కూటమికి ఓటమి భయం పట్టుకుంది. ఏళ్ల తరబడి టీడీపీ జెండాను పట్టుకున్న కార్యకర్తలను నిలువునా మోసం చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. మిత్రధర్మాన్ని పాటించకుండా జనసేన, బీజేపీలకు మొండిచేయి చూపించిన నేపథ్యంలో ఆయా పార్టీల నేతలే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలోకి దిగారు. తమకు జరిగిన అన్యాయానికి కూటమిపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఈ క్రమంలో గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
కూటమి ఓటమికి రె‘బెల్స్’ మోగుతున్నాయి. ఇప్పటికీ సరైన పద్ధతిలో కూటమి ప్రజాప్రతినిధులు వ్యవహరించకపోవడం, పార్టీ నేతలను సస్పెండ్ చేస్తూ భయపెట్టే ఆలోచనలకు దిగడంతో వ్యతిరేకత పెరుగుతోంది. కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ నవంబరు ఒకటో తేదీన జరగనుంది. వైఎస్సార్‌సీపీ నేతలు సమతుల్యతను పాటిస్తూ, జెండా పట్టుకుని పాటుపడిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యం కల్పించే దిశగా అడుగులు ముందుకు వేశారు. ఆయా ప్రాంతాల్లో కష్టపడి పనిచేసే వారికి పెద్దపీట వేశారు.
మరోవైపు.. గుంటూరు ఈస్ట్, వెస్ట్‌లో ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవిలు కేవలం డబ్బులనే ప్రామాణికంగా తీసుకుని సీట్లు కేటాయించిన పరిస్థితులు ఉన్నాయని కూటమి కేడర్ బహిరంగంగానే చెబుతోంది. అసలు కూటమిలో ఎవరికి సీటు కేటాయించారో కూడా అర్థం కాని పరిస్థితులు దాపురించాయి. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో తమకు అవకాశం దొరకకపోవడంతో నామినేషన్లు దాఖలు చేసిన ఎంతోమంది కూటమి అభ్యర్థులు ‘ఫ్రెండ్లీ కాంపిటేషన్’ పేరుతో ముందుకు వచ్చారు. నగరంలో మొత్తం 76 డివిజన్లు ఉండగా, క్షేత్రస్థాయిలో సీట్లు సర్దుబాటు కాకపోవడంతో అధిక సంఖ్యలో కూటమి నుంచి రెబల్స్‌గా పోటీకి దిగుతున్నారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు రెబల్స్ పోటీ మింగుడుపడని అంశంగా మారింది.
10వ డివిజన్‌లో జనసేన తరఫున చామర్తి ఆనంద్‌సాగర్ పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి శనక్కాయాల ఉమాశంకర్ బరిలో దిగారు.
13వ డివిజన్ నుంచి టీడీపీ తరఫున గాలి సతీష్‌బాబు పోటీ చేస్తుండగా, జనసేన అభ్యర్థిగా కూరాకుల పెదశ్రీనివాసరావు తలపడుతున్నారు.22వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థిగా మల్లాల లక్ష్మీనారాయణ పోటీ చేస్తుండగా, జనసేన నుంచి సంకూరి శ్రీనివాసరావు బరిలో ఉన్నారు.
24వ డివిజన్‌లో బీజేపీ తరఫున కావటి ఉదయచంద్ర విక్రమ్‌నాయుడు, జనసేన తరఫున నిమ్మల వెంకటరమణ పోటీ చేస్తున్నారు.
39వ డివిజన్‌లో జనసేన నుంచి పసుపులేటి నరసింహారావు, బీజేపీ నుంచి బాదం శ్రీనివాసరావు తలపడుతున్నారు.
వీటితోపాటు 49వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థిగా బలిజ సుగుణాదేవి, జనసేన అభ్యర్థిగా బండ్రెడ్డి విద్యావతి, 63వ డివిజన్‌లో టీడీపీ నుంచి బేతం శౌరీ, జనసేన తరఫున కొర్రపాటి నాగేశ్వరరావు పోటీకి దిగారు. 7వ డివిజన్‌లో ఖుద్దూస్ కూడా టీడీపీ సీటు ఆశించి భంగపడి రెబల్‌గా పోటీ చేస్తున్నారు. దాదాపు అన్ని డివిజన్లలో టీడీపీ, జనసేన, బీజేపీ రెబల్ అభ్యర్థులు పలు గుర్తులతో పోటీకి దిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 133 మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఉంటే, వారిలో సుమారు 80 నుంచి 90 మంది వరకు కూటమిలో సమన్వయం లేక నామినేషన్లు దాఖలు చేసినవారేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితులను చూసిన టీడీపీ అధిష్ఠానం అభ్యర్థులను సస్పెండ్ చేస్తామని బెదిరింపులకు దిగుతోంది.
ఇప్పటికే 2వ డివిజన్‌లో టీడీపీ సీటు ఆశించి భంగపడటంతో పోటీ చేస్తున్న బేళ్ల వెంకటేశ్వరరావు యాదవ్ 40 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ముందుకు సాగారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తీరని ద్రోహం చేశారని ఆరోపిస్తూ పొన్నూరు రోడ్డులోని ఆయన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో బేళ్ల వెంకటేశ్వరరావు యాదవ్‌ను ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరికొంతమందిని ఇప్పటికే సస్పెండ్ చేసిన టీడీపీ అధిష్ఠానం.. కూటమి నేతలను సస్పెన్షన్ల పేరుతో భయాందోళనలకు గురి చేస్తోంది. దీంతో విసిగిపోయిన తెలుగు తమ్ముళ్లు, జనసేన నేతలు పూర్తిస్థాయిలో కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. కూటమిలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులు, చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న పూర్తిస్థాయి వ్యతిరేకతకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: పింఛన్ల ముసుగులో ఓటర్లకు తాయిలాలు!


