అండమాన్‌లో మరో అల్పపీడనం | Heavy rains in the state on November 1st and 2nd | Sakshi
Sakshi News home page

అండమాన్‌లో మరో అల్పపీడనం

Oct 30 2026 5:03 AM | Updated on Oct 30 2026 5:03 AM

Heavy rains in the state on November 1st and 2nd

31న వాయుగుండంగా మారే అవకాశం

నవంబర్‌ 1,2 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు 

బలహీనపడిన అర్నబ్‌ 

వాతావరణ శాఖ వెల్లడి 

సాక్షి, అమరావతి: అర్నబ్‌ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి రాష్ట్రం ఇంకా తేరుకోకముందే మరో గండం ముంచుకొస్తోంది. దక్షిణ అండమాన్‌ సముద్రంలో గురువారం ఒక అల్పపీడనం ఏర్పడింది. అక్టోబర్‌ 31వ తేదీ నాటికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఇది మరింత బలపడి, పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ  రెండు రోజుల్లో ఏపీ తీరం వైపు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్‌ 1, 2 తేదీల్లో కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

నవంబర్‌ ఒకటో తేదీన కాకినాడ, కోనసీమ, అల్లూరి, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ రెండు రోజుల పాటు తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. మరోవైపు అతి తీవ్ర తుపానుగా తీరం దాటిన అర్నబ్‌ క్రమంగా బలహీనపడి ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది.  

పలుచోట్ల భారీ వర్షం 
తుపాను ప్రభావంతో బుధవారం ఉదయం 8.30 నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. గురువారం కూడా ఉద్దానంలో వర్షం ఆగలేదు. రాత్రి 8 గంటల వరకు పలాసలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో అత్యధికంగా 24.8 సెం.మీ వర్షపాతం నమోదైంది.

ఇచ్ఛాపురం 23.4, సోంపేట మండలం కొర్లాం 20.6, కవిటి మండలం రాజపురం 18.6, పలాస 18.2, మెలియాపుట్టి 17.8, మందస 16.5, అల్లూరి జిల్లా అరకులోయ మండలం నిన్నిమామిడివలస 15.5, పాడేరు 14.4, ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో 13.3, కృష్ణా జిల్లా గూడూరులో 12.6, చల్లపల్లిలో 12.2, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ 12.4, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 12.3, బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి 10.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement