సాయంత్రం 5 గంటల కల్లా ప్రచారం ముగింపు
1న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
13 మేయర్ పదవులకు పోటీలో 153 మంది
70 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులకు 367 మంది పోటీ
ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణకు చర్యలు: ఎస్‌ఈసీ
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు తెరపడనుంది. ఇప్పటికే ఏకగ్రీవమైన వాటిని మినహాయిస్తే.. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 772 వివిధ స్థాయి పదవులకు ఎన్నికలు జరుగుతుండగా, వీటిలో 4,042 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 13 నగరపాలక సంస్థల మేయర్ పదవులకు 153 మంది పోటీ పడుతున్నారు. ఈ కార్పొరేషన్లలోని మొత్తం 922 డివిజన్ కార్పొరేటర్ ఎన్నికలకు 118 డివిజన్లు ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. మిగిలిన 804 చోట్ల 3,073 మంది పోటీలో ఉన్నారు. 87 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 17 మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలు, 637 కౌన్సిలర్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 70 ఛైర్‌పర్సన్ స్థానాలకు 367 మంది పోటీలో ఉన్నారు. 2,382 వార్డు కౌన్సిలర్ పదవులకు 6,669 మంది పోటీలో ఉన్నారు.
ఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లోనూ ఓటర్ స్లిప్‌లు
నవంబరు ఒకటిన జరిగే మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికారుల ద్వారా ఓటర్ల స్లిప్‌ల పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఓటర్లు నేరుగా స్లిప్‌లు డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కూడా శుక్రవారం అందుబాటులోకి తేనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు ఏర్పాట్లు : ఎస్‌ఈసీ
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపింది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు డ్రోన్లు, సీసీ కెమెరాలు, వీడియోగ్రాఫర్ల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. ఎన్నికల భద్రత కోసం మొత్తం 36,351 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్టు తెలిపింది. 34 మంది ఎస్పీలు, 52 మంది అదనపు ఎస్పీలు, 152 మంది డీఎస్పీలు పోలింగ్ బందోబస్తును పర్యవేక్షిస్తారని పేర్కొంది. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను 111 స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్ర పరుస్తామని తెలిపింది.
671 అత్యంత సమస్యాత్మక, 1,233 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
ఈ ఎన్నికలకు రాష్ట్రవ్యాప్తంగా 4,372 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 671 కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ కేంద్రాల వద్ద 3,355 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. మరో 1,233 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా పేర్కొంటూ, వీటి వద్ద 4,943 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు చెప్పింది. ఉద్రిక్తతల కట్టడికి 1,394 మంది పోలీసులతో 347 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, మరో 1,479 మందితో 481 స్ట్రైకింగ్ ఫోర్సెస్, ఇంకో 3,103 మందితో 1,543 రూట్ మొబైల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
పోలింగ్ సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎన్నికలకు ఆటంకం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించింది. ప్రతి ఓటరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.


