డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. బద్రీనాథ్‌ను దర్శించుకుని తిరిగి డెహ్రాడూన్ వెళ్తుండగా భారత్ ఏవియేషన్‌కు చెందిన ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా జోషిమఠ్ - బద్రీనాథ్ మార్గంలో జోషిమఠ్ సమీపంలోని చాయీ గ్రామం వద్ద ఈ హెలికాప్టర్ రాడార్‌తో సంబంధాలు (సిగ్నల్) కోల్పోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో పైలట్‌తో పాటు ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు.
ఒకవైపు దట్టమైన మంచు, మరోవైపు భారీ వర్షం కురుస్తుండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమైనట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో బద్రీనాథ్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగిందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.
ముమ్మరంగా సహాయక చర్యలు
ప్రమాదంపై సమాచారం అందుకున్న రాష్ట్ర సహాయక బృందాలు, ఆర్మీ ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ శాఖ, ఎస్డీఆర్ఎఫ్ సంయుక్తంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
‘నేనే స్వయంగా ఈ మొత్తం ఘటనను నిరంతరం పర్యవేక్షిస్తున్నాను. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం వెంటనే ఉన్నత కేంద్రాలకు హెలికాప్టర్ ద్వారా తరలించాలని ఆదేశాలు జారీ చేశాను. ప్రయాణికులు క్షేమంగా తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
కాగా, గత ఏడాది జూన్‌లోనూ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం నుంచి గుప్తకాశికి ప్రయాణికులను తీసుకువెళ్తున్న హెలికాప్టర్ అడవిలో కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో యాత్రికుల్లో ఆందోళన నెలకొంది.


