హే రామ్.. సేవ్ ఆంధ్ర.. హే రామ్.. సేవ్ డెమోక్రసీ
ఎన్నికల ప్రక్రియను కబ్జాచేసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
బాబు తొత్తులుగా మారిన ఎస్‌ఈసీ, పోలీసు వ్యవస్థ
సీఎం నుంచి ఆర్వో వరకు మాఫియాలా పనిచేశారు
నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకూ అంతా రిగ్గింగే
రిగ్గింగ్, సైక్లింగ్‌లో చంద్రబాబు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు
నామినేషన్లు వేయనీయలేదు.. ప్రజలను స్వేచ్ఛగా ఓటు వేయనీయలేదు
పోలీసుల తీరు వల్ల ‘సేఫ్ ఆంధ్ర’ నుంచి ‘సేవ్ ఆంధ్ర’ అనే పరిస్థితి వచ్చింది
ఎస్‌ఈసీ, పోలీసులు, అధికారులపై ప్రజల్లో నమ్మకం పోయింది.
సుప్రీంకోర్టు ఆదేశాలకూ తూట్లు పొడిచిన చంద్రబాబు
11,378 మున్సిపల్ పోలింగ్ కేంద్రాల్లో 5,737 చోట్లే సీసీ కెమెరాలు!
31,460 ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ కేంద్రాల్లో 16,064 చోట్లే సీసీ కెమెరాలు!
అనేక అక్రమాలు చేసి.. రిగ్గింగ్, సైక్లింగ్ చేసి.. గెలిచినట్టు చెప్పుకుంటున్నారు.
చంద్రబాబు గెలిచి ఓడాడు.. మేము ఓడినా ప్రజల మనసుల్లో గెలిచాం..
మాకు జరిగిన అన్యాయాన్ని దేశం మొత్తం చూసేలా చేశాం
పోలీసు కేసులకు బెదిరే ప్రసక్తే లేదు..ఎందాకైనా పోరాటం చేస్తాం
అణిచివేతను ఎదురొడ్డి పోరాడుతున్న మా పార్టీ నేతలు, కార్యకర్తలకు సెల్యూట్
ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కలెక్టర్లు, డీఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఓల వరకు ఒక మాఫియా ముఠాలా ఏర్పడి ఎలక్షన్ వ్యవస్థను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఎన్నికల వ్యవస్థకు రిఫరీగా ఉండాల్సిన ఎస్‌ఈసీ సైతం చంద్రబాబుకు తొత్తుగా మారి ఈ ఎన్నికలు నిర్వహించారు.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ను సౌత్ బీహార్‌తో కంపేర్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం జెన్ జీ
గొంతెత్తుతున్న సమయంలో కూడా రిగ్గింగ్ ఎలా చేయాలో, సైక్లింగ్ ఎలా చేయాలో, ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేయాలో ట్యూషన్ పెట్టి మరీ చంద్రబాబు నేర్పిస్తున్నాడు. – వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలోనే కాదు..దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ ఎక్కడా ఇలాంటి ఎన్నికలు బహుశా ఎవరూ చూసి ఉండరు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలనేవి (ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలెక్షన్స్) ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న హక్కు. కానీ.. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా కబ్జాచేసి చంద్రబాబు నిర్వహించిన ఈ ఎన్నికలను అసలు ఎన్నికలని ఎవరైనా అనగలరా?’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇవి ఎలక్షన్లా? సెలక్షన్లా? అనేది ప్రజాస్వామ్యం బ్రతికి ఉండాలని ఆశించే ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని కోరారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు.
మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో.. పురపాలక ఎన్నికల్లో టీడీపీ గూండాల ఆగడాలు.. వారికి పోలీసులు వత్తాసు పలికిన తీరు.. ఎస్‌ఈసీ(రాష్ట్ర ఎన్నికల కమిషన్) ప్రేక్షకపాత్ర పోషించిన వైనాన్ని సాక్ష్యాధారాలతో ఎత్తిచూపుతూ చంద్రబాబు సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన తీరును ఎండగట్టారు. ‘‘పూర్వం శకుని మాయాపాచికల గురించి చెప్పుకునే వాళ్లం. మాయా పాచికల్లో శకుని ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ వేసి ఆటను పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకునేవాడు. ఈ మాదిరిగా జూదాన్ని రిగ్ చేయడం వల్లనే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది’’ అంటూ గుర్తు చేశారు.
‘‘నిజంగా ఈరోజు శకుని మాయా పాచికల మాదిరిగా అధికార దుర్వినియోగంతో, రౌడీయిజంతో ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని రిగ్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఈ ఎన్నికలు నిర్వహించారు. వ్యవస్థలన్నిటినీ తమ గుప్పెట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఇంతలా ఖూనీ చేసి ఈ ఎన్నికలు నిర్వహించడం రాబోయే తరాలకు తప్పుడు సంకేతాలివ్వడం కాదా?’’ అంటూ చంద్రబాబు సర్కార్‌ను నిలదీశారు. ‘‘ఇంత దయనీయ పరిస్థితులకు చంద్రబాబు దిగజారిపోవడానికి కారణం.. ఎన్నికల ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ ఇచ్చిన 143 హామీలను అమలు చేయకపోవడమే. ఎన్నికల ముందు ప్రతి ఇంటికీ వెళ్లి బాండ్ ఇచ్చారు.
ఇదిగో అమ్మా.. మీ కుటుంబానికి ఇంత లబ్ధి చేకూరుతుంది. 2024 జూన్ నుంచి ఈ డబ్బులన్నీ మీ ఖాతాల్లో జమవుతాయని మాటిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడవడం, అవన్నీ మోసాలని తేలడంతో ప్రజలంతా నిలదీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే ఎక్కడ తన అడ్రస్ గల్లంతవుతుందోనన్న భయంతోనే చంద్రబాబు ఎన్నికల ప్రక్రియను పూర్తిగా హైజాక్ చేశాడు’ అంటూ వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
సీఎం నుంచి ఆర్వో వరకు ఓ మాఫియా ముఠా
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులను బైండోవర్ పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరింపులు, అరెస్టులతో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ఇంతగా దిగజారిపోవడం గమనించాల్సిన విషయం. టీడీపీ గూండాలతో పోలీసులు కుమ్మక్కై వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.
అసలు పోటీయే లేకుండా చేయడానికి స్క్రూటినీ సమయంలో రిటర్నింగ్ అధికారులు నామినేషన్ పత్రాల్లోని పేపర్లను మాయం చేయడం, సంతకాలను ఫోర్జరీ చేయడం, నామినేషన్లను అడ్డగోలుగా తిరస్కరించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పోటీ నుంచి తప్పుకోవాలని బలవంతపు విత్‌డ్రాయల్స్ చేయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కలెక్టర్లు, డీఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఓల వరకు ఒక మాఫియా ముఠాలా ఏర్పడి తమ గుప్పిట్లోకి ఎలక్షన్ వ్యవస్థను తీసుకున్నారు. ఎన్నికల వ్యవస్థకు రిఫరీగా ఉండాల్సిన ఎస్‌ఈసీ సైతం చంద్రబాబుకు తొత్తుగా మారి ఈ ఎన్నికలు నిర్వహించారు.

ఎన్నికల్లో సంస్కరణలకు ఏపీ ఓ కేస్‌స్టడీ
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల నిర్వహణలో సంస్కరణలకు (రిఫార్మ్ప్) ఒక కేస్ స్టడీ అవసరమనుకుంటే ఏపీలో జరుగుతున్న ఎన్నికలే ఓ ఉదాహరణ. ఏపీలో జరిగే ఎన్నికలను ఒకసారి చూస్తే ఎన్నికల్లో రిఫార్మ్ప్ ఎంత అవసరమో అర్ధమవుతుంది. పార్టీల ప్రాతిపదికన జరుగుతున్న ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఏకంగా 17 మున్సిపాల్టీల్లో చైర్‌పర్సన్లుగా పోటీ చేసేందుకు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. మరికొన్ని చోట్ల నామినేషన్ వేసినా స్క్రూటినీపేరిట అడ్డగోలుగా రిజెక్ట్ చేశారు. అసలు నామినేషన్ పర్వంలోనే 22 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో పోటీ లేకుండా చేశారు.
కొన్ని వార్డుల్లోనే.. అదీ కాళ్లు చేతులు కట్టి పోటీలో దిగమన్నారు
దేశంలో ఐదేళ్లకోసారి పార్టీ ఆధారంగా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు చూస్తున్నాం. ఎక్కడైనా ఏకగ్రీవమైనట్టు చూసామా? బీజేపీ పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లను నామినేషన్ వేయకుండా చేస్తారా? ఎక్కడైనా జరుగుతుందా? ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థుల నామినేషన్లు స్క్రూటినీపేరిట తిరస్కరించడం ఎక్కడైనా చూసామా? దేశవ్యాప్తంగా మహా అయితే ఒకటో రెండో జరగడం గొప్ప. కానీ ఇక్కడ నామినేషన్ పర్వంలోనే 22 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో చైర్మన్ అభ్యర్థులకు పోటీయే లేకుండా చేశారు. ఇంకొన్ని మున్సిపాల్టీల్లో మా పార్టీ నుంచి అన్నిచోట్ల పోటీలో లేకుండా చేశారు.
ఏదైనా కార్పొరేషన్, మున్సిపాల్టీలో 40, 60, 80 వార్డులుంటే అన్ని చోట్ల పోటీ జరగాలి కదా? కొన్ని చోట్ల కొన్ని వార్డుల్లో మాత్రమే పోటీలో ఉండేటట్టు చేశారు. ఉన్న ఆ కొందరికి కాళ్లు చేతులు కట్టి పోటీలో దిగమన్నారు. 40 వార్డులుంటే.. 20 వార్డులకు నామినేషన్లు వేయనీయలేదు. 20 వార్డులకు నామినేషన్లు వేసి కాళ్లు చేతులు కట్టినట్టు చేశారు. చివరకు ఇంత తీవ్రంగా దెబ్బతీసి కూడా పోలింగ్ రోజున బూత్‌లలోకి పోలింగ్ ఏజెంట్లు కూర్చొనీయకుండా పోలీసులే టీడీపీరౌడీలతో కుమ్మక్కై అడ్డుకున్నారు. సైక్లింగ్ పద్ధతిలో కళ్లదుటే రిగ్గింగ్ చేస్తున్న ఘటనలు కోకొల్లలు. వీటిని నిజంగా ఎన్నికలని అనగలమా అని అడుగుతా ఉన్నా.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదే తీరున దౌర్జన్యం
ఈరోజు జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వంలోనే 84 జెడ్పీటీసీ స్థానాల్లో మా పార్టీ తరపున నామినేషన్లు వేయనీకుండా దాడులుచేసి అడ్డుకున్నారు. వీరి ఆగడాలకు ఎదురొడ్డి నామినేషన్లు వేసిన పరిస్థితి ఉంటే స్క్రూటినీపేరిట రిజెక్ట్ చేశారు. ఇలా ఏకంగా 2,109 ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్ల పర్వంలోనే పోటీ లేకుండా చేసుకున్నారు. గడిచిన రెండ్రోజులుగా మా జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అడ్డగోలుగా అరెస్ట్ చేశారు. పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ బూత్‌ల్లో వెళ్లనీయకుండా టీడీపీ గూండాలతో కుమ్మక్కయి పోలీసులే అడ్డగించారు. పార్టీల ప్రాతిపదికన జరిగే ఎన్నికలైనప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఏకైక పార్టీని పోటీ చేయనీయకుండా అడ్డుకున్నప్పుడు వీటిని సెలక్షన్స్ అనాలే తప్ప ఎలక్షన్స్ అని ఎందుకంటున్నారు.
సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేసిన ఎస్‌ఈసీ
ఇలాంటి అక్రమాలపై ఎన్నడూలేని విధంగా సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని ఎస్‌ఈసీని, ప్రభుత్వాన్ని, డీజీపీని చీవాట్లు పెట్టింది. నామినేషన్ల సెంటర్లలోనూ, స్రూ్కటినీ, విత్‌డ్రాయల్స్ సమయంలోనే కాదు పోలింగ్, కౌంటింగ్ సెంటర్లలో సీసీ కెమెరాలు కచ్చితంగా పెట్టాలని ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇంత స్పష్టంగా ఉన్నా.. మున్సిపల్ ఎన్నికల్లో 11,378 పోలింగ్ కేంద్రాలుంటే, కేవలం 5,737 కేంద్రాల్లో మాత్రమే సీసీ కెమెరాలు పెట్టారు. వాటిలో కొన్ని మాత్రమే పనిచేస్తుంటే మరికొన్ని పనిచేయడం లేదు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 31,460 పోలింగ్ కేంద్రాలుంటే, కేవలం 16,064 కేంద్రాల్లో మాత్రమే సీసీ కెమెరాలు పెడుతున్నామని చెప్పారు. వీటిలో కూడా ఎన్ని పనిచేస్తున్నాయో ఎన్ని పని చేయడం లేదో తెలియని పరిస్థితి. నేను అడుగుతున్నా ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడం కాదా? అని. ఇవన్నీ ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇవన్నీ ఉండేటట్టు చూసుకున్న తర్వాతే ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎస్‌ఈసీది కాదా. ప్రభుత్వం ఏంచేస్తున్నట్టు.. డీజీపీ ఏం చేస్తున్నట్టు?
నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు అంతా రిగ్గింగే
స్థూలంగా ఈ ఎన్నికలు ఎలా జరిగాయంటే నామినేషన్లు రిగ్గింగ్.. నామినేషన్ల స్క్రూటినీరిగ్గింగ్.. పోలింగ్ బూత్‌ల రిగ్గింగ్.. పోలింగ్ సైక్లింగ్, పోలింగ్ పర్సంటేజ్ రిగ్గింగ్, రాత్రిపూట బ్యాలెట్ బాక్సుల రిగ్గింగ్.. అంతా రిగ్గింగ్ మయం. చివరకు విశాఖపట్నంలో మా వాళ్లు గొడవ చేసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్‌లకు సీల్ వేసిన పరిస్థితి చూశాం. అంటే రాత్రి పూట బ్యాలెట్ బాక్సుల్లో కూడా రిగ్గింగ్ జరిగినట్టే కదా. ఇవన్నీ దాటుకుని మా వాళ్లు గెలిస్తే ఆ ఫలితాలను కూడా రిగ్గింగ్ చేస్తున్నారు. ఇలాంటి అన్యాయమైన ప్రమాణాలు నిర్దేశించి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసి చంద్రబాబు వీటిని గెలుపుగా చెప్పుకోవడం, ఎల్లోమీడియా ఈ చంద్రబాబును భుజానకెత్తుకోవడం చూస్తుంటే.. అసలు వీటిని ఎన్నికలని ఎవరైనా అనగలరా? అని అడుగుతున్నా.
రాత్రికి రాత్రే..1,15,787 ఓట్లు ఎలా పెరిగాయి?
మున్సిపల్ ఎన్నికలలో పోలింగ్ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు రాష్ట్రమంతా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో యథేచ్చగా రిగ్గింగ్ చేసుకున్నారు. పోల్ కాని ఓట్లను పోల్ అయినట్టుగా తమకు అనుకూలంగా పోలింగ్ పర్సంటేజ్‌ను కూడా పెంచుకున్నారు. ఇది నిజంగా అన్నిటికన్నా గొప్ప విషయం. దీంతో పోలింగ్ పర్సంటేజ్‌లు అనూహ్యంగా మారిపోయాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నంలో 9,19,367 ఓట్లు పోలైనట్టు చెప్పారు.
రాత్రి 9.30 గంటలకు ఈ సంఖ్య 9,45,915 ఓట్లు పోలైనట్టు చెప్పారు. సోమవారం పొద్దున అయ్యేసరికి ఏకంగా 10,35,154 ఓట్లు పడ్డాయన్నారు. పోలింగ్ శాతం రాత్రి 9.30 గంటలకు 51.46% అయితే.. సోమవారం పొద్దున 56.3%కి పెంచేశారు. రాత్రికి రాత్రే.. 1,15,787 ఓట్లు ఏ విధంగా పెరిగాయి.? ఈ ఓట్లు ఎక్కడ నుంచి వచ్చాయి? అంటే సమాధానం లేదు. చివరకు విశాఖపట్నంలో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లోకి చేర్చిన తర్వాత సీల్ కూడా వేయలేదు. ఎందుకు వేయలేదంటూ మా వాళ్లు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పోలింగ్ పర్సంటేజీలను పెంచుకున్న ఉదాహరణలు కోకొల్లలు
ఇలా చెప్పుకుంటే పోలింగ్ పర్సంటేజ్‌ను తమకు అనుకూలంగాపెంచుకున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. చీమకుర్తిలో రాత్రి 11 గంటలకు 78.28%. అర్ధరాత్రి 12 గంటలకు 84.36%కు పెంచేశారు. జమ్మలమడుగులో ఉదయం 11 గంటలకే 60% పోలింగ్ నమోదైంది. ఇది ఏ రకంగా సాధ్యం. అద్దంకిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రెండు గంటల్లో 11,958 ఓట్లు పోలయ్యాయి. 11 గంటల వరకు 19%గా ఉన్న ఓట్లు, రెండు గంటల్లోనే ఏకంగా 56.7% పెరిగినట్టు చూపించారు.
ధర్మవరంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య రెండు గంటల్లో 30,157 ఓట్లు పోలయ్యాయి. అంటే 9 గంటల వరకు 8% మాత్రమే ఓట్లు పోలవగా, 11 గంటలలోపు ఏకంగా 36.36% పెరిగినట్టు చూపించారు. చిలకలూరిపేటలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు 20,772 ఓట్లు పోలయ్యాయి. అంతకు ముందు 7% నుంచి రెండు గంటల్లోనే 37% పోలింగ్ పెరిగినట్టు చూపించారు. పార్వతీపురంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 13,042 ఓట్లు పోలైనట్టు చూపించారు. అంతకుముందు 12%గా ఉన్న పోలింగ్ శాతం రెండు గంటల్లోనే 44% పెరిగినట్టు చూపించారు.
పోలింగ్ శాతాలు తమకు తామే పెంచుకుని ఆ మేరకు రికార్డులు సృష్టించుకుని యథేచ్చగా రిగ్గింగ్ చేసారన్నది చాలా స్పష్టంగా కన్పిస్తున్న విషయం. చివరికి వాళ్లు డిక్లేర్ చేసిన పోలింగ్ పర్సంటేజ్‌లకు మించి కౌంటింగ్‌లో అధికంగా ఓట్లు కన్పిస్తా ఉన్నాయి. చిత్తూరు కార్పొరేషన్‌లో 92,900 ఓట్లు పోలైనట్టుగా చెప్పి, కౌంటింగ్ టేబుల్‌పై అంతకుమించి ఏడువేల ఓట్లు కన్పిస్తా ఉన్నాయి. ఇవి బయటకు రాకుండా ఏజెంట్లను వెళ్లగొట్టి గెలుపు టీడీపీదే అని ప్రకటించుకున్నారు’’ అని జగన్ పేర్కొన్నారు.
దేశ చరిత్రలో కూడా బహుశా ఎక్కడా ఎప్పుడూ చూడని విధంగా ఈ రోజు అణిచివేతను ఎదుర్కొని నిలబడ్డాం. ఎన్నికల్లో పాల్గొనడం, ఓటు వేయడం ప్రజల హక్కంటూ ప్రజల తరపున బలంగా గొంతు విప్పగలిగాం. పోరాటం చేయగలిగాం. చంద్రబాబు చేస్తున్న ఈ అక్రమాలను దేశం దృష్టికి తీసుకెళ్లగలిగాం. ఇందులో భాగంగా మా పార్టీ కార్యకర్తలు, మా నాయకులు, నిజంగా హీరోల్లా పోరాటం చేశారు. వాళ్లందరికీ సెల్యూట్ చేస్తున్నా.. చంద్రబాబు గెలిచి ఓడారు. మేము ఓడి ప్రజల మనసుల్లో గెలిచాం.

ఈ ఎన్నికలు ఎలా జరిగాయంటే నామినేషన్లు రిగ్గింగ్.. నామినేషన్ల స్క్రూటినీ రిగ్గింగ్.. పోలింగ్ బూత్‌ల రిగ్గింగ్.. పోలింగ్ సైక్లింగ్, పోలింగ్ పర్సంటేజ్ రిగ్గింగ్, రాత్రి పూట బ్యాలెట్ బాక్సుల రిగ్గింగ్.. అంతా రిగ్గింగ్ మయం.
సైక్లింగ్, రిగ్గింగ్‌లో పీజీ చేసిన చంద్రబాబు
కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో పోలింగ్ ఎలా జరిగిందో? ఏజెంట్లపై ఏ విధంగా దాడులు చేసారో? పోలింగ్ కేంద్రాలను ఏ విధంగా ఆక్రమించుకున్నారో? రిగ్గింగ్ మీద రిగ్గింగ్ చేసిన ఘటనలు కోకొల్లలు. దేశమంతా కూడా ఆ వీడియోలు చూశారు. మీరు ఒక్కసారి చూడండి..
» అనంతపురం 30వ డివిజన్ 3వ పోలింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరుడు దర్జాగా ఆక్రమించి రిగ్గింగ్ చేశాడు. రిగ్గింగ్ క్లాసులు కావాలంటే చంద్రబాబు దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఈ వీడియో వైరల్ కావడంతో రీ పోలింగ్ పెట్టక తప్పలేదు. అప్పుడు కూడా అదే మనిషి మళ్లీ వచ్చి ఓటు వేసాడు.
» చిత్తూరు జిల్లా వళియప్ప నగర్‌లో టీడీపీ గూండాలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. రిగ్గింగ్ తో పాటు సైక్లింగ్ కూడా చేశారు. తిరుపతిలో ఇంక్ గుర్తులను చెరిపి వేయడానికి బూత్ పక్కనే కెమికల్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఓటువేసి బయటకురాగానే వెంటనే సిరాగుర్తును చెరిపేయడం. మళ్లీ ఓటువేసేందుకు పోలింగ్ బూత్‌లోకి చొరబడడం.. ఈ సైక్లింగ్ కోసం చంద్రబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. సైక్లింగ్, రిగ్గింగ్‌లో చంద్రబాబు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేశారు.
» ఇక పులివెందుల కోసం చెప్పాల్సిన పనిలేదు. 80 బూత్‌లుంటే.. ఏకంగా 70 చోట్ల అసలు ఏజెంట్లే లేకుండా చేశారు. ఆ తర్వాత బూత్‌లను ఆక్రమించి ఎలా రిగ్గింగ్ చేశారో? సైక్లింగ్ ఎలా చేశారో చూడండి (వీడియోలు ప్రదర్శిస్తూ). చివరికి ఈ అన్యాయాలను రిపోర్ట్ చేస్తున్న ఇండియా టుడే జర్నలిస్ట్ అబ్దుల్ బషీర్, వీడియో జర్నలిస్ట్ విజయ్, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్. పలువురు విలేకరులపై టీడీపీ వాళ్లు దాడి చేశారు. పత్రికా స్వేచ్చను ఖూనీ చేశారు. ఈ ఘటన జరిగిన చోట సీసీ కెమెరాలున్నాయి కదా? క్లియర్‌గా ఎవరు దాడులకు పాల్పడ్డారో కన్పిస్తా ఉంది. మరి ఎందుకు సీసీ కెమెరా పుటేజ్ బయట పెట్టలేదు. వీరిపై దాడులకు పాల్పడిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు.
వీటిని నిజంగా స్వేచ్ఛాయుత ఎన్నికలని అనగలమా ?
ఈరోజు జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కొన్ని వీడియోలు చూపిస్తా.. తెలుగుదేశం గూండాలు పోలీసులతో కుమ్మక్కయి ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేశారో మీరే చూడండి. అసలు వీటిని స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలని ఎవరైనా అంటారా ఆలోచించండి.. (వీడియోలు, ఫొటోలను ప్రదర్శిస్తూ..)
» అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం సోదనపల్లిలో బూత్ ఏజెంట్లను బయటకు లాగేసి టీడీపీ గూండాలు రిగ్గింగ్ చేశారు.
» ఉరవకొండ నియోజకవర్గం (ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సొంత నియోజక వర్గం) కూడేరులో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలీస్ స్టేషన్‌లోనే సీఐ బంధించారు.
» ఇదే నియోజకవర్గం మురట్లలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేస్తుంటే సీఐ రాజు కాపలా కాశారు.
» కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండలం వెలిగండ్ల గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలీసులు లాగిపడేశారు.
» కర్నూలు రూరల్ మండలం సుంకేశులలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను ఏజెంట్ ఫామ్స్ చింపేసి టీడీపీ గూండాలు దాడి చేశారు.
» తిరుపతిలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని సాయినగర్‌లో టీడీపీ గూండాలు భారీగా తరలించిన దొంగ ఓటర్లను వైఎస్సార్‌సీపీ నాయకులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
» అన్నమయ్య జిల్లా పీలేరులో అందరూచూస్తుండగా టీడీపీ గూండాలు రిగ్గింగ్ చేశారు.

» పులివెందుల మండలం అచ్చివెల్లిలో ఓటు వేసేందుకు వెళ్తున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జి చేశారు.
» పులివెందుల నియోజకవర్గం వేములలో ఓటు వేయనీయకుండా స్లిప్‌లు ఇచ్చి వెళ్లిపోండి అంటూ ఓటర్లను పోలీసులు, టీడీపీ గూండాలు బెదిరించారు.
» పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం ఓటర్లపై దాడి చేసేందుకు టీడీపీ గూండాలు బస్సుల్లో తెచ్చిన రాడ్లు, కర్రలను మీరే చూడండి.
» పులివెందుల నియోజకవర్గం వేముల జెడ్పీ హైసూ్కల్ బూత్ వద్ద వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలీసులే అడ్డుకుని వెళ్లగొట్టారు.
» పులివెందుల నియోజకవర్గం మోట్నుతలపల్లిలో ఇళ్లల్లోకి చొరబడి టీడీపీ గూండాలు దాడులు చేశారు. ఓటు
వేయడానికి వస్తున్న మహిళా ఓటర్లపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
» రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం నల్లపరెడ్డిపల్లిలో పోలీసులసమక్షంలోనే పెట్రోల్ బాంబులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడులు చేశారు.
» శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం (మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం) కోటబొమ్మాళి మండలం పట్టుపురంలో ఓట్ల రిగ్గింగ్‌కు పాల్పడుతున్న టీడీపీ నేతలను అడ్డుకునేందుకు యత్నించిన వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
» అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దాదేపల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు గెంటేసిన టీడీపీ నేతలు
» ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం శివరాంపురంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపిన టీడీపీ గూండాలు.. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే సుమా..
» ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం వత్సవాయిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను ఉదయం ఏడుగంటలకే పోలీస్ స్టేషన్‌కు తరలించి పోలింగ్ కేంద్రాలకు వెళ్లనీయకుండా అడ్డుకున్న పోలీసులు.
» ప్రకాశం జిల్లా దర్శి మండలం తానంచింతలలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు గెంటేసి, తమను ఓట్లు వేయనివ్వకుండా టీడీపీ గూండాలు అడ్డుకుని రిగ్గింగ్ చేస్తున్నారని గ్రామస్తుల ఆగ్రహం.
» ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం హెచ్‌ఎంపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి, లింగంగుంట్లలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు.
» కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం చిప్పగిరిలోనే వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను దౌర్జన్యంగా పోలీసుల జీపులోకి ఎక్కిస్తున్న ఎస్సై నర్సింహులు.
» వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాలమండలం కొమ్మనూతలలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్న కారణంగా పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించిన మహిళలు, గ్రామస్తులు.
» చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీ.కోటలో ఓటేయనీయకుండా టీవీ రిపోర్టర్‌పై సీఐ సోమశేఖర్ దాడి.
» ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం టంగుటూరు మండలంలో కొలిజేడులో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి రాకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు, వారికి వంతపాడుతూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బెదిరిస్తున్న పోలీసులు.
» ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం తాళ్లూరు మండలంలో తమను ఓటు వేయనీయకుండా రిగ్గింగ్ చేస్తున్నారని నిరసన తెలుపుతున్న గురవారెడ్డి పాలెం, కొర్రపాటివారి పాలెం వాసులు.
» మార్కాపురం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో కొనకమిట్ల మండలంలోని చినమనగుండంలో 175వ బూత్‌లో దొంగ ఓట్లు వేయిస్తున్న టీడీపీ కార్యకర్త
» శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి–4 ఎంపీటీసీ స్థానం నుంచి ఎంపీటీసీగా పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జ్యోతి భర్త కృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు. అడ్డుకుంటున్న కృష్ణ చెల్లెలిపై పోలీసుల దాష్టీకం.


