గ్యాస్, ఎరువుల కొరతపై తప్పుడు ప్రచారం.. విపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్ | PM Modi fires On opposition False propaganda on gas and fertilizer shortage | Sakshi
Sakshi News home page

గ్యాస్, ఎరువుల కొరతపై తప్పుడు ప్రచారం.. విపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్

Oct 30 2026 2:46 PM | Updated on Oct 30 2026 3:08 PM

PM Modi fires On opposition False propaganda on gas and fertilizer shortage

గుజరాత్: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ గ్యాస్, ఎరువుల కొరత ఏర్పడుతుందంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు కొందరు సంతోషం పొందుతున్నారని, తనకు చెడ్డపేరు తీసుకురావడమే వారి లక్ష్యమని ఆయన విమర్శించారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా భిల్డీలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, ఎరువుల ధరల పెరుగుదల భారాన్ని రైతులపై పడకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ప్రధాని మోదీ తెలిపారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారని చెప్పారు. కానీ కొందరికి మాత్రం దేశ అభివృద్ధి నచ్చడం లేదని, దేశం సంక్షోభంలో ఉన్నప్పుడే వారు సంతోషిస్తారని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రధాని విమర్శించారు. దేశం కష్టాల్లో పడాలని కోరుకునే వ్యక్తులు కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు.

దేశ ప్రజలకు తన చివరి శ్వాస వరకు సేవ చేస్తానని ప్రధాని  మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రూ.14 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడతగా దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లకు పైగా జమ చేశారు. గుజరాత్‌లో 50 లక్షల మందికి పైగా రైతులకు రూ.1,000 కోట్లకు పైగా నిధులు అందాయని తెలిపారు.

బనస్కాంతలో 127 ఎకరాల్లో ఏర్పాటు చేసిన భారత్ బోవైన్ బ్రీడింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. కంక్రేజ్ పశు జాతి అభివృద్ధి, నాణ్యమైన పశు ఉత్పత్తి లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. బనాస్ డెయిరీ ఆధ్వర్యంలో రెండు బయో సీఎన్‌జీ ప్లాంట్లు, బంగాళాదుంపల ప్రాసెసింగ్ కేంద్రం విస్తరణ సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రధాని  మోదీ ప్రారంభించారు.

ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలి 10 మంది మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement