ఏం చేశాడని చంద్రబాబుకు ఓటేస్తారు? | Former Chief Minister Ys Jagan Mohan Reddy fires on chandrababu naidu | Sakshi
Sakshi News home page

ఏం చేశాడని చంద్రబాబుకు ఓటేస్తారు?

Nov 6 2026 5:07 AM | Updated on Nov 6 2026 5:07 AM

Former Chief Minister Ys Jagan Mohan Reddy fires on chandrababu naidu

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్న

హమీలన్నీ తూచ్‌.. సూపర్‌ సిక్స్‌ లేదు.. సూపర్‌ సెవన్‌ లేదు..

అక్కచెల్లెమ్మలకు అన్యాయం.. సంక్షేమ పథకాలకు మంగళం 

విద్యార్థులకు మొండిచేయి.. విద్యాదీవెన.. నిరుద్యోగ భృతి గల్లంతు 

రైతులకు భరోసా కరువు.. బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, గిట్టుబాటు ధరకు దిక్కులేదు 

ఉద్యోగులకు షాక్‌.. ఐదు డీఏలు పెండింగ్, పీఆర్సీ, ఐఆర్‌ లేవు రూ.40 వేల కోట్ల బకాయిలు 

ప్రజలకు దూరమైన పాలన.. సచివాలయాలు, ఆర్బీకేలు, వలంటీర్‌ వ్యవస్థ నిర్వీర్యం 

ఆరోగ్యశ్రీకి కష్టాలు.. ఆస్పత్రుల్లో మందుల కొరత 

ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ.. మెడికల్‌ కాలేజీలు, పోర్టులు, హార్బర్ల అమ్మకానికి సిద్ధం 

స్కామ్‌లకు అడ్డూ అదుపూ లేదు.. రాజధాని,  లేటరైట్, ఇసుక, మట్టి, భూముల్లో అవినీతి  

మాఫియాల రాజ్యం.. లిక్కర్, గంజాయి ఉధృతం.. క్షీణించిన శాంతిభద్రతలు 

మంటగలిసిన ఏపీ ప్రతిష్ఠ.. సౌత్‌ బిహార్‌తో పోల్చే దుస్థితి

సాక్షి, అమరావతి : ‘‘సూపర్‌ సిక్స్‌ లేదు.. సూపర్‌ సెవన్‌ లేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీలకు మంగళం. మూడేళ్లలో అన్ని వర్గాలనూ మోసం చేసిన చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ఏం చేశాడని ఓటేస్తారు?’’ అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హామీల వర్షం కురిపించి ఇంటింటికీ బాండ్లు.. అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా హామీలకు తిలోదకాలు! 

అక్కచెల్లెమ్మలకు సంక్షేమ పథకాలు దూరం.. విద్యార్థులకు విద్యాదీవెన కరువు.. నిరుద్యోగులకు భృతి లేదు.. రైతులకు భరోసా లేదు.. ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు లేదు. మరోవైపు ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు, స్కామ్‌ల ఆరోపణలు, మాఫియాల పెరుగుదల, శాంతిభద్రతలపై ఆందోళనలు. ఇదీ చంద్రబాబు మూడేళ్ల పాలన.. ఇందులో ఏం చూసి ప్రజలు ఓట్లేస్తారు?’ అని ఆయన ప్రశ్నించారు. ‘ఎన్నికలు నిజంగా స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగితే ఎక్కడ తన అడ్రస్‌ గల్లంతవుతుందోనన్న భయంతోనే చంద్రబాబు ఎన్నికల ప్రక్రియను పూర్తిగా హైజాక్‌ చేశాడు’ అని జగన్‌ ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

హామీలన్నీ మోసం.. 
‘‘నిజంగా ఎన్నికలు సజావుగా జరిగితే చంద్రబాబు ఎందుకు గెలుస్తాడు. ఈ మూడేళ్లలో ప్రజలకు ఆయన ఏం చేశాడని ప్రజలు ఆయనకు ఓటు వేస్తారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ 7 అని చెప్పాడు. 143 హామీలు ఇచ్చాడు. సినిమా స్టార్ట్‌ జూన్‌ 2024 అని ప్రతీ ఇంటికి వెళ్లి బాండ్లు ఇచ్చాడు. అక్కచెల్లమ్మలకు ఆడబిడ్డ నిధి అంటూ అడ్డగోలుగా మోసాలు చేశాడు. అంతకుముందు అక్కచెల్లెమ్మలకు వచ్చే ఆసరా, చేయూత, కాపునేస్తం, ఓబీసీ నేస్తం పోయింది. చివరికి సున్నా వడ్డీ పథకం కూడా ఎగ్గొట్టాడు. 

ఇలాంటి పరిస్థితుల్లో అక్కచెల్లెమ్మలు చంద్రబాబును నిలదీస్తున్న పరిస్థితులున్నాయి. చివరికి చిన్న పిల్లలను కూడా మోసం చేశాడు. విద్యాదీవెన, వసతి దీవెన నీరుగారిపోయింది. నిరుద్యోగ భృతి ప్రతీ నెలా రూ.3వేలు అని చెప్పి మోసం చేశాడు. చదువుకుంటున్న ఆ పిల్లలు సైతం చంద్రబాబును నిలదీస్తున్నారు. రైతున్నలకు ఉచిత పంటల బీమా లేదు. సమయానికి వచ్చే ఇన్‌పుట్‌సబ్సిడీ లేదు. సున్నా వడ్డీ లేదు. చివరకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో రైతన్నలు అవస్థలు పడతా ఉన్నారు. 

చివరకు సచివాలయాలు పోయాయి. ఆర్బీకేలు పోయాయి. వలంటీర్‌ వ్యవస్థ పోయింది. పారదర్శక పాలన పూర్తిగా కనుమరుగై పోయింది. ప్రభుత్వ వైద్యరంగం చూస్తే ఆస్పత్రుల్లో మందులు దొరకని పరిస్థితి  25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్య శ్రీ పరిస్థితి చూస్తే వెంటిలేటర్‌పై కన్పిస్తా ఉంది. ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు కూడా మోసాలుగా తేలాయి. వచ్చీరాగానే ఐఆర్‌ అన్నాడు పోయింది. పీఆర్సీ అన్నాడు దిక్కుదివాణం లేకుండా పోయింది. ఐదు డీఏలు పెండింగ్, రూ.40వేల కోట్ల బకాయిలు. 

స్కామ్‌లు చేస్తూ పప్పు బెల్లాల్లా అమ్మేస్తున్నారు
చంద్రబాబు హయాంలో జరిగిందేమిటంటే మనం తీసుకొచ్చిన 17 మెడికల్‌ కళాశాలలను పప్పుబెల్లాల మాదిరిగా అమ్మకానికి పెట్టాడు. పోర్టులు, హార్బర్లను స్కామ్‌లు చేస్తూ అమ్మకానికి రెడీగా పెట్టాడు. ప్రభుత్వ భూములను పావలాకు రూపాయికి తమకు కావాల్సిన వారికి కట్టబెడుతున్నారు. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ఫర్‌ సేల్‌ అన్నట్టుగా తయారైంది. మరొక వైపు చూస్తే.. ఎక్కడచూసినా సరే లిక్కర్, గంజాయి  మాఫియా రాజ్యమేలుతోంది. చివరికి వాటిలో కూడా స్కామ్‌లు చేస్తున్నారు. రాజధాని పేరిట స్కామ్‌లు. మట్టి, ఇసుక, లేటరైట్‌ ఏదైనా స్కామే. ఇంకొక వైపు లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితి చూస్తే.. మన హయాంలో ‘సేఫ్‌ ఆంధ్రా’ నుంచి ఇçప్పుడు ‘సేవ్‌ ఆంధ్ర’ అనే పరిస్థితికి దిగజారిపోయింది.  

ఏపీని సౌత్‌ బిహార్‌తో పోలుస్తున్నారు.. 
ఏపీ అంటే ఒక గౌరవం ఉండేది. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ను సౌత్‌ బిహార్‌తో కంపేర్‌ చేస్తా ఉన్నారు. డిజిటల్‌ విప్లవం నడుస్తా ఉన్న ఈ యుగంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం జెన్‌ జీ గొంతెత్తుతున్న సమయంలో కూడా రిగ్గింగ్‌ ఎలా చేయాలో, సైక్లింగ్‌ ఎలా చేయాలో ప్రజాస్వామ్యాన్ని ఎలాఖూనీ చేయాలో ట్యూషన్‌ పెట్టి మరీ చంద్రబాబు నేర్పిస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ఎస్‌ఈసీ, పోలీసులు, అధికార యంత్రాంగం పట్ల ప్రజల్లో పూడ్చలేని అగాధాన్ని సృష్టించారు. వాటి విశ్వసనీయతపై ప్రజల్లో నమ్మకం పోయిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు తన స్వార్ధం కోసం రాష్ట్ర పరువును, రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఫణంగా పెట్టాడు. 

ఇది కేవలం ఎన్నికల మానిప్యులేషన్‌ మాత్రమే కాదు. ఎలక్షన్‌ సబ్‌ వెర్షన్, ఆర్గనైజ్డ్‌ క్యాప్చర్‌ ఆఫ్‌ డెమొక్రసి, ఇన్‌ఫ్రింజ్‌మెంట్‌ ఆఫ్‌ పీపుల్స్‌ రైట్స్‌ టూ ఓట్‌ అండ్‌ కంటెస్ట్‌ ఎలెక్షన్స్‌..ఇవన్నీ చట్టప్రకారం క్రైమ్స్‌. దేశ చరిత్రలో బహుశా ఎక్కడా ఎప్పుడూ చూడని విధంగా ఈ రోజు అణిచివేతను ఎదుర్కొని నిలబడ్డాం. ఎన్నికల్లో పాల్గొనడం, ఓటు వేయడం ప్రజల హక్కంటూ ప్రజల తరçఫున బలంగా గొంతు విప్పగలిగాం. పోరాటం చేయగలిగాం. చంద్రబాబు చేస్తున్న ఈ అక్రమాలను దేశం దృష్టికి తీసుకెళ్లగలిగాం. ఇందులో భాగంగా మా పార్టీ కార్యకర్తలు, మా నాయకులు, నిజంగా హీరోల్లా పోరాటం చేశారు. వాళ్లందరికీ సెల్యూట్‌ చేస్తున్నా.. చంద్రబాబు గెలిచి ఓడారు. మేము ఓడి ప్రజల మనసుల్లో గెలిచాం. 

ప్రజల ప్రాణాలను కాపాడడంలో విఫలం 
ఇలాంటి పరిస్థితుల మధ్య  వరుసగా రెండు తుపానులు..కోలుకోలేని దెబ్బలు. మురసు తుపాను తీవ్రత ఇంతలా కనిపిస్తా ఉన్నా ఎన్నికలు వాయిదా వేయరు. ఏ ప్రభుత్వానికి అయినా ప్రధాన బాధ్యత ఏమిటి ప్రజల ప్రాణాలు కాపాడడం. ప్రజల ప్రాణాలు పోకుండా ప్రభుత్వం పనిచేసిందా లేదా అన్నది కొలమానం. అర్నబ్‌ తుపానులో 10 మంది చనిపోయారు. 10 రోజులవుతున్నా ఇప్పటికీ 150 గ్రామాలకు విద్యుత్‌ అందని పరిస్థితి. మురసు తుపానులో కూడా ఇద్దరు చనిపోయారు. చంద్రబాబు ఏం చేస్తున్నట్టు? 

రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోయినా ఎవరికైనా దమ్మిడి సాయం చేశాడా అని అడుగుతా ఉన్నా.. 13 నెలల క్రితం మోంథా తుపాను వస్తే ఇప్పటికి పైసా కూడా సాయం చేయలేదు. జీవోలు ఇచ్చాడు. కానీ డబ్బులు వేయలేదు. ఈరోజు రైతుల పరిస్థితి ఎలా ఉందంటే రైతులకు ఉచిత పంటల బీమా లేదు. సున్నావడ్డీ లేదు. సమయానికి.. సీజన్‌ ముగిసేలోగా వచ్చే ఇన్‌పుట్‌సబ్సిడీ కరువైపోయింది. ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. నిజంగా ఇలాంటి పరిస్థితుల మధ్య, చంద్ర బాబు పాలన మధ్య ప్రజలు, రైతులు అగచాట్లు పడతా ఉన్నారు. హే రాం..సేవ్‌ ఆంధ్ర.. హే రాం..సేవ్‌ డెమోక్రసీ..

కేసులకు భయపడే ప్రసక్తే లేదు.. 
ప్రజాస్వామ్య వ్యవస్థలో తమకు అన్యాయం జరిగిందంటూ ఆర్వోకు కంప్లైంట్‌ చేయడం కూడా తప్పేనట. ఏకంగా 70 మంది ఏజెంట్‌ పాస్‌లున్న వార్ని పోలింగ్‌ బూత్‌లకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారంటూ ఏజెంట్‌ ఫారంలు చూపిస్తూ గాంధేయ మార్గంలో శాంతియుతంగా ఆర్వోకార్యాలయం ఎదుట బైఠాయించి అక్కడ జరిగిన అన్యాయాన్ని దేశం మొత్తం చూసేలా చేశాం. శాంతియుతంగా నిరసన తెలిపి ఆర్వోకు కంప్లైంట్‌ చేయడం కూడా ఈ రాష్ట్రంలో తప్పేనట. పోలీసులు కేసులు పెట్టుకుంటే పెట్టుకోనీయండి. వాళ్ల చేతుల్లో అధికారం ఉంది..అధికార దుర్వినియోగం చేయడానికి సిద్ధ్దపడుతున్నారు. 

కానీయండి. మా  పోరాటం ఆగదు. కేసులకు భయపడే పరిస్థితి లేదు. ఇంత జరిగిన తర్వాత ఈ ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత రాష్ట్రంలో ప్రజల హక్కులు కాపాడబడతాయనుకుంటే వారిని ఏమనుకోవాలో నాకు తెలియదు. ఎందుకంటే కళ్లెదుట కన్పిస్తా ఉంది.  నామినేషన్‌ పత్రాలు, ఓటు హక్కును లాగేసుకున్నారు. 22ఏ కింద కొన్ని లక్షలఎకరాలు నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. రేపొద్దున సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు మీ ఆస్తి పత్రాలతో వెళ్తే లాక్కొని చించి ఆ ఆస్తి ఇక మాది అనేరోజు త్వరలోనే ఉంది’’. అని జగన్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement