పులివెందులలో అధికార దుర్వినియోగం | YSRCP activists arrested in midnight for illegal cases | Sakshi
Sakshi News home page

పులివెందులలో అధికార దుర్వినియోగం

Nov 1 2026 5:50 AM | Updated on Nov 1 2026 5:50 AM

YSRCP activists arrested in midnight for illegal cases

మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు.. అర్ధరాత్రి అరెస్టులు

పోలీసులకు ప్యాకేజీల వ్యవహారంపై విచారణ జరపాలి 

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ 

వేంపల్లె: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. పులివెందులలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎన్నికల ప్రక్రియకు దూరం చేసేందుకు నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌ కడప జిల్లా వేంపల్లెలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్‌ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో అత్యంత దౌర్భాగ్యకర స్థితిలో రాష్ట్రంలో రాజకీయాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

కూటమి నాయకులు ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం లేక పోలీసు, రెవెన్యూ, ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వ్యవస్థలను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. అధికారం అడ్డుపెట్టుకొని ప్రజల నుంచి లక్షల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్‌ దోచుకున్నారని విమర్శించారు. 

చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చిన లోకేశ్‌.. మంచి పద్ధతిలో నడుచుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ విషయాలను మాట్లాడటం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. పులివెందులలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం, కార్యకర్తలపై 307 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేయడం, అర్ధరాత్రి అరెస్టులు చేయడం వంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అల్లరి మూకలకు పోలీసుల రక్షణా?
పులివెందులలో పుట్టి పెరిగిన తనకే అక్కడికి వెళ్లవద్దంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమని సతీష్‌ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కౌన్సిలర్‌ అభ్యర్థులకు చెందిన లారీలు, మోటార్‌ సైకిళ్లను తగలబెట్టినా కేసులు నమోదు చేయకపోవడం పోలీసుల ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై మాత్రం అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నాయకులు, అల్లరి మూకలను ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం తదితర ప్రాంతాల నుంచి స్వేచ్ఛగా పులివెందులకు రప్పించడం.. పోలీసులు వారికి రక్షణ కల్పించడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. 

పోలీసుల ప్యాకేజీలపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. పులివెందులలో సుమారు 2 వేల మంది పోలీసులను మోహరించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. డీఎస్పీకి రూ.25 లక్షలు, సీఐకి రూ.10 లక్షలు, ఎస్‌ఐకి రూ.5 లక్షల చొప్పున ప్యాకేజీలు ఇచ్చారనే సమాచారం ఉందన్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్‌ చేశారు. 

వైఎస్‌ జగన్‌ రాజకీయ ప్రభావాన్ని తగ్గించేందుకు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతును దూరం చేయలేరన్నారు.ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులను ఓటు అనే ఆయుధంతో తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు రవికుమార్‌ రెడ్డి, షబ్బీర్‌ వలి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ చంద్ర ఓబుల్‌ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు మునీర్‌ బాష, పార్టీ నేతలు రవిశంకర్‌ గౌడ్, మాజీ సర్పంచ్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement