సంబంధం లేకున్నా మద్యం స్కాంలో ఇరికిస్తున్నారు | I have filed a complaint with Saifabad police against ED officials says Mangalampally Manikantha | Sakshi
Sakshi News home page

సంబంధం లేకున్నా మద్యం స్కాంలో ఇరికిస్తున్నారు

Oct 30 2026 4:47 AM | Updated on Oct 30 2026 4:47 AM

I have filed a complaint with Saifabad police against ED officials says Mangalampally Manikantha

నన్ను బెదిరించి కారుమూరి, సునీల్‌కుమార్‌లకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు  

ఈడీ అధికారులపై సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశా: మంగళంపల్లి మణికంఠ  

వల్లూరి సందీప్, ఈడీ, విజయవాడ సిట్‌ అధికారుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన  

సాక్షి, అమరావతి: మద్యం అక్రమ రవాణా కేసులో తనకు సంబంధం లేకపోయినా ఈడీ అధికారులు తనను బెదిరించి కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్‌కుమార్‌లకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ తీసుకున్నారని మంగళంపల్లి మణికంఠ తెలిపారు. ఆయన గురువారం మాట్లాడుతూ తనను కొట్టి బలవంతంగా స్టేట్‌మెంట్‌ తీసుకున్న ఈడీ అధికారులపై హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. సంబంధం లేని అంశంలోకి లాగి తనను ఇబ్బంది పెట్టాలని చూశారని హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేసినట్లు తెలిపారు. తనకు సంబంధం లేని కేసులో ఇరికించాలని చూడడంతో పాటు బలవంతంగా స్టేట్‌మెంట్‌ తీసుకున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. 

‘విజయవాడలో ఉండే నా వాట్సాప్‌లో ఎప్పటిదో నోటీస్‌ పెట్టి ఈడీ ఆఫీస్‌కు పిలిస్తే ఈనెల 26న వెళ్లాను. ఉదయం 11 గంటలకు వెళితే రాత్రి 10.30 దాకా అక్కడే ఉంచి విచారించారు. ఈ అంశంతో సంబంధం ఉన్న ఒకరిని సాయంత్రం 5 గంటలకు పిలిచి అతడి ముందు నన్ను ప్రశ్నించడంతో పాటు స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు.  ఈడీ అధికారులు పార్థసారథి, ప్రతీక్‌ విచారణ పేరుతో నన్ను కొట్టి, ఇబ్బందులకు గురిచేశారు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. చివరికి కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్‌కుమార్‌కు వ్యతిరేకంగా బలవంతంగా స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. చాలా ఇబ్బంది పెట్టారు. నా కుటుంబాన్ని కూడా ఈ కేసులో ఇరికిస్తామని బెదిరించారన్నారు. 

వాస్తవంగా నాకు వారి నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు. నాకు లావాదేవీలు ఉన్నది వల్లూరి సందీప్‌తోనే’ అని చెప్పారు. తనకు వల్లూరి సందీప్‌ నుంచి, ఈడీ అధికారులు, విజయవాడలోని సిట్‌ అధికారుల నుంచి ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మణికంఠ న్యాయవాది ఎం.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్‌కుమార్‌ కేసులో మణికంఠను కొట్టి స్టేట్‌మెంట్‌ తీసుకున్న అంశంపై హైకోర్టులోను, నాంపల్లి క్రిమినల్‌ కోర్టులోను రిప్రజెంట్‌ చేశామని చెప్పారు. వల్లూరి సందీప్‌తో భూలావాదేవీపై మణికంఠ సంతకాలు చేశారన్నారు. 

పవర్‌ ఆఫ్‌ అటార్నీ సంతకం చేసిన తర్వాత ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకపోవడంతో మణికంఠ ఆ భూమిని వేరేవారికి అమ్మారని చెప్పారు. అది మనసులో పెట్టుకుని మణికంఠను లిక్కర్‌ స్కామ్‌లో ఇరికించాలని నోటీసుతో ఈడీ ఆఫీస్‌కి రప్పించి, కొట్టి, బెదిరించిన వారిపై సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ ఫైల్‌ చేశామన్నారు. ఈ వ్యక్తులతో మణికంఠకు ప్రాణహాని ఉందని ఆయన చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement