమని అనడంతో తన తల్లి చేతిలో తప్ప మరెవరి వల్లా మరణం రాకూడదని కోరతాడు. సరేనంటాడు బ్రహ్మ. ఆ విధంగా బ్రహ్మ నుంచి అజేయమైన వరాలను పొందిన నరకుడు, ప్రాగ్జ్యోతిషపుర రాజధానిగా ముల్లోకాలను పీడించేవాడు. సాధువులను, మునులను వేధించడమే కాకుండా, క్షుద్రపూజలలో బలిచ్చేందుకు గానూ 16 వేల వంద మంది కన్యలను బంధించాడు. దేవమాత అదితి కుండలాలను, వరుణుడి ఛత్రాన్నీ కూడా దొంగిలించాడు.
ప్రజలందరూ నరకుడి ఆగడాల గురించి శ్రీకృష్ణుడికి మొరపెట్టుకోవడంతో ఇక ఉపేక్షించేది లేదని కృష్ణుడు నరకాసురుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో సత్యభామ తాను కూడా యుద్ధానికి వస్తానని పట్టుబట్టడంతో శ్రీ కృష్ణుడు ఆమెను తన గరుడ వాహనంపై ఎక్కించుకుని ప్రాగ్జ్యోతిషపురానికి బయలుదేరాడు.
ప్రాగ్జ్యోతిషపురం చుట్టూ నరకాసురుడు దుర్భేద్యమైన రక్షణ వలయాలను ఏర్పాటు చేశాడు. అలాగే మురాసురుడు అనే ఐదు తలల భయంకరమైన రాక్షసుడు దానికి కాపలాగా ఉన్నాడు. శ్రీ కృష్ణుడు తన సుదర్శన చక్రంతో ఆ వలయాలను ఛేదించాడు. అడ్డుపడ్డ మురాసురుడిని, అతని కుమారులను సంహరించాడు. అది తెలిసిన నరకాసురుడు క్రోధంతో తన అపార సైన్యంతో, గజదళంతో స్వయంగా యుద్ధరంగంలోకి దిగాడు. కృష్ణుడు నరకుడి సైన్యాన్ని క్షణాల్లో తుత్తునియలు చేశాడు.
యుద్ధం సాగుతుండగా నరకాసురుడు శ్రీ కృష్ణుడిపై ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దెబ్బకు కృష్ణుడు స్పృహ కోల్పోవడంతో సత్యభామ తీవ్ర ఆగ్రహంతో విల్లంబులు చేతబూని నరకాసురుడిపై లంఘించి పోరాడుతూ నరకుడి సైన్యాన్ని చీల్చి చెండాడింది. చివరకు సత్యభామ సంధించిన తీక్షణమైన బాణాల ధాటికి తాళలేక నరకాసురుడు నేలకూలాడు.
నరకుడు మరణించే సమయంలో తన తల్లిని గుర్తించి, తన తప్పులను క్షమించమని వేడుకున్నాడు. తన మరణదినాన్ని ప్రజలందరూ శాశ్వతంగా గుర్తుంచుకునేలా వరం ఇవ్వమని కోరాడు.
అందుకే నరకుడు మరణించిన రోజును నరక చతుర్దశి అంటారు. ఆ దుష్టుడి పీడ ఆ రోజున వదిలిపోయిన ఆనందంలో మరుసటి రోజు ప్రజలంతా దివ్వెలు (దీపాలు) వెలిగించి, బాణాసంచా కాల్చి దీపావళి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఆ విధంగా నరకుడి పేరు నిలిచిపోయింది.
నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే లేచి, నువ్వుల నూనె ఒంటికి రాసుకుని, నలుగు పెట్టుకుని తలంటు స్నానం చేయాలి. ఈ రోజున నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగమ్మ కొలువై ఉంటారని శాస్త్రోక్తి. ఈ స్నానం వల్ల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. స్నానానంతరం దేవుడి గదిలో పూజ చేసి, ఇంటి ముంగిట ముగ్గులు వేయాలి.
సాయంత్రం వేళ యమధర్మరాజును ప్రసన్నం చేసుకోవడానికి, అపమృత్యు దోషాలు తొలగడానికి ఇంటికి దక్షిణ దిశలో దీపాలు వెలిగిస్తారు. దీన్నే ‘యమ దీపం’ అంటారు. ఈ యమదీపాన్ని సాధారణంగా ఇంటి యజమాని లేదా యజమానురాలు మాత్రమే వెలిగించడం ఆచారం. ఇక సాయంత్రం ఇల్లంతా ప్రమిదలతో అలంకరించి, లక్ష్మీపూజకు నాంది పలుకుతూ బాణసంచా కాలుస్తారు. ఈ పండుగ మనలోని అజ్ఞానాన్ని, దుర్గుణాలను (రాక్షస ప్రవృత్తిని) వదిలి, జ్ఞాన మార్గంలో పయనించాలనే సందేశాన్ని ఇస్తుంది.
– డి.వి.ఆర్


