చంద్రబాబు సర్కార్ మరో బరితెగింపు కుతంత్రం
కోడ్ అమల్లో ఉన్నా నేడు హడావుడిగా అన్నదాతా సుఖీభవ
మునిసిపల్ పోలింగ్‌కు కొద్ది గంటల ముందు ప్రలోభాల ఎర
స్థానిక ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ అడ్డదారులు
ఉలుకూ పలుకూ లేని ఎస్‌ఈసీ..
సుఖీభవ పేరుతో మూడేళ్లలో రైతన్నలకు బాబు ఎగ్గొట్టింది రూ.20,905 కోట్లు
7 లక్షల మంది భూయజమానులకు ఎగనామం.. కౌలుదారులకు మొండిచెయ్యి
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్ష అభ్యర్థులు కనీసం నామినేషన్లు దాఖలు చేయకుండా దశ కుట్రలతో ప్రజాస్వామ్యం పీక నులిమి దండయాత్ర సాగించిన చంద్రబాబు చివరి అంకంలో కోడ్‌కు తూట్లు పొడుస్తూ మరో కుతంత్రానికి తెర తీశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకముందే బెదిరింపులు.. నాయకులకు గృహ నిర్బంధాలు.. నామినేషన్ కేంద్రాల వద్ద దౌర్జన్యాలు.. పత్రాలు లాక్కోవడం, చించేయడం.. స్క్రూటినీ పేరుతో తిరస్కరణలు.. బలవంతపు ఉపసంహరణలు.. బెదిరించి ఏకగ్రీవాలతో పచ్చ ముఠాలు అరాచకంగా వ్యవహరించగా తాజాగా ఓటర్లను ప్రలోభ పెట్టే ఎత్తుగడ వేశారు.
ఒకవైపు ఎన్నికల నియమావళి (కోడ్ ఆఫ్ కండక్ట్) అమలులో ఉన్నప్పటికీ ఓటర్లను ప్రలోభపెట్టడమే లక్ష్యంగా హడావుడిగా అన్నదాతా సుఖీభవ పెట్టుబడి సాయంతో పాటు సామాజిక పింఛన్ల పంపిణీకి సిద్ధమయ్యారు. పోలింగ్‌కు ముందు అధికార టీడీపీ నేతలు పింఛన్ల ముసుగులో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ తాయిలాలు ఎర వేసేందుకు పచ్చ జెండా ఊపారు. పోలింగ్‌కు కొద్ది గంటల ముందు 1.06 కోట్ల మందికి దాదాపు రూ.5,718 కోట్లు జమ చేసేందుకు సన్నాహాలు చేశారు. అయినా సరే చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) నోరు మెదపకపోవడం విభ్రాంతి కలిగిస్తోందని రాజకీయ పరిశీలకులు, ప్రజాస్వామ్యవాదులు పేర్కొంటున్నారు.
నగదు రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నందున ఇది కచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేస్తున్నారు. పోలింగ్ ముగిసిన తరువాత జమ చేస్తే ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ఈ ప్రత్యక్ష నగదు పంపిణీ కార్యక్రమాలను నిలుపుదల చేయాలని, ఈమేరకు ఎస్‌ఈసీ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు సర్కార్ యథేచ్చగా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని, అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి తెగిస్తోందని తేల్చి చెబుతున్నారు. 2024 సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు జమ చేసేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా నాడు టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసి అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికే..
సామాజిక పింఛన్ల పంపిణీలోనూ ఎన్నికల నియమావళికి బాబు సర్కార్ తూట్లు పొడుస్తోంది. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేయడం ఆనవాయితీ. అయితే నవంబర్ 1వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోందంటూ ఆగమేఘాలపై ముందే పంపిణీకి చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమైంది. రాష్ట్రంలో దాదాపు 59.70 లక్షల మందికి రూ.2,593 కోట్లు పంపిణీకి ఏర్పాట్లు చేసింది.
మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనున్న తరుణంలో పింఛన్ల పంపిణీ కచ్చితంగా ఓటర్లను ప్రలోభానికి గురి చేయడమేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. పైగా పింఛన్ల పంపిణీ ముసుగులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ కూటమి అభ్యర్థులు నగదుతో పాటు ఇతర తాయిలాలు పంపిణీ చేసే అవకాశాలున్నాయని స్పష్టం చేస్తున్నారు. పోలింగ్ తర్వాత రోజు పింఛన్లు పంపిణీ చేస్తే ఇబ్బందేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ తక్షణమే స్పందించి ఓటర్లను ప్రభావితం చేసే నగదు పంపిణీ కార్యక్రమాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మూడేళ్లలో రూ.20,905 కోట్లు ఎగనామం..
అన్నదాతా సుఖీభవ పథకం ద్వారా కేంద్రంతో సంబంధం లేకుండానే ఏటా రూ.20 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సార్వత్రిక ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా చంద్రబాబు దారుణంగా దగా చేశారు. తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టగా.. రెండో ఏడాది అరకొరగా విదిలించారు. వాస్తవానికి ఏటా నవంబర్‌లో రెండో విడత సాయం జమ చేస్తుంటారు. కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా మున్సిపల్ పోలింగ్‌కు రెండు రోజుల ముందు అన్నదాతా సుఖీభవ పంపిణీకి సిద్ధమయ్యారు.
2023–24లో రైతు భరోసా కింద 53.58 లక్షల మంది లబ్ధి పొందగా, ఆ మేరకు ఒక్కొక్కరికీ రూ.20వేల చొప్పున చంద్రబాబు సర్కార్ రైతన్నలకు రూ.10,717 కోట్లు జమ చేయాల్సి ఉంది. కానీ 2024–25 సీజన్‌లో ఏ ఒక్కరికీ పైసా కూడా విదల్చలేదు. 2025–26లో దాదాపు ఏడు లక్షల మందికి కోత పెట్టిన కూటమి ప్రభుత్వం కేవలం 46.86 లక్షల మందికి రూ.14 వేల చొప్పున రూ.6560.18 కోట్లతో సరిపెట్టింది. 2026–27 సీజన్ తొలివిడతలో 46.86 లక్షల మందికి కేంద్రం పీఎం కిసాన్ కింద రూ.2 వేల చొప్పున రూ.782.55 కోట్లు జమ చేయగా, అన్నదాతా సుఖీభవ కింద ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున రూ.2,342.92 కోట్లు జమ చేశారు.
కాగా రెండో విడతగా 46.86 లక్షల మందికి కేంద్రం తాజాగా రూ.2 వేల చొప్పున రూ.782.55 కోట్లు జమ చేస్తుండగా, చంద్రబాబు ప్రభుత్వం రూ.5 వేల చొప్పున రూ.2342.92 కోట్లు జమ చేయనుంది. మూడేళ్లలో అన్నదాతా సుఖీభవ పథకం కింద రూ.32,151 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. చంద్రబాబు సర్కార్ తాజాగా జమ చేయనున్న సాయం కూడా కలిపితే రూ.11,246 కోట్లు జమ చేసినట్లవుతుంది. ఈ లెక్కన మూడేళ్లలో చంద్రబాబు అక్షరాలా రూ.20,905 కోట్లు రైతన్నలకు ఎగ్గొట్టారు! ఇక వరుసగా మూడో ఏడాది కూడా కౌలు రైతులకు మొండిచెయ్యి చూపారు. భూ యజమానులతో సమానంగా కౌలు రైతులకు కూడా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి తూట్లు పొడుస్తూ వారి నోట్లో మట్టికొట్టారు.


