సుప్రీంకోర్టు ఆదేశాలనూ ఎస్‌ఈసీ లెక్కచేయడంలేదు | YSRCP says SEC has completely failed in conducting local body elections | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు ఆదేశాలనూ ఎస్‌ఈసీ లెక్కచేయడంలేదు

Nov 1 2026 5:39 AM | Updated on Nov 1 2026 5:39 AM

YSRCP says SEC has completely failed in conducting local body elections

ఎస్‌ఈసీకి వినతి పత్రం ఇస్తున్న లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, మనోహర్‌ రెడ్డి, తదితరులు

ఎన్నికల నిర్వహణలో విఫలమైతే న్యాయపోరాటం తప్పదు

పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టరు?

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో బయటి వ్యక్తుల పాగా

వాళ్లను వెనక్కి పంపాలని అడిగినా చర్యలు శూన్యం

వైఎస్సార్‌సీపీ నేతలు ఫైర్‌

ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని వినతి

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) పూర్తిగా విఫలమైందని, కనీసం పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు మలసాని మనోహర్‌ రెడ్డి మండిపడ్డారు. వారు శనివారం మరోసారి ఎస్‌ఈసీని కలిసి పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పోలింగ్‌ రోజు నిరంతర వెబ్‌ క్యాస్టింగ్‌తో పాటు పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైన నాటి నుంచీ తాము చేస్తున్న ఫిర్యాదుల్ని పట్టించుకోని ఎస్‌ఈసీ.. ఆదివారం పోలింగ్‌ నిర్వహణలో కూడా విఫలమైతే మాత్రం న్యాయపోరాటం తప్పదని వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. 

ఎవరి అండతో ఎస్‌ఈసీ ఈ విధంగా వ్యవహరిస్తోంది?
ఎస్‌ఈసీని కలిసిన అనంతరం మల్లాది విష్ణు, మలసాని మనోహర్‌ రెడ్డితో కలిసి లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘ఈ ఎన్నికల్లో అధికార కూటమి అక్రమాలు, దౌర్జన్యాలపై దాదాపు ప్రతి రోజూ ఎస్‌ఈసీకి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. రెవెన్యూ, పోలీసు అధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వైఫల్యాలపైనా ఫిర్యాదులు చేస్తున్నాం. అయినా ఎలాంటి స్పందన లేదు. ఎస్‌ఈసీ కార్యాలయం కేవలం పోస్టాఫీసులా మారింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే స్వతంత్ర సంస్థలా లేదు. పోలింగ్‌ బూత్‌లలో సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీం కోర్టు చెప్పినా లెక్కచేయలేదు. 

ఎస్‌ఈసీ ఎవరి అండ చూసుకుని ఈ విధంగా ప్రవరిస్తున్నారు? కనీసం 7 వేల పోలింగ్‌ బూత్‌లలో కూడా సీసీ కెమెరాలు, వెబ్‌ క్యాస్టింగ్‌ లేవని అధికారులే చెప్తున్నారు. దేశంలో ఇంత అసమర్ధమైన ఎస్‌ఈసీని చూడలేదు. చివరి నిమిషంలో కోర్టు ఆదేశాలు వస్తే ఇప్పటికిప్పుడు సీసీ కెమెరాలు ఎలా పెట్టగలమని ఎస్‌ఈసీ ప్రైవేటు సంభాషణల్లో మాట్లాడు­తున్నారు. ఎస్‌ఈసీ  మాట్లాడాల్సిన మాటలా ఇవి? ఈరోజు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పోలింగ్‌కు సంబంధించి కఠిన నిర్ణయాలు వెల్లడిస్తారని భావించాం. 

కానీ ఆయన ఆఫ్‌ ది రికార్డ్‌గా సీసీ కెమెరాలు పెట్టలేమని తేల్చేశారు.  వెన్నుపోటు పార్టీకి చెందిన వారు ఏకగ్రీవంగా గెలిచారని ఎస్‌ఈసీ చెప్పడం ఏంటి? రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన కూడా పచ్చ చొక్కా వేసుకుంటే సరిపోతుంది. ఆదివారం జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా, దొంగ ఓట్లు వేసుకున్నా, రిగ్గింగ్‌ జరిగినా ఎస్‌ఈసీ పూర్తి బాధ్యత వహించాలి. ఎస్‌ఈసీపై న్యాయ­పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. పదవిలో ఉన్నా, లేకున్నా వదిలిపెట్టేది లేదు’ అని స్పష్టం చేశారు.

ఆ సర్క్యులర్‌ ఎందుకు బయటపెట్టరు? 
‘ఏజెంట్లుగా ఫారాలు ఇచ్చిన వాళ్లను గంట ముందు పోలింగ్‌ కేంద్రాల్లో కూర్చొబెట్టాలన్న సర్క్యులర్‌ ఎందుకు ఇవ్వరు? అదే అడిగితే నిన్న చెప్పిన మాటే ఇవాళా చెప్పారు. బూత్‌ల ఆక్రమణ, రిగ్గింగ్‌ కోసం బయటి వ్యక్తులు వందల సంఖ్యలో నగరాలకు, పట్టణాలకు వచ్చి తిష్ట వేస్తున్నారు. వారిని బయటకు పంపమంటే వినిపించుకోరు. ఎప్పుడైనా రాజకీయ పార్టీల మధ్య ఎన్నికలు జరుగుతాయి. 

ఇప్పుడు ఏపీలో వైఎస్సార్‌సీపీ ఓవైపు టీడీపీతో, మరోవైపు పచ్చ చొక్కాలు వేసుకున్న రెవెన్యూ అధికారులు, ఎస్‌ఈసీతో పోరాడాల్సి వస్తోంది. దీనిపై ప్రజలు, ఓటర్లు విజ్ఞతతో ఆలోచించాలి. అధికారం అండ చూసుకుని దుర్మార్గాలకు పాల్పడుతున్న టీడీపీకి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి. ప్రజాస్వామ్య పునరుద్ధరణలో వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలి’ అని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement