సిక్కుల దీపావళి..బందీచోర్‌ దివస్‌ | Diwali 2026: Sikhs Celebrate Bandi Chhor Diwas | Sakshi
Sakshi News home page

సిక్కుల దీపావళి..బందీచోర్‌ దివస్‌

Nov 7 2026 8:41 AM | Updated on Nov 7 2026 8:41 AM

Diwali 2026: Sikhs Celebrate Bandi Chhor Diwas

తనకి స్వేచ్ఛనిస్తే సరిపోదు తనతో పాటు ఉన్నవారందరినీ బంధ విముక్తి చేయాలని పట్టుబట్టాడో గురువు. తన విముక్తిని ఇతరుల స్వేచ్ఛతో ముడిపెట్టి నిస్వార్థంగా బతికిన ఆ గురువు అసాధారణ త్యాగానికి గుర్తింపుగా సిక్కులు దీపావళి పండుగని జరుపుకుంటారు. 17వ శతాబ్దంలో సిక్కుల ఆరో గురువైన గురు హర్‌గోవింద్‌ సాహిబ్‌ను మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ గ్వాలియర్‌ కోటలో నిర్బంధించాడు. ఆయనతో పాటు మరో 52 మంది రాజపుత్రులను కూడా అదే కోటలో బందీలుగా ఉంచాడు. 

కొంతకాలానికి గురు హర్‌గోవింద్‌ను విడుదల చేయాలని చక్రవర్తి ఆదేశించాడు. అయితే తనతోపాటు మిగిలిన రాజపుత్రులను కూడా విడుదల చేయాలని హర్‌గోవింద్‌ పట్టుబట్టాడు. అందుకు జహంగీర్‌ చక్రవర్తి ఒక షరతు పెట్టాడు. గురువు ధరించిన వస్త్రాన్ని పట్టుకుని కోట బయటకి వచ్చినవారిని మాత్రమే విడుదల చేస్తానని చెప్పాడు. దీంతో గురు హర్‌గోవింద్‌ 52 పట్టీలున్న ఓ ప్రత్యేకమైన పొడవాటి వస్త్రాన్ని కట్టుకున్నాడు. 

ఒక్కో రాజు ఒక్కో పట్టీ పట్టుకుని బయటకి వచ్చాడు. అలా రాజపుత్రులందరూ స్వేచ్ఛని పొందారు. ఈ సంఘటన తర్వాత గురు హర్‌గోవింద్‌కు ‘బందీ చోర్‌’ అనే పేరు వచ్చింది. అంటే బందీలను విడిపించినవాడు అని అర్థం. ఈ విముక్తి సంఘటనను గుర్తుజేసుకుంటూ సిక్కులందరూ దీపావళి రోజున ‘బందీ చోర్‌ దివస్‌’పేరిట పండుగ చేసుకుంటారు. 

పూర్వీకులకు దారి చూపించే బడబడువా డాకా
దీపావళి రాత్రి సాధారణంగా ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తారు. కానీ ఒడిశాలో మాత్రం పూర్వీకులకు దారి చూపిస్తూ కాగడాలు వెలిగిస్తారు. ఈ ప్రత్యేక ఆచారాన్ని ’బడబడువా డాకా’ అంటారు. ఇందులో భాగంగా ఎండిన జనపనార కాడలతో తయారు చేసిన కట్టలను వెలిగిస్తారు. వీటిని స్థానికంగా కౌన్రియా కాఠి అంటారు. అనంతరం వాటిని ఆకాశం వైపు ఎత్తిపట్టి పూర్వీకులను స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థన చేస్తారు. 

‘పూర్వీకులారా చీకటిలో రండి.. వెలుగులో తిరిగి వెళ్లండి’ అంటూ పిలుస్తారు. మహాలయ పక్షంలో భూమికి వచ్చిన పూర్వీకులు దీపావళి రోజున తిరిగి తమ లోకాలకు వెళ్తారని అక్కడి ప్రజల విశ్వాసం. పూరీలోని జగన్నాథ ఆలయం సమీపంలో వేలాది మంది భక్తులు ఈ ఆచారాన్ని సామూహికంగా నిర్వహిస్తారు. పూర్వీకులను స్మరించుకుంటూ వారి ఆశీస్సులు కోరడం ఈ సంప్రదాయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.  

ఇదీ చదవండి: చిరు దివ్వెలు..! కాలుష్యం పెరక్కుండా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement