‘ఎన్ని రోల్స్ వేసినా రాని ప్రశంసలు సత్యభామ పాత్రకు దక్కుతాయి. అంతటి శక్తిమంతమైన పాత్ర అది. ఆమె హావభావాలు, తెగువ.. అపారమైనవి. నేటి మహిళ సత్యభామలాగ అంతే ధైర్యంగా ఉండాలి’ అంటూ సత్యభామ పాత్రలో లీనమైన నాటకరంగ కళాకారిణులు పంచుకున్న విషయాలివి..
‘సత్యభామ’ గురించి ఎంత చెప్పినా తక్కువే. కవులు ఆమె అందం గురించి వర్ణించారు. భర్తను ప్రేమించే ఇల్లాలు, తన మాటే చెల్లాలనే గర్వం గురించే కాదు నరకాసుర వధలో ధైర్యం, చూపిన సాహసం అసామాన్యంగా ఉంటుంది. ఇప్పటికీ సత్యభామను గుర్తుచేసుకుంటున్నామంటే అన్నింటిలోనూ ముందంజలో ఉండాలనే తపనతో పాటు స్త్రీలను హింసించేవారి ఆగడాలకు అడ్డుకట్టవేసేంతటి తెగువ కూడా ఉండడమే.
నేను మూడేళ్లుగా నాటకాలలో వివిధ రకాల పాత్రలు పోషిస్తున్నాను. సత్యభామ పాత్రకు నన్ను ఎన్నుకున్నప్పుడు మా టీమ్‌లోనే స్పెషల్‌గా చూస్తారు. ఆ పాత్రను పోషించడానికి, లీనమవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఎన్ని సార్లు చేసినా, ఇంకా బాగా చేసి ఉండాల్సింది అనిపిస్తుంది. సత్యభామ రోల్ చేయడమే కాదు ఆమెలా నా జీవితం ఉండటానికీ చాలా ప్రయత్నిస్తుంటాను. ఈ పండగ వేళ ఆమెను గుర్తుచేసుకోవడం అంటే మనందరం అలాంటి లక్షణాలను అలవర్చుకోవాలనే.
– ప్రియాంక, రంగస్థల నటి
యుద్ధానికైనా.. వెనకడుగువేయకూడదు
నేను ఇప్పటి వరకు వేదికమీద నాలుగు వేలకుపైగా వివిధ రకాల పాత్రలను ప్రదర్శించాను. వాటిలో పదిహేను వందలకు పైగా ‘సత్యభామ’ పాత్రలే వేశాను. ఆ వేషం వేసినప్పుడు నాకే తెలియని దర్పం వస్తుంది. శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి. కానీ, సత్యభామ విషయంలో మాత్రం ఆయన ఆమెకే సొంతం. ‘మీరజారగలడా నా ఆనతి..’ అని చూపే ఆ దర్పం మాటల్లో చెప్పలేం.
నారదుడితో ‘మంత్రమో, తంత్రమో... ఏదైనా చెప్పండి. నా భర్త నాకు వశం కావాలి’ అని అడుగుతుంది. అదే తులాభారానికి దారి తీసింది. అన్నింటినీ ధారపోసి, ఎన్నో పాట్లు పడి.. చివరికి భర్తను చేరుకుంటుంది. ఆ వేషంలో ఉన్నప్పుడు నేను అనే విషయమే మర్చిపోతాను. సత్యభామలా రెడీ అయితే ... నా నడక, మాట తీరు అన్నీ మారిపోతాయి. అంత శక్తిమంతమైన పాత్ర అది.
ఎన్నో అవార్డులు, ప్రశంసలు తెచ్చిపెట్టిన పాత్ర. నేటికీ.. ఎవరినుంచైనా ప్రమాదం పొంచి ఉందంటే స్త్రీని కదా అని వెనకడుగు వేయకుండా యుద్ధం చేసైనా మన హక్కులను మనం కాపాడుకోవాలి.. అనే విషయాన్ని సత్యభామ పాత్ర చెబుతుంది. ఎవరైనా మనల్ని చెడుగా చూడకూడదన్నా, ఎదుటివారికి ధైర్యం చెప్పాలన్నా సత్యభామ లాగే ఉండాలి. ఈ కాలంలో ఆవిడలా ఉంటేనే నిలదొక్కుకోగలుగుతాం.
– డా.జి.రత్నశ్రీ, నటభారతి, కడప
శ్రీకృష్ణుని అష్టభార్యలలో సత్యభామ పాత్ర తెలుగునాట చాలా విశిష్టమైనది. సత్యభామలోని ప్రణయ గర్వం, ఈర్ష్య, విరహం, చివరకు కృష్ణునికి ఆత్మసమర్పణ చేసే తత్వాన్ని రంగస్థలంపై అద్భుతంగా పండించి ప్రశంసలు అందుకున్నవారు, అందుకుంటున్నవారందరో. స్త్రీలను హింసించేవారిపై వింటిని ఎక్కుపెట్టిన వీరనారిగానూ సత్యభామ ఘనత అమోఘమైనదిగా చూపుతారు. నాటకరంగంలో తమ అసాధారణ ప్రతిభతో అలనాటి ‘సత్యభామ’ను నేడు కళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తున్నారు.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఇదీ చదవండి: అదే దీపావళి వెలుగు..!: నటి అర్చన


