రిస్క్‌ చేసి విజయం సాధించిన ఇస్రో!  | ISRO is taking an unusual approach with its NVS-03 satellite | Sakshi
Sakshi News home page

రిస్క్‌ చేసి విజయం సాధించిన ఇస్రో! 

Nov 1 2026 6:11 AM | Updated on Nov 1 2026 6:11 AM

ISRO is taking an unusual approach with its NVS-03 satellite

పైరో వాల్వులను తెరిచి ఉంచే ప్రయోగం 
ఎన్‌వీఎస్‌–02 మాదిరి వైఫల్యాన్ని అరికట్టేందుకే 
వెల్లడించిన ఇస్రో ఛైర్మన్‌ వి.నారాయణన్‌

శ్రీహరికోట: ఎన్‌వీఎస్‌–03 విజయం వెనుక దాగున్న ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. భారత్‌లో జీపీఎస్‌ వ్యవస్థ బలోపేతానికి ఇస్రో శుక్రవారం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే.. గత ఏడాది ప్రయోగించిన ఎన్‌వీఎస్‌–02లో తలెత్తిన సమస్య మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు ఇస్రో ఈ సారి మూడు పైరో వాల్వ్‌లను ముందుగానే తెరిచి ప్రయోగించిందని, తాము తీసుకున్న ఈ రిస్క్‌ సత్ఫలితాలిచ్చిందని ఇస్రో ఛైర్మన్‌ వి.నారాయణన్‌ శనివారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఇలా చేసేందుకు కూడా ఇస్రో మాజీ ఛైర్మన్‌ కిరణ్‌ కుమార్‌ నేతృత్వంలోని జాతీయస్థాయి కమిటీ విస్తృత పరీక్షలు చేసిందని చెప్పారు.  

రాకెట్‌ ఇంజిన్‌ ముందుకెళ్లేందుకు ఈ పైరో వ్వాల్వులు చాలా ముఖ్యం. ఇంజిన్‌కు ఇంధనం, ఆక్సిడైజర్‌ ప్రవాహాన్ని నియంత్రిస్తాయి ఇవి. అయితే వీటిని ఒక్కసారి మాత్రమే వాడవచ్చు. ఒకసారి తెరుచుకుంటూ మళ్లీ మూయలేము. గత ఏడాది ప్రయోగించిన నావిక్‌–02లో పైరో వాల్వులకు విద్యుత్తు సంకేతాలు అందలేదు. దర్యాప్తు చేయగా తెలిసిందేమిటంటే.. కనెక్టర్‌లోని ఒక కాంటాక్ట్‌ విడిపోవడం వల్ల సమస్య వచ్చినట్లు తెలిసింది. 

 ఈ లోపం కారణంగా ఉపగ్రహం తన కక్ష్యను పెంచుకోలేకపోయింది. నావిక్‌–03తో అలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ఇస్రో మూడు పైరో వాల్వులను ముందుగానే తెరిచి ఉంచింది. అంటే... ప్రయోగం తర్వాత వాల్వ్‌ తెరవాల్సిన అవసరం ఉండదు. సిగ్నల్‌ చేరక పని చేయకపోయే ప్రమాదం తగ్గుతుంది. మిషన్‌ విజయవంతమయ్యే అవకాశం పెరుగుతుంది.  

ఎన్‌వీఎస్‌–03 విజయంతో... 
భారత్‌లో జీపీఎస్‌ తరహా సేవలను అందించేందుకు నావిక్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది సొంతంగా పనిచేసేందుకు కనీసం నాలుగు ఉపగ్రహాలు కక్ష్యలో తిరుగుతూండాలి. ఎన్‌వీఎస్‌–02 నిర్దేశిత కక్ష్యలో చేరకపోవడంతో నావిక్‌లో నిన్న మొన్నటివరకూ మూడే ఉపగ్రహాలు ఉండేవి. ఎన్‌వీఎస్‌–03 విజయవంతం అయిన నేపథ్యంలో ఇప్పుడు నావిక్‌లో మళ్లీ నాలుగు ఉపగ్రహాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా దేశంలో నావిగేషన్‌ సేవలు మరింత బలపడతాయి. సైనిక, పౌర వినియోగం మెరుగుపడతాయి. ప్రస్తుతం దేశంలోని దాదాపు 15 లక్షల వాహనాల్లో నావిక్‌ నావిగేషన్‌ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. 

ఇందులో  10,400 రైలు ఇంజిన్లు, చేపలు పట్టే పడవలు 64,000 ఉన్నాయి. రానున్న ఆరు నెలల్లో ఇంకో 36 వేల చేపల పడవల్లో ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నావిక్‌ వ్యవస్థలో ఇంకో మూడు ఉపగ్రహాలు చేరితే గూగూల్‌ మ్యాప్స్‌ తరహాలో మనదైన నావిగేషన్‌ వ్యవస్థ ఒకటి మొబైల్‌ఫోన్లలోనూ అందుబాటులోకి వస్తుందని వి.నారాయణన్‌ తెలిపారు. ఇస్రో ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి మానవరహిత గగన్‌యాన్‌ మిషన్‌తో కలిపి  ఐదు ప్రయోగాలు చేపట్టనుందని ఆయన వివరించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement