విధ్వంసకాండకు వ్యూహం | Tdp Sketch of illegal arrests of YSRCP leaders including MP Avinash Reddy in Pulivendula | Sakshi
Sakshi News home page

విధ్వంసకాండకు వ్యూహం

Oct 30 2026 4:56 AM | Updated on Oct 30 2026 4:56 AM

Tdp Sketch of illegal arrests of YSRCP leaders including MP Avinash Reddy in Pulivendula

పులివెందులలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా దాడి చేస్తున్న టీడీపీ మూకలు (ఫైల్‌)

‘పులివెందుల’పై ‘పచ్చ’ పడగ  

యథేచ్ఛగా రిగ్గింగ్‌కు చంద్రబాబు పక్కా పన్నాగం 

తెల్లవారుజామున టీడీపీ గూండాలతో దాడులకు కుతంత్రం 

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హౌస్‌ అరెస్టుకు కుయుక్తులు

ఎంపీ అవినాశ్‌ రెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ నేతల అక్రమ అరెస్టులకు స్కెచ్‌ 

అనంతరం జమ్మలమడుగు, కమలాపురం నుంచి టీడీపీ గూండాల రంగ ప్రవేశం 

బూత్‌కు 100 మంది చొప్పున పచ్చ రౌడీల మోహరింపు 

వైఎస్సార్‌సీపీ, తటస్థ ఓటర్లను అడ్డుకోవడమే లక్ష్యం 

సీఎంవో, డీజీపీ కార్యాలయం నుంచే కుట్రకు రచన

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ కంచుకోట పులివెందులలో టీడీపీకి అనుకూలంగా భారీ రిగ్గింగ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు బరితెగిస్తున్నారు. సజావుగా పోలింగ్‌ జరిగితే పులివెందులలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం ఖాయమన్నది బహిరంగ రహస్యమే. అందుకే అసలు పోలింగ్‌ ప్రక్రియను పూర్తిగా హైజాక్‌ చేసేందుకు టీడీపీ కూటమి పక్కా పన్నాగానికి తెరతీసింది. సామాన్య ఓటరు అన్నవారు ఎవరూ కనీసం పోలింగ్‌ బూత్‌ దరిదాపులకూ వెళ్లకుండా బీభత్సం సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు పోలింగ్‌ బూత్‌లను పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవాలని,  యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడేందుకు కుట్రపన్నింది. దీనికోసం ఇతర నియోజకవర్గాల నుంచి టీడీపీ రౌడీమూకలను ఇప్పటికే మోహరించింది. 

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ రౌడీ మూకలే అల్లర్లు సృష్టించి.. ఇదంతా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే చేస్తున్నారని దుష్ప్రచారం చేయాలన్నది కుట్రలో ప్రధాన భాగం. వెంటనే ఎల్లో మీడియా, టీడీపీ సోషల్‌ మీడియా అదే దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రంగంలోకి దిగేందుకు వ్యూహం పన్నుతున్నాయి. అందుకోసమే కాచుకుని ఉన్న పోలీసులు వెంటనే వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను కట్టడి చేసేందుకు విరుచకుపడాలని ప్రణాళిక రచించినట్టు సమాచారం. 

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నోటీసులు ఇవ్వడంతోపాటు హౌస్‌ అరెస్టు చేసేందుకు కూడా సన్నద్ధమవుతుండడం ప్రభుత్వ కుట్రకు పరాకాష్ట. ఇక ఎంపీ అవినాశ్‌ రెడ్డి, ఇతర కీలక నేతలు, ప్రధాన కార్యకర్తలను అక్రమ అరెస్టులతో కట్టడి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం, డీజీపీ కార్యాలయం పర్యవేక్షణలో.. డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విశ్వనాథ్‌ సూత్రధారులుగా... టీడీపీ రౌడీ మూకలు పాత్రధారులుగా పోలింగ్‌ రోజు బీభత్సం సృష్టించేందుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రిగ్గింగ్‌తో బెంబెలెత్తించేందుకు చంద్రబాబు ప్రభుత్వ పక్కా స్కెచ్‌ ఇలా ఉంది. 

పోలింగ్‌ ప్రక్రియ హైజాక్‌కు చంద్రబాబు కుట్ర 
పులివెందుల మున్సిపాలిటీలో టీడీపీ ఎన్నికల అక్రమాలు అంతూపొంతూ లేకుండా సాగుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 40 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకునేందుకు టీడీపీ బరితెగించి గూండాగిరీతో బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. టీడీపీ ఆవిర్భావం నుంచి  పులివెందుల నియోజకవర్గంలో ఆ పార్టీ ఒక్కసారి కూడా గెలవనే లేదు.  గతంలో పులివెందుల మేజర్‌ పంచాయతీలో, అనంతరం మున్సిపాలిటీగా మారిన తరువాత కూడా టీడీపీ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది. 

వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానికి పులివెందుల పెట్టని కోటగా నిలుస్తోంది. అటువంటి పులివెందుల మున్సిపాలిటీలో సక్రమంగా ఎన్నికలు నిర్వహిస్తే ఈసారి కూడా టీడీపీ అభ్యర్థి డిపాజిట్‌ గల్లంతే అవుతుందన్నది సుస్పష్టం. అందుకే అసలు ఎన్నికల ప్రక్రియనే హైజాక్‌ చేసి అడ్డదారిలో విజయం సాధించేందుకు చంద్రబాబు కుతంత్రానికి తెరతీశారు. మున్సిపాలిటీ నామినేషన్ల ప్రక్రియకు ముందు నుంచే టీడీపీ గూండాలు దాడులు, దౌర్జన్యాలతో భీతావహ పరిస్థితులు సృష్టించారు.

మొత్తం 40 వార్డులలో కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కనీసం నామినేషన్‌ కూడా వేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా విధ్వంసకాండకు పాల్పడ్డారు. యావత్‌ పోలీసు యంత్రాంగం టీడీపీ గూండాగిరీకి కొమ్ముకాసింది. వైఎస్సార్‌సీపీకి తిరుగులేని పట్టున్న పులివెందుల మున్సిపాలిటీలో 20 వార్డులలో ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్‌ వేయకుండా అడ్డుకోవడమే అందుకు తార్కాణం.అయినా సరే టీడీపీ, పోలీసుల బెదిరింపులు, దాడులను ఎదురొడ్డి మరీ 20 వార్డులలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

ఘర్షణలు సృష్టిద్దాం... అక్రమ అరెస్టులు చేసేద్దాం...
ఇదీ చంద్రబాబు పన్నాగం 
వైఎస్‌ జగన్, ఎంపీ అవినాశ్‌లపై పోలీసుల గురి 
భారీ ఎత్తున అక్రమ అరెస్టులకు కుతంత్రం 
పులివెందులలో పోలింగ్‌ రోజు అంటే నవంబరు 1న తెల్లవారుజామునే ఘర్షణలు సృష్టించేందుకు టీడీపీ, పోలీసు యంత్రాంగం కుతంత్రం పన్నింది.  అందుకోసం ప్రత్యేకంగా 500మంది గూండాలను ఇతర ప్రాంతాల నుంచి రప్పించినట్టు విశ్వసనీయ సమాచారం. మున్సిపాలిటీ పరిధిలో రెండు మూడు చోట్ల టీడీపీ గూండాలు ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు సామన్యులపై దాడులకు తెగబడేందుకు సన్నద్ధమవుతున్నారు. తద్వారా మున్సిపాలిటీలో ఘర్షణలు సృష్టించాలన్నది లక్ష్యం. అందుకోసమే కాచుకుని ఉన్న టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులు రంగ ప్రవేశం చేస్తారు. 

వాస్తవంగా దాడులు, ఘర్షణలకు పాల్పడిన టీడీపీ గూండాలపై మాత్రం ఎటువంటి చర్యలూ తీసుకోరు. కానీ శాంతిభద్రతల సమస్య తలెత్తింది. ముందస్తు చర్యల పేరుతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయాలన్నది అసలు పన్నాగం. ముందుగా వైఎస్సార్‌సీపీ అధినేత. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డినే అక్రమంగా అరెస్టు చేయాలన్నది పోలీసు శాఖ లక్ష్యమని విశ్వసనీయ సమాచారం. ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత హౌస్‌ అరెస్టు చేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగంగా ఉంది. 

అదే ఊపులో ఎంపీ అవినాశ్‌ రెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ ప్రధాన నేతలు, ద్వితీయ శ్రేణినేతలు, కార్యకర్తలను భారీస్థాయిలో ముందస్తు అరెస్టులు చేయాలన్నది కుతంత్రం. భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నేతలను అదుపులోకి తీసుకుని తరలించేందుకు పులివెందులలో ఓ కల్యాణ మండపాన్ని కూడా ఇప్పటికే గుర్తించి సిద్ధం చేశారు. ఆ విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఎంపీ అవినాశ్‌రెడ్డిలతోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులను సాయంత్రం పోలింగ్‌ ముగిసే వరకు బయటకు రాకుండా కట్టడి చేయడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యమన్నది సుస్పష్టమవుతోంది.

బాబులో గుబులు..
మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా వైఎస్‌ ప్రమీలమ్మ నామినేషన్‌ వేసి బరిలో నిలిచారు. దాంతో నవంబరు 1న పోలింగ్‌ నిర్వహించక తప్పనిసరి పరిస్థితి ఎదురవడంతో చంద్రబాబులో గుబులు మొదలైంది. సజావుగా పోలింగ్‌ నిర్వహిస్తే వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమని ఆయనకు తెలుసు. అందుకే రెండో దశ విధ్వంసకాండకు పక్కా పన్నాగం పన్నారు. దాడులు, దౌర్జన్యాలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలతోపాటు సామాన్య ఓటర్లను బెంబేలెత్తించడం... తద్వారా మొత్తం పోలింగ్‌ ప్రక్రియనే హైజాక్‌ చేసేయడం... అదే అదనుగా టీడీపీకి అనుకూలంగా భారీ రిగ్గింగ్‌కు పాల్పడేందుకు పక్కాగా పన్నాగం పన్నారు.  

ఈ మొత్తం ఎన్నికల అక్రమాల బాధ్యతను డీఐజీ కోయ ప్రవీణ్‌కు అప్పగించింది ముఖ్యమంత్రి కార్యాలయం. టీడీపీ వీర విధేయ ఐపీఎస్‌గా గుర్తింపు పొందిన ఆయన రెండున్నరేళ్లుగా రాయలసీమలో దందా సాగిస్తూ బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల రిగ్గింగ్‌ బాధ్యతను కూడా ఆయన భుజానికెత్తుకున్నట్టు పోలీసువర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. డీజీపీ కార్యాలయం పర్యవేక్షణలో కడప ఎస్పీ విశ్వనాథ్, ఇతర పోలీసు అధికారులను పాత్రధారులుగా చేసుకుని కోయ ప్రవీణ్‌ పోలింగ్‌ ప్రక్రియను టీడీపీకి అనుకూలంగా హైజాక్‌ చేసేందుకు పక్కా స్కెచ్‌ వేశారు.  

యథేచ్ఛగా రిగ్గింగ్‌ స్కెచ్‌
మొత్తం వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణుల అక్రమ అరెస్టుతో టీడీపీ ఎన్నికల అక్రమాలకు మార్గం సుగమం చేయాలన్నది పోలీసు పెద్దల కుతంత్రం. ఈ క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి ముందుగా రప్పించిన టీడీపీ గూండాలను రంగంలోకి దించుతారు. ఎన్నికల నిబంధనల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు కానివారు.. పోలింగ్‌ రోజున అక్కడ ఉండ కూడదు. కానీ బీజేపీలో టీడీపీ కోవర్ట్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి మాత్రం ఈ నిబంధనలను పట్టించుకోవడమే లేదు. జమ్మలమడుగు, కమలాపురం తదితర నియోజకవర్గాల నుంచి టీడీపీ గూండాలు, కార్యకర్తలను భారీస్థాయిలో రప్పిస్తున్నారు. 

ఒక్కో పోలింగ్‌ బూత్‌కు 100 మంది చొప్పున మోహరించాలన్నది లక్ష్యం. మొత్తం 80 పోలింగ్‌ బూత్‌లను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. పోలింగ్‌కు ముందు రోజు అంటే అక్టోబరు 31 సాయంత్రానికే వారంతా పులివెందులలో తిష్ట వేస్తారు. పోలింగ్‌ రోజున అంటే నవంబరు 1న వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయగానే.. వారంతా రంగంలోకి దిగుతారు. బూత్‌లను క్యాప్చర్‌ చేయడం.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బెదిరించడం.. వైఎస్సార్‌సీపీ ఓటర్లు, తటస్థ ఓటర్లను పోలింగ్‌ బూత్‌ల వద్ద అడ్డుకోవడం.. వారు ఎవరూ ఓటు వేసేందుకు అనుమతించక పోవడం.. ఓటరు స్లిప్పులను చింపి వేయడం.. దాడులకు పాల్పడటం...తరిమి కొట్టడం.. ఇలా దేనికైనా సరే బరితెగిస్తారు. 

తటస్థ ఓటర్లను సైతం ఓటు హక్కు వినియోగించుకోనివ్వకూడదని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు టీడీపీ గూండాలే పోలింగ్‌ బూత్‌లలో దూరి టీడీపీకి అనుకూలంగా రిగ్గింగ్‌కు పాల్పడాలన్నది పన్నాగం. జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల నుంచి భారీగా మహిళలను కూడా తీసుకొచ్చి వారిని స్థానిక ఓటర్లుగా చూపిస్తూ దొంగ ఓట్లు వేయించాలన్నది టీడీపీ పన్నాగంలో ఓ కీలక అంశం.

పోలీసులతో కలిసి పక్కా కుతంత్రం  
అన్ని వార్డుల్లో బరితెగించి రిగ్గింగ్‌కు పాల్పడి టీడీపీని అడ్డదారిలో గెలిపించేందుకు ప్రభుత్వ పెద్దలు, పోలీసు బాస్‌లు పక్కా కుతంత్రానికి పదును పెడుతున్నారు. అందుకోసం ఎంతటి విధ్వంసానికైనా పాల్పడండి... ఎందరిపైనా అయినా దాడులు, దౌర్జన్యాలకు తెగబడండి...మేం అండగా ఉంటామని గూండాలు, సంఘ విద్రోహ శక్తులకు పచ్చజెండా ఊపారు. 

పులివెందులలో టీడీపీ రిగ్గింగ్‌కు సన్నద్ధమవుతున్న తీరుపై వైఎస్సార్‌సీపీ ఎన్నికల కమిషన్‌తోపాటు పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. కానీ చంద్రబాబు మాటే శిరోధార్యంగా అటు ఎన్నికల కమిషన్‌ ఇటు పోలసు యంత్రాంగం టీడీపీ రిగ్గింగ్‌కు వత్తాసు పలుకుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. పులివెందుల మున్సిపాలిటీలో అడ్డదారిలో విజయం సాధించేందుకు చంద్రబాబు బరితెగించి సాగిస్తున్న విధ్వంసకాండ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement