ప్రయాణికుడిని ఎక్కించుకోకుండా వెళ్లిన బస్సు.. ట్రావెల్స్ సంస్థకు షాక్! | Bus Leaves Passenger Behind Travels Firm Fined Rs 14725 | Sakshi
Sakshi News home page

ప్రయాణికుడిని ఎక్కించుకోకుండా వెళ్లిన ప్రైవేట్ బస్సు.. ట్రావెల్స్ సంస్థకు షాక్!

Nov 7 2026 7:17 AM | Updated on Nov 7 2026 7:21 AM

Bus Leaves Passenger Behind Travels Firm Fined Rs 14725

రైళ్లలో టికెట్లు అందుబాటులో లేనప్పుడు.. చాలామంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆశ్రయిస్తుంటారు. అత్యవసర ప్రయాణాలు ఉన్నప్పుడు, ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని, నిర్ణీత సమయానికి పికప్ పాయింట్‌కు చేరుకుంటారు. అయితే.. టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ బస్సు బోర్డింగ్ పాయింట్ వద్ద ఆగకుండా వెళ్లిపోతే.. ప్రయాణికుడి పరిస్థితి ఎలా ఉంటుంది?. అచ్చం ఇలాంటి చేదు అనుభవమే ఓ ప్రయాణికుడికి ఎదురైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బళ్లారి నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు రూ.1,725 పెట్టి బస్సు టికెట్ బుక్ చేసుకున్న.. అనుదీప్ అనే వ్యక్తి 2026 మార్చి 21న బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. రాత్రి 11 గంటలకు బళ్లారిలోని దుర్గమ్మ ఆలయం సమీపంలో బస్సు ఎక్కాల్సి ఉంది. అనుదీప్ తన తల్లిదండ్రులతో కలిసి సమయానికి పికప్ పాయింట్‌కు చేరుకున్నా, బస్సు అక్కడ ఆగలేదు. డ్రైవర్, కండక్టర్‌కు ఫోన్ చేసినా స్పందన రాలేదని అతను ఆరోపించాడు.

చివరకు బస్ ట్రావెల్స్ ఆఫీసు వద్దకు వెళ్లడంతో.. అనుదీప్ అక్కడికి చేరుకుని బస్సు ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే తనను బస్సు ఎక్కనివ్వలేదని ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత బస్సు ప్రయాణం ప్రారంభమైనప్పటికీ.. మార్గమధ్యలో మూడు, నాలుగు సార్లు సాంకేతిక సమస్యలతో ఆగిపోయింది. చివరకు మోతి సర్కిల్ వద్ద బస్సు పూర్తిగా నిలిచిపోయింది. వాహనం ముందుకు వెళ్లలేదని డ్రైవర్, కండక్టర్ చెప్పడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నోటీసులకు స్పందించని సంస్థ
ఈ ప్రయాణం కారణంగా హైదరాబాద్‌లో జరగాల్సిన అత్యవసర ఆఫీస్ మీటింగ్‌కు అనుదీప్ హాజరు కాలేకపోయాడు. తన టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు.. బస్సు సిబ్బంది తనతో పాటు తల్లిదండ్రులతో కూడా దురుసుగా మాట్లాడారని ఆరోపించాడు. దీంతో 2026 ఏప్రిల్ 10న సంస్థకు లీగల్ నోటీసు పంపించాడు. అయినప్పటికీ.. సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బళ్లారి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.

ఈ కేసులో కమిషన్ నోటీసులు పంపించినప్పటికీ.. సంస్థ తరఫున ఎవరూ విచారణకు హాజరు కాలేదు. దీంతో సంస్థ గైర్హాజరీలోనే కేసును విచారించారు. అనుదీప్ సమర్పించిన బస్ టికెట్, లీగల్ నోటీసు, పోస్టల్ రసీదు వంటి ఆధారాలను పరిశీలించిన కమిషన్, ప్రయాణాన్ని పూర్తి చేయడంలో ట్రావెల్స్ సంస్థ విఫలమైందని గుర్తించింది. ప్రయాణికుడికి ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం కల్పించకపోవడం, అతనికి కలిగిన మానసిక వేదన, ఆఫీస్ మీటింగ్‌కు హాజరు కాలేకపోవడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంది.

రూ.14725 జరిమానా
దీంతో 2026 అక్టోబర్ 13న తీర్పు వెలువరించిన కమిషన్.. ట్రావెల్ సంస్థకు మొత్తం రూ.14,725 చెల్లించాలని ఆదేశించింది. ఇందులో టికెట్ డబ్బులు రూ.1,725, సేవల లోపం కారణంగా రూ.5,000, మానసిక వేదనకు రూ.5,000, కేసు ఖర్చుల కింద రూ.3,000 ఉన్నాయి. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని, ఆలస్యమైతే సంవత్సరానికి 6 శాతం వడ్డీ కూడా చెల్లించాలని స్పష్టం చేసింది. సంస్థ ఆదేశాలను ఉల్లంఘిస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం, 2019లోని సెక్షన్ 72 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని కమిషన్ తెలిపింది.

ఇదీ చదవండి: తగ్గనున్న ట్రైన్ టికెట్ ధరలు.. కొత్త రూల్స్ వస్తున్నాయ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement