20 శాతం కమీషన్ ఇస్తే క్లెయిమ్‌లకు ఆమోదం
నెట్‌వర్క్ ఆస్పత్రులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బేరసారాలు
కమీషన్ ఇవ్వకపోతే క్లెయిమ్‌లన్నీ తిరస్కరణకు గురవుతాయని బెదిరింపులు
సీటీడీ, ఆడిట్ కమిటీ తిరస్కరించిన క్లెయిమ్‌లపై వసూళ్ల దందాకు తెర
రెగ్యులర్ బిల్లు చెల్లింపుల్లోను కార్పొరేట్ కమీషన్ ఒప్పందాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 1.40 కోట్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆపద్బాంధవి అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అక్రమార్జనకు ఆయుధంగా ప్రభుత్వ పెద్దలు మార్చేశారు. పక్కా వ్యూహంతో సీఎం సొంత సామాజికవర్గం అధికారులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లోని కీలక స్థానాలను ప్రభుత్వం నింపేసింది. వీరిద్వారా పెద్దఎత్తున దోపిడీ కార్యక్రమాలకు తెరలేపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో రోగులకు అందించిన చికిత్సల క్లెయిమ్‌ల ఆమోదానికి 20 శాతం కమీషన్ ఇవ్వాలని ట్రస్ట్ నుంచి ఫోన్లు చేస్తున్నారని ఆస్పత్రుల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. కమీషన్ ఇవ్వకపోతే క్లెయిమ్‌లు తిరస్కరిస్తామని ఆ తర్వాత మీరే నష్టపోతారని బెదిరిస్తున్నారని వాపోతున్నాయి.
అరకొర బిల్లుల్లో 30 శాతం
నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో అందించిన చికిత్సల క్లెయిమ్‌లను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిశీలించి ఆమోదించాక ప్రభుత్వం బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో క్లెయిమ్ ట్రస్ట్ డాక్టర్ (సీటీడీ) తిరస్కరించిన క్లెయిమ్‌లతోపాటు ట్రస్ట్ ఆడిట్ కమిటీ పక్కన పెట్టిన క్లెయిమ్‌లపై దందాకు తెరలేపారని సమాచారం. ఇలాంటివి రూ.వందల కోట్ల విలువ చేసే క్లెయిమ్స్ ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని ఆమోదించడం కోసం 20 శాతం కమీషన్ ఇవ్వాలని ట్రస్ట్‌లోని కీలక అధికారులు ఉద్యోగుల ద్వారా ఆస్పత్రుల యజమానులకు ఫోన్లు చేయిస్తున్నారు. కమీషన్ ఇవ్వకపోతే క్లెయిమ్స్ అన్నీ తిరస్కరణకు గురవుతాయని బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆరోగ్యశ్రీ పథకం కింద అందించిన చికిత్సలకే ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని, దీనికి తోడు కమీషన్ల పేరిట వేధిస్తున్నారని ఆస్పత్రుల యజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఆరోగ్యశ్రీ కింద వచ్చే అరకొర బిల్లుల్లో 20 శాతం ట్రస్ట్‌లో కమీషన్లు, టీడీఎస్ రూపంలో మరో 10 శాతం చొప్పున మొత్తం 30 శాతం కోత పెడితే ఆస్పత్రులు మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని అంటున్నారు. నిబంధనల ప్రకారం ఇలా పక్కన పెట్టిన క్లెయిమ్‌లపై ఆస్పత్రుల వివరణ తీసుకుని అన్ని సక్రమంగా ఉంటే ట్రస్ట్ ఆమోదించాలి. వివరణలేమీ తీసుకోకుండా నేరుగా కమీషన్ బేరాలకు దిగుతుండటం నెట్‌వర్క్ ఆస్పత్రుల వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
సాధారణ బిల్లుల్లోనూ కమీషన్ ఒప్పందాలు
మరోవైపు నెట్‌వర్క్ ఆస్పత్రులకు విడుదల చేసే సాధారణ బిల్లులకు ట్రస్ట్‌లో కార్పొరేట్ కమీషన్ డీల్స్ నడుస్తున్నట్టు చర్చ నడుస్తోంది. ఏపీ, తెలంగాణలోని ప్రముఖ క్యాన్సర్, ఇతర వైద్యసేవల కార్పొరేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలో ఉన్నాయి. ఈ ఆస్పత్రులకు కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌తో లైజనర్‌లుగా వ్యవహరిస్తున్నారు. వీరి ద్వారా బిల్లింగ్‌పై 10 శాతం కమీషన్ డీల్స్ పెట్టుకుని చెల్లింపుల్లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ (ఫిఫో) విధానాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
అంతేకాకుండా ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ అనుమతులు ఇచ్చేందుకు స్పెషాలిటీకి రూ.4 లక్షల చొప్పున ట్రస్ట్‌లో వసూలు చేస్తున్నట్టు వెల్లడవుతోంది. కొన్నేళ్ల కిందట క్యాన్సర్ చికిత్సల్లో ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి అక్రమాలకు పాల్పడింది. 2024లో ప్రభుత్వం మారాక ట్రస్ట్‌లోని రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ(ఎస్‌డీసీ)లో అక్రమాల కేసును మూసివేయించుకుని ఇటీవలే తిరుపతిలో ఓ బ్రాంచ్‌కు అనుమతులు దక్కించుకుంది. ఈ డీల్ వెనుక రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు చేతులు మారినట్టు సమాచారం. ఇదే కార్పొరేట్ సంస్థ విజయవాడ, హైదరాబాద్‌లో బ్రాంచ్‌లకు అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.


