పల్నాడు జిల్లా కరాలపాడులో వైఎస్సార్‌సీపీ నేతలను తరిమికొడుతున్న సీఐ శ్రీరామ్ వెంకట్రావు
పరిషత్ ఎన్నికల్లోనూ యథేచ్ఛగా టీడీపీ గూండాల రిగ్గింగ్
కేవలం రెండు గంటల వ్యవధిలో నమోదైన అసాధారణ పోలింగ్ శాతమే రుజువు
రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించిన లెక్కలే అక్రమాలకు సాక్ష్యం
సాక్షి, అమరావతి: మునిసిపల్ ఎన్నికల మాదిరిగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం టీడీపీ గూండాలు బూత్‌లను ఆక్రమించి.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను రానివ్వకుండా అడ్డుకుని, యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారు. అసాధారణ రీతిలో గంటల వ్యవధిలో అతి వేగంగా పోలైన ఓట్లే దీనికి నిదర్శనం! ప్రతి రెండు గంటలకు నమోదైన పోలింగ్ శాతాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా మీడియాకు విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారమే... మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 30.50 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ప్రకటించగా... మధ్యాహ్నం 3 గంటలకు ఏకంగా 58.55 శాతం నమోదైనట్టు ప్రకటించింది.
గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆరు గంటల్లో రాష్ట్రం మొత్తం 30.50 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. కానీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఏకంగా 28.05 శాతం ఓటింగ్ నమోదైనట్లు ప్రకటించడం గమనార్హం. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం చిత్రచేడులో జేసీ అనుచరులు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడటంతో ఉదయం 11.30 గంటలకే ఏకంగా 90 శాతం ఓటింగ్ నమోదైంది.
స్థానిక సీఐ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను, నాయకులను ఉదయమే స్టేషన్‌కు తరలించి రిగ్గింగ్‌కు పచ్చజెండా ఊపారు. ఇక నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తూర్పుపల్లి పోలింగ్ స్టేషన్ 25లో ఏకంగా 104.27 శాతం పోలింగ్‌తో రిగ్గింగ్‌లో టీడీపీ నేతలు సరికొత్త రికార్డు నెలకొల్పారు! కాగా, చివరకు సాయంత్ర గంటలకు 67.24 శాతం పోలింగ్ నమోదైనట్టు రాత్రి 10.30గంటల ప్రాంతంలో ఎస్‌ఈసీ మీడియాకు తెలిపింది.
ఉదయం గంటకు సరాసరి 5 శాతమే..
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా 30,994 కేంద్రాల ద్వారా కొనసాగగా.. మొత్తం 2,24,32,460 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ నమోదు సరళిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రతి రెండు గంటల ఒక విడత చొప్పున ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 11 గంటలకు, ఒంటి గంటకు, సాయంత్రం 3 గంటలకు.. ఇలా ఓటింగ్ శాతాలను ప్రకటించింది. అయితే, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేవలం పోలింగ్ శాతాలను జిల్లాల వారీగా, రాష్ట్రం మొత్తం ప్రకటించి.. మధ్యాహ్నం 3 గంటల వివరాలు మాత్రం జిల్లాల వారీగా, రాష్ట్రం మొత్తం ఓట్లు వేసిన ఓటర్ల సంఖ్య వివరాలతో సహా పోలింగ్ శాతాలను ప్రకటించింది. ఉదయం 9 గంటల వరకు 11.71 శాతం.. 11 గంటల సమయానికి 21.12 శాతం.. మధ్యాహ్నం ఒంటి గంటకు 30.50 శాతం నమోదైనట్టు పేర్కొంది.
సగం బూత్‌లలోనే సీసీ కెమెరాలు.. ఆఫ్‌లైన్ రికార్డింగ్!
పోలింగ్ బూత్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించినప్పటికీ.. అధికార పార్టీ గూండాల రిగ్గింగ్ బయట పడకుండా ఆఫ్‌లైన్‌లో ఫుటేజీ రికార్డు, సిమ్ సిగ్నల్ అంతరాయాలు అంటూ డ్రామా నడిపినట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. గురువారం జరిగిన పోలింగ్‌లో మొత్తం 30,994 కేంద్రాలకుగాను 16,064 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.
అయితే తీరా పోలింగ్ ప్రక్రియ సమయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన చాలా చోట్ల ఫుటేజీ అన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో రికార్డు చేశారు. ఆఫ్‌లైన్‌లో వీడియో చిత్రీకరణ ఫుటేజీని నచ్చినట్లుగా ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పులివెందులలో టీడీపీ తన అక్రమాలను కప్పిపుచ్చేందుకు పోలింగ్ బూత్‌లలో ఆఫ్‌లైన్ సీసీ టీవీలు మాత్రమే ఉంచాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.


