రామాయణంలో శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా దీపాలు వెలిగించి స్వాగతం పలికారనే కథ మనకు తెలిసిందే. అలాగే దక్షిణ భారతదేశంలో నరకాసురుడిపై శ్రీకృష్ణుడి విజయాన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. కథలు వేరైనా వాటి వెనుక ఉన్న అంతరార్థం ఒక్కటే. చెడుపై మంచి గెలవాలి. అన్యాయంపై ధర్మం విజయం సాధించాలి. మనిషిలోని ప్రతికూల ఆలోచనలపై సానుకూలత పైచేయి సాధించాలి. ఈ విలువలను నేటి పిల్లలకు, యువతకు పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నలుగురితో మంచిగా..
‘దీపావళి’ అనే మాటకు అర్థం దీపాల వరుస. ఒక చిన్న దీపం చీకటిని పూర్తిగా తొలగించలేక΄ోయినప్పటికీ.. తన చుట్టూ కొంత వెలుగును నింపగలదు. మనిషి జీవితం కూడా అంతే. మనం చేసే మంచిపనులు చిన్నవే అయినా మరొకరి జీవితంలో ఆశలను నింపుతాయి. ధైర్యాన్నిస్తాయి. స్ఫూర్తిగా నిలుస్తాయి. అందుకే దీపావళి పండుగ ఇచ్చే మొదటి సందేశం.. మనలోని మంచితనంతో నలుగురికి వెలుగునివ్వడం.
బంధాలకు కొత్త వెలుగులు..
ఇప్పుడున్న జీవనశైలిలో పండుగైనా, వేడుకైనా అన్ని రోజులూ ఒకేలా గడిపేస్తున్నాం. విరామం లేని ఉద్యోగాలు, ర్యాంకుల చదువులు, బిజినెస్ ఒత్తిళ్లు, పర్సనల్ గోల్స్.. ఇలా ఎవరి ప్రపంచంలో వారు ఉంటున్నారు. ఒకే ఇంట్లో ఉంటున్నా.. మాటలూ తగ్గిపోతున్నాయి. ఇక స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచాన్నే మరిచిపోతున్నారు.
ఇలాంటి సందర్భాల్లోనే దీపావళి కుటుంబ బంధాలను గుర్తు చేసే ఒక మంచి సందర్భం. పండుగ రోజున ఇంట్లోని వారంతా కలిసి ఇంటిని అలంకరించడం, పాతజ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం, పండుగ కథలను తెలియజెప్పడం, బంధువులను పలకరించడం వంటివి చేయడం వల్ల సంబంధాలు బలపడుతాయి. పండుగ ఆనందమూ రెట్టింపవుతుంది. దీపావళి రోజున ఇంట్లో వంద దీపాలు వెలిగించినా.. మనసుల్లో దూరం ఉంటే ఆ వెలుగుకు, పండుగకు అర్థం ఉండదు.
షాపింగ్ మాత్రమే కాదు!
ఇంతకుముందు పండుగ కోసం ఇంట్లోవన్నీ శుభ్రం చేసుకుని, అందరూ కలిసి ఇంటిని అలంకరించేవారు. కానీ ఇప్పుడంతా ఆన్‌లైన్‌మయం. ఫోన్ తెరిస్తే చాలు ఆఫర్‌ల అమ్మకాలు. దీంతో చాలా పనులు కొనుగోళ్లతోనే పూర్తవుతున్నాయి. అయితే పండుగ ఆనందం అనేది ఖరీదైన కొనుగోళ్లలోనే ఉండదని గుర్తుంచుకోవాలి. మన పక్కింటి వారు ఏం కొంటున్నారు? ఎంత ఖర్చు చేస్తున్నారు? అనే పోలికలకు వెళ్లకుండా మన స్థాయికి తగినట్లు పండుగ చేసుకోవాలి. మనకు ఇష్టమైన వారితో గడిపే సమయం, మనస్ఫూర్తిగా నవ్వుకునే క్షణాలే పండుగకు అసలైన అందం. అర్థం.
చీకట్లను తొలగిద్దాం!
ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సమస్య ఉంటుంది. కొందరికి చదువులో ఒత్తిడి.. మరికొందరికి ఉద్యోగంలో పోటీ.. ఇంకొందరికి ఆర్థిక ఇబ్బందులు.. వీటన్నింటి మధ్య మనసులో నిరాశ, భయం, అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలోనే దీపావళి మనకు ఒక మంచి విషయాన్ని గుర్తుచేస్తుంది. చీకటి ఎంత ఎక్కువగా ఉన్నా ఒక చిన్న దీపం వెలుగును పంచుతుంది. అలాగే ఎన్ని సమస్యలు ఎదురైనా ఆశను కోల్పోకూడదు అని.
కాలంతో పాటు పండుగను జరుపుకునే పద్ధతులు మారడం సహజం. మట్టి ప్రమిదల స్థానంలో విద్యుత్ దీపాలు వచ్చినా.. సంప్రదాయ దుస్తుల స్థానంలో మోడ్రన్ డ్రెస్సెస్ వచ్చినా.. ప్రేమతో కూడిన శుభాకాంక్షల పలకరింపులు.. సోషల్ మీడియాలోకి చేరినా తప్పులేదు. కానీ పండుగ వెనుక ఉన్న అసలు విలువలు మాత్రం కనుమరుగుకాకూడదు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే సంప్రదాయాలను గౌరవించాలి. ఆనందాన్ని ఆస్వాదిస్తూనే ప్రకృతిని కాపాడాలి. వ్యక్తిగత విజయాలను సాధిస్తూనే సమాజం పట్ల బాధ్యతను గుర్తుంచుకోవాలి. ఈ దీపావళికి ఇంటిలో వెలుగులు నింపడంతో పాటు .. మనసులోని చీకట్లనూ తొలగించుకుందాం..!
దీపావళి .. చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, నిరాశపై ఆశ గెలవాలనే గొప్ప సందేశం దాగున్న వేడుక. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక ఈ పండుగ. అందుకే మనలోని అహంకారం, అసూయ, ద్వేషం, స్వార్థం వంటి చీకట్లను తొలగించుకుని ప్రేమ, కరుణ, మానవత్వం అనే వెలుగులను నింపుకోవాలని ఈ పండుగ గుర్తుచేస్తుంది. మరి ఈ సందేశాలు నేటి తరానికి ఎంతవరకు చేరుతున్నాయి? వేగంగా మారుతున్న జీవనశైలిలో దీపావళి మనకు నేర్పుతున్న పాఠాలేమిటి? సంప్రదాయాలను కాపాడుకుంటూనే ప్రకృతిని, ఆరోగ్యాన్ని, మానవ సంబంధాలను గౌరవిస్తూ పండుగను ఎలా జరుపుకోవాలి?
ప్రకృతి హితంగా!
దీపావళి అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది టపాసులే. వాటిని కాల్చడం ద్వారా వచ్చే ఆనందం కొద్దిసేపే. కానీ వాటి నుంచి వెలువడే పొగ, ధూళి, శబ్దం మాత్రం పర్యావరణంపై దీర్ఘకాల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, శాస సమస్యలున్నవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. జంతువులు కూడా పెద్ద శబ్దాలకు భయపడతాయి. అందువల్ల పర్యావరణహిత దీపావళికి ప్రాధాన్యతనివ్వాలి.


