దమననీతి.. దౌర్జన్యకాండ | Ruling party anarchy targeting opposition leaders | Sakshi
Sakshi News home page

దమననీతి.. దౌర్జన్యకాండ

Nov 1 2026 5:47 AM | Updated on Nov 1 2026 5:47 AM

Ruling party anarchy targeting opposition leaders

పులివెందులలో హింసాకాండకు టీడీపీ కార్యాలయం వెనుక కర్రలను సిద్ధంగా ఉంచుతున్న ఆ పార్టీ శ్రేణులు

అధికారమదంతో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా పచ్చమూకల అరాచకాలు  

సంతబొమ్మాళి మండలంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బైండోవర్‌ బెదిరింపులు 

తిరుపతిలో మితిమీరిన పచ్చ నేతల ఆగడాలు  

మంత్రాలయం మండలం మాధవరంలో పచ్చమూకల విధ్వంసకాండ    

పెనుకొండలో కోడ్‌ ఉల్లంఘన..పట్టించుకోని  అధికారులు 

మంత్రి సత్యకుమార్‌ వేధింపులపై ధర్మవరం వ్యాపారి వీడియో వైరల్‌ 

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: స్థానిక ఎన్నికల్లో అధికారపార్టీ ఆగడాలు ఆగడం లేదు. దమనకాండ యథేచ్ఛగా సాగుతోంది. ప్రతిపక్ష  వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఖాకీలు, పచ్చగూండాలను ఉసిగొలిపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ఆదివారం మున్సిపల్‌ పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో కూటమి దాష్టీకా లు మరింత శ్రుతిమించాయి. దాడులు, అరాచకాలతో పచ్చమూకలు పేట్రేగిపోతున్నాయి. అధికారపార్టీ ప్రోద్బలంతో ఖాకీలూ రెచ్చిపోతున్నారు. 

పొరుగుప్రాంతాల నుంచి టీడీపీ దిగుమతి చేసిన రౌడీలు, గూండాలు ఎన్నికలు జరిగే నగరాలు, పట్టణాల్లో పాగా వేశారు. పోలింగ్‌లో బూత్‌లను ఆధీనంలోకి తీసుకుని భారీగా రిగ్గింగ్‌కు పాల్పడా లని  పథక రచన చేశారు. ఎవరైనా అడ్డొస్తే విధ్వంసకాండ సృష్టించేందుకు కుట్రపన్నారు. పోలీసులు వీరికి సహకరిస్తూ ప్రతిపక్ష నేతలపై బైండోవర్‌ కేసులు పెడుతున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లాల్లో ఎన్నికల అధికారులకు, ఎస్పీలకు  వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. 

బెడిసికొట్టిన పచ్చ సీఐ కుతంత్రం
తిరుపతి జిల్లా నాయుడు పేట అర్బన్‌ సీఐ వెంకటరమణ తన సిబ్బందితో వచ్చి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంట్లో మద్యం బాటిళ్లు పెడుతూ అడ్డంగా దొరికిపోయారు. మద్యం బాటిళ్లు తెచ్చి పెట్టి  అభ్యర్థిపై కేసు పెట్టేందుకు చేసిన ఈ కుతంత్రం అంతా పార్కింగ్‌లో ఉన్న కెమెరాల్లో రికార్డవడంతో పన్నాగం బెడిసికొట్టింది.  

ప్రచారం చేస్తే కాళ్లూచేతులు విరిచేస్తా  
చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీలో టీడీపీ నేతలు బరితెగించారు. 17వ వార్డు టీడీపీ ఇన్‌చార్జి రూపేష్‌ రాయల్‌ వైఎస్సార్‌సీపీ కార్యకర్త సోమశేఖర్‌రెడ్డికి ఫోన్‌ చేసి బెదిరించారు. వైఎస్సార్‌సీపీ తరఫున ప్రచారం చెయ్యొద్దని, కాదని ప్రచారం చేస్తే కాళ్లూచేతులు విరిచేస్తానని బెదిరింపులకు దిగారు. చెప్పుతో కొడతానని అవమానించారు. 

నిబంధనలు ‘స్లిప్‌’ చేశారు 
పెనుకొండలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరుగుతున్నా ఎన్నికల అధికారులకు కన్పించడంలేదు. ప్రచార సమయం ముగిసినా టీడీపీ కార్యకర్తలు సీరియల్‌ నంబర్లతో కూడిన స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్న పోలీసులు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన టీడీపీ వాళ్ల  విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ప్రతిపక్షానికి ఒకలా? అధికారపక్షానికి మరొకలా? ఉంటాయా? అని నిలదీస్తున్నారు. 

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచార సమయం ముగిసినప్పటికీ టీడీపీ స్లిప్‌లు పంపిణీ చేస్తోందని, పోలీసులు, అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై బైండోవర్‌ కేసులు నమోదు చేస్తూ, మరోవైపు టీడీపీ కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పోలింగ్‌ స్టేషన్‌ వద్దే టీడీపీ ఫ్లెక్సీలు  
అనంతపురం వేణుగోపాల్‌ నగర్‌ పోలింగ్‌ స్టేషన్‌ వద్ద టీడీపీ అభ్యర్థి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.  ఈ ఫ్లెక్సీలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేసినా అధికారులు వాటిని తొలగించలేదు. అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ నేతల బరితెగింపునకు అధికారులు సహకరించడంపై ఓటర్లు మండిపడుతున్నారు. 

» శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు కల్లూరి పాపారావు, మల్ల నిర్మలరాజు, జగ్గారావులపై బైండోవర్‌ పేరుతో పోలీసులు బెదిరింపులకు దిగారు. మంత్రి అచ్చెన్నాయుడు ప్రోద్బలంతో  పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి రెండు రోజులుగా వేధిస్తున్నారు. సంతబొమ్మాళి పోలీస్‌ స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్త కొన్న శ్రీరాములు అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పినా వినని పోలీసులు కనీసం మందులు వేసుకోవడానికి, భోజనం చేయడానికి కూడా అనుమతించలేదు. అదేమని అడిగితే పోలీసులు బూతులు తిట్టారని శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు. 

» వైఎస్సార్‌ జిల్లా కడప జిల్లాలో పచ్చ మూకలు రిగ్గింగ్‌ కోసం రంగంలోకి దిగాయి. నగరంలోని సాయిపేటలో మకాం వేశాయి. దాడులు,  రిగ్గింగ్‌ చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి రౌడీ మూకలను దించినట్టు సమాచారం. పులివెందులలో హింసా కాండకు టీడీపీ కార్యాలయం వెనుక కర్రలను సిద్ధం చేశాయి. 

మోటార్లు, పంపుసెట్లు ధ్వంసం 
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తున్న కురవ నాగరాజును టార్గెట్‌ చేశారు. నాగరాజుకు సంబంధించిన పొలంలో మోటార్లు, పంపు సెట్లు ధ్వంసం చేశారు. వాటి విలువ దాదాపు రూ.3 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. దీంతో బాధితుడు నాగరాజుకు అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ నేతలు భరోసా ఇచ్చారు. 

బొల్లా బ్రహ్మనాయుడుపై పోలీస్‌ పచ్చప్రతాపం  
పల్నాడు జిల్లా వినుకొండలోని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇంటికి భారీ స్థాయిలో చేరుకున్న పోలీసులు పచ్చప్రతాపం చూపించారు. వినుకొండ నుంచి నరసరావుపేట వెళ్లిపోవాలని బ్రహ్మనాయుడుకు పోలీసులు నోటీసు ఇచ్చారు. ‘మా ఇంట్లో నేను ఉంటే ఎలా వెళ్లిపొమ్మంటారు’ అని పోలీసులను బ్రహ్మన్నాయుడు ప్రశ్నించారు. పోలీసుల వ్యవహారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయినా వినకుండా భారీ ఎస్కార్ట్‌తో బొల్లాను నరసరావుపేటకు పోలీసులు తరలించారు. అయితే ఎమ్మెల్యే జీవీఎస్‌ ఆంజనేయులుకు మాత్రం పోలీసులు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఆయన వినుకొండలో ఉండి, యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడేందుకు సహాయపడ్డారు. దీనిని వైఎస్సార్‌సీపీ శ్రేణులు తప్పుబడుతున్నాయి. తరలిస్తే రెండు పార్టీల వారినీ నరసరావుపేట తరలించాలిగానీ ఇలా పక్షపాతం చూపడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.  

మంత్రి సత్యకుమార్‌ బెదిరింపుల పర్వం
అనంతపురం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో బీజేపీ అభ్యర్థి కోసం మంత్రి సత్యకుమార్‌ అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బు, మద్యం, బెదిరింపులతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా  శనివారం నుంచి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలను కూటమి నేతలు విచ్చలవిడిగా చేపట్టినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతోపాటు విజయవాడ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాల్లోనూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ కూటమి నేతలు యత్నిస్తున్నారు. ఓటుకు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు డబ్బులు, మద్యం, మాంసం పంచుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement