చెక్‌బౌన్స్ కేసు పరిహారం విషయంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ
స్పష్టత కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని సూచన
సాక్షి, న్యూఢిల్లీ: చెక్‌బౌన్స్ కేసుకు సంబంధించి పరిహారం మొత్తంలో 20 శాతాన్ని డిపాజిట్ చేయాలన్న అప్పీలేట్ జిల్లా కోర్టు ఉత్తర్వులను హైకోర్టు పూర్తిగా కొట్టివేస్తే.. ‘నిందితుడు అప్పీల్‌కు వెళ్లేందుకు వెసులుబాటుగా ట్రయల్ కోర్టు ఇచ్చిన తాత్కాలిక శిక్షా నిలుపుదల ఉత్తర్వులు (సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్) కూడా వాటంతట అవే రద్దవుతాయని’ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వెసులుబాటు ఉత్తర్వులు అమల్లో లేనప్పుడు మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పే తక్షణం అమల్లోకి వచ్చి, నిందితుడిని కస్టడీలోకి తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంది.
చెక్‌బౌన్స్‌కు సంబంధించి గొద్దుమర్రి ఆదినారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కుచి శ్రీ లక్ష్మి కేసులో ట్రయల్ కోర్ట్ విధించిన పరిహారంలో 20 శాతం డిపాజిట్ చేయాలని షరతు విధిస్తూ అప్పీలేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు, వాటిని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు, దీనిపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)పై విచారణ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది.
‘కేవలం 20 శాతం డిపాజిట్ నిబంధనను మాత్రమే పక్కనపెట్టడం హైకోర్టు ఉత్తర్వుల ఉద్దేశం అయి ఉండొచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టు ఉత్తర్వులపై స్పష్టత లేదా సవరణ కోసం తిరిగి హైకోర్టు సింగిల్ జడ్జినే ఆశ్రయించాలని కక్షిదారులకు సూచించింది. అప్పటి వరకు ప్రస్తుత ఎస్‌ఎల్‌పీని పెండింగ్‌లో ఉంచుతున్నట్లు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ఆర్డర్‌లో ఉన్న ఈ సాంకేతిక లోపాన్ని వివరించిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.


