తెలంగాణ భూములపై ఢిల్లీలో రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు! | Revanth Reddy Targets KCR Family Over Alleged Land Grabbing, Lists Government Lands Recovered In Telangana, Check More Details Inside | Sakshi
Sakshi News home page

తెలంగాణ భూములపై ఢిల్లీలో రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు!

Oct 30 2026 2:16 PM | Updated on Oct 30 2026 2:47 PM

Revanth Reddy KCR Miyapur Land Case Supreme Court

ఢిల్లీ: సాక్షి,న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయల విలువైన 550 ఎకరాల మియాపూర్ భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం,మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌ను అడ్డుపెట్టుకుని మియాపూర్ భూములను కాజేసేందుకు నాటి సీఎం కేసీఆర్ ప్రయత్నించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాలనీల పేరుతో 550 ఎకరాలను ఆక్రమించేందుకు రికార్డులను తారుమారు చేశారని, ‘ధరణి’ పేరుతో పెద్దఎత్తున భూ దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. గోల్డ్‌స్టోన్ ప్రసాద్ నుంచి దామోదర్ రావుకు బెంజ్ కార్లు బహుమతిగా ఇచ్చారని, అయితే ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్థంగా వాదనలు వినిపించలేదని అన్నారు. దీంతో మియాపూర్ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని తమ ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను కాపాడినట్లు సీఎం వివరించారు. ఐఎంజీకి సంబంధించిన 850 ఎకరాలు, ఎల్బీనగర్‌లో 150 ఎకరాలు,మంచిరేవులలో 148 ఎకరాలు ఉన్నట్లు గుర్తు చేశారు. అలాగే హయత్‌నగర్‌లో అటవీ భూములను కాపాడామని, కొండాపూర్‌లో ఆక్రమణకు గురైన భూములను హైడ్రా ద్వారా స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. భూపాలపల్లిలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు కట్టబెట్టే ప్రయత్నం చేసిన ప్రభుత్వ భూమిని కూడా సుప్రీంకోర్టులో పోరాడి వెనక్కి తెచ్చామని తెలిపారు.

కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు
మంచిరేవుల భూముల విషయంలో కేటీఆర్ రాయలసీమ రియల్టర్లతో ఒప్పందం చేసుకుని భూములు కట్టబెట్టేందుకు ప్రయత్నించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరించేందుకు కేసీఆర్ కుటుంబం 30 శాతం లంచం తీసుకునే ఒప్పందం చేసుకుందని విమర్శించారు. భూకబ్జాలపై ఇప్పటికే సిట్  ఏర్పాటు చేశామని, హరీశ్‌రావు మామ సిద్ధిపేటలో భూకబ్జాకు పాల్పడినట్లు తేలిందని వ్యాఖ్యానించారు. స్టూడియో కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారంటూ హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు.

ప్రజా ప్రయోజనాలకే ప్రభుత్వ భూముల వినియోగం
ప్రభుత్వ భూములను కాపాడటమే కాకుండా, వాటిని ప్రజా ప్రయోజనాలకే వినియోగిస్తామని సీఎం స్పష్టం చేశారు. అవసరమైతే ఈ భూములను విక్రయించి వచ్చిన నిధులను సాగునీటి ప్రాజెక్టులు, విద్యావ్యవస్థ అభివృద్ధి, పేదలకు ఇళ్ల నిర్మాణం, మహిళా సాధికారత కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ అంశాలపై కేబినెట్‌లో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

భూములను వదిలేస్తే మళ్లీ ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయాలని చూస్తే సహించేది లేదని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ తన అనుచరులకు భూకబ్జాలు ఆపాలని చెప్పాలని సూచించారు. తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడటంతో పాటు, వాటిని ప్రజల సంక్షేమానికి ఉపయోగించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం ఉద్ఘాటించారు. 

ఇదీ చదవండి: ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement