9 మంది మత్స్యకారుల గల్లంతు
ప్రకాశం జిల్లాలో సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన 4 మృతదేహాలు
మిగిలిన వారి కోసం గాలిస్తున్న కోస్ట్‌గార్డ్ బృందాలు..
మురసు తుపానులో చిక్కుకుని ప్రమాదానికి గురైన బోటు
ఒంగోలు సబర్బన్/ఒంగోలు టౌన్/సాక్షి, చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై హార్బర్‌కు చెందిన సోనా బోటు ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరానికి సమీపంలో సముద్ర జలాల్లో ప్రమాదానికి గురైంది. మురసు తుపాను తాకిడికి కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 9 మంది మత్స్యకారులు మరణించినట్టు అనుమానిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని సముద్ర తీరానికి 4 మృతదేహాలు చేరగా.. మిగిలిన ఐదుగురి ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్ బృందాలు గాలిస్తున్నాయి. గురువారం కొత్తపట్నం సముద్ర తీరంలో మూడు మృతదేహాలు, మండలంలోని పిన్నివారిపాలెం తీరానికి మరో మృతదేహం కొట్టుకొచ్చాయి.
స్థానిక మత్స్యకారులు ఇచ్చిన సమాచారంతో కలెక్టర్ పి.రాజాబాబు, ఒంగోలు ఆర్డీవో టి.చంద్రశేఖర్ రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిసి కొత్తపట్నం సముద్ర తీరానికి చేరుకున్నారు. చెన్నై మత్స్య శాఖ, చెన్నై హార్బర్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. గత నెల 29న చెన్నై హార్బర్ నుంచి కూడిన మూడు సోనా బోట్లలో మత్స్యకార బృందాలు సముద్రంలో చేపల వేటకు బయల్దేరాయి. వీటిలో రెండు రామాయపట్నం పోర్టులో ఆగిపోయాయి. మరోబోటు ప్రమాదానికి గురై మునిగిపోయింది.
ఇక ప్రమాదానికి గురైన వారిలో చెన్నై రాయపురానికి చెందిన పక్కిరి సామి (49), రాయపురం వాషర్‌మెన్ పేటకు చెందిన కుప్పం మనోహరన్ (40), రాయపురానికే చెందిన మోహన్ (47), చెన్నై తిరువత్తియూర్‌కు చెందిన రాజేష్ (52), తోండియర్ పేటకు చెందిన మురుగన్ (48), రాయపురానికి చెందిన కుప్పుస్వామి (58), తిరువత్తియూర్‌కు చెందిన విజయ్‌కాంత్ (44), తోండియర్‌కు చెందిన అరవింద్ (40), కడలూరుకు చెందిన నారాయణన్ (57)గా గుర్తించారు. మరోవైపు.. లభ్యమైన మృతదేహాలను తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి ఎన్. మేరీ విల్సన్ గురువారం రాత్రి పరిశీలించారు.


