వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు
తుపాను ప్రభావిత జిల్లాల పార్టీ అధ్యక్షులతో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
రైతులకు వాటిల్లిన నష్టంపై ఆరా
అండగా నిలవాలని పార్టీ నేతలు, నాయకులు, శ్రేణులకు దిశా నిర్దేశం
గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించండి
వారితో ఉన్నామనే భరోసా బాధితుల్లో కల్పించండి
తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోళ్లు జరిగేలా చూడాలని సూచన
బియ్యం సిండికేట్ దోపిడీతో కిలో రూ.90 అయింది... సీజ్ లేదు, షిప్పూ లేదు
ఆక్వా ఏరియేటర్లకు ఒక గంట పవర్ లేకపోతేనే కష్టం.. అలాంటిది రోజుల తరబడి కరెంట్ బంద్
ఆక్వాతోపాటు కొబ్బరి, అరటి రైతులకు తీవ్ర నష్టం..
గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ నిర్వీర్యం..
సాక్షి, అమరావతి: అర్నబ్ తుపాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినా వారిని ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆర్టీజీఎస్‌లో సమీక్షల పేరుతో డ్రామా చేస్తున్న సీఎం చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తూ కేవలం ఆర్భాటానికే పరిమితం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌టీజీఎస్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌తో పంట నష్టం అంచనా ఎలా సాధ్యం? అని చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు. అర్నబ్ తుపాను ప్రభావిత జిల్లాల పార్టీ అధ్యక్షులతో గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆయా జిల్లాల్లో తుపాను ప్రభావం, రైతులకు కలిగిన నష్టం... ప్రజలు, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వివరాలు తెలుసుకున్న వైఎస్ జగన్.... పార్టీ పరంగా చేపట్టాల్సిన, చేయాల్సిన వాటిపై నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలు, రైతులకు తోడుగా, అండగా నిలబడాలని, వారితో ఉన్నామన్న భరోసా కల్పించాలని సూచించారు. తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోళ్లు జరిగేలా చూడాలని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..
వ్యవస్థలన్నీ దిగజారాయి.. అంతా డ్రామా
అర్నబ్ తుపాను ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఎక్కడా నష్టం అంచనా జరగలేదు. ఎక్కడా పూర్తిగా సహాయ కార్యక్రమాలు లేవు. విద్యుత్ సరఫరా కూడా పునరుద్ధరణ కాలేదు. వలంటీర్లు లేకపోవడం వల్ల గ్రామాల్లో పరిస్థితి దారుణంగా మారింది. ఆర్బీకేలు నిర్వీర్యం. ఉచిత పంటల బీమా లేదు. దీంతో వ్యవస్థలన్నీ దిగజారిపోయాయి. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఏమంటున్నారు..? సీసీ కెమెరాల ద్వారా పంట నష్టం అంచనా చేస్తున్నారంట! ఇక్కడ ఆర్టీజీఎస్‌లో కూర్చుని మానిటర్ చేస్తే సరిపోతుందా? మరోవైపు పంట నష్టాలపై ఇష్టానుసారం లెక్కలు చెబుతున్నారు. ఒకసారి వరి 1.70 లక్షల ఎకరాల్లోనూ, ఉద్యాన పంటలు 24 వేల ఎకరాల్లోనూ నష్టపోయాయని చెబుతారు. మళ్లీ సాయంత్రానికి ఆ లెక్కలన్నీ మారిపోతున్నాయి. ఎక్కడా సీరియస్‌నెస్ లేదు.
నష్టాన్ని తక్కువగా చూపే యత్నం..
ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కోనసీమ, ఉభయ గోదావరి, అనకాపల్లి జిల్లాల్లో వరి పంట నష్టం చాలా ఎక్కువగా ఉంది. వరి ఇప్పుడు పొట్టకొచ్చింది. తుపాను వల్ల పంటలు మునిగిపోగా రైతులకు చాలా నష్టం కలుగుతోంది. ఉచిత పంటల బీమా లేక నష్టం మరింత ఎక్కువైంది. ఇంకా కొబ్బరి, అరటి.. ఆక్వాకు చాలా నష్టం కలిగింది. ఏరియేటర్లు నడవక ఆక్వా పంట దెబ్బ తింది. ఇవన్నీ కళ్లెదుటే కనిపిస్తున్నా నష్టం పెద్దగా జరగలేదని ప్రచారం చేస్తున్నారు. అసలు పట్టించుకోవడం లేదు. వరి పంటలో ఎకరాకు రూ.40 వేలు, అరటిపై ఎకరాకు రూ.2 లక్షలు, ఆక్వాలో ఎకరాకు దాదాపు రూ.45 లక్షల వరకు రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం చాలా తక్కువగా చూపే ప్రయత్నం చేస్తోంది.
రైతులను ఆదుకోని కూటమి ప్రభుత్వం
గతేడాది మొంథా తుపాను వల్ల కలిగిన నష్టానికి సంబంధించి దాదాపు రూ.600 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదు. సున్నా వడ్డీ పంట రుణాలు లేవు. ఉచిత పంటల బీమా లేదు. మొన్నటిదాకా కరువు... ఇప్పుడు తుపాను. రెండింటి వల్ల రైతులకు చాలా నష్టం కలిగింది. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అంటే 2024 జూన్ నుంచి ఒక్క రూపాయి సాయం చేయలేదు. నాడు మన ప్రభుత్వ హయాంలో ఏదైనా సీజన్‌లో పంట నష్టం జరిగితే, ఆ తర్వాత పంటకు ఉచిత విత్తనాలు ఇచ్చాం. ఇప్పుడు అది లేదు. అన్నదాతా సుఖీభవతో మూడేళ్లలో రూ.60 వేలు ఇస్తామని చెప్పి కేవలం రూ.19 వేలు ఇచ్చి, రూ.41 వేలు బకాయి పడ్డారు. ఆర్బీకేలతో పాటు ఈ–క్రాప్ నిర్వీర్యం చేశారు.
సిండికేట్‌గా మారి దోపిడీ..
మరోవైపు కేజీ బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు ఉంది. మొత్తం సిండికేట్‌గా మారి బియ్యం ఎగుమతి చేస్తున్నారు. సీజ్ ది షిప్ అన్నారు...సీజ్ లేదు. షిప్ లేదు. నాదెండ్ల మనోహర్. చినబాబుకు కమీషన్లు! వ్యాపారం చేసేది పయ్యావుల కేశవ్ తదితరులు. కృష్ణా, గోదావరి డెల్టాలో పండించిన పంటలు చేతికి రాక ఇంకా నష్టం జరుగుతోంది. దీంతో బియ్యం ధరలు ఇంకా ఎంత పెరుగుతాయో అన్న భయం అందరిలో ఉంది.
తుపాను బాధితుల చేయి పట్టుకుని నడిపించాలి మనం ప్రతి అడుగులో తుపాన్ బాధితులైన ప్రజలు, రైతులకు అండగా ఉండి చేయి పట్టుకుని నడిపించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా జోన్–1 లో ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ప్రతి చోటా మనం ప్రజలు, రైతులకు అండగా నిలబడాలి. రంగు మారిన ధాన్యం, తడిసిన ధాన్యం కొనిపించే ప్రయత్నం చేయాలి. తుపాను వస్తే ఒక్కరూ చనిపోకూడదని అంటారు. కానీ ఇక్కడ 8 మంది చనిపోయినా చంద్రబాబు మాత్రం అంతా సవ్యంగా ఉందంటాడు. ఆర్‌టీజీఎస్‌లో కూర్చుని సీసీ కెమెరాల్లో చూసి, పంట నష్టం తెలుసుకున్నా అంటాడు. మొత్తం సహాయ కార్యక్రమాలు చూశానంటాడు. ఇంత దారుణమైన పాలన గతంలో ఎక్కడా చూడలేదు. అందుకే గ్రామాల్లో రైతులు, ప్రజలకు తోడుగా, అండగా నిలవాలి. ఈ విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ చొరవ చూపాలి.
హాజరైన పార్టీ నేతలు..
వీడియో కాన్ఫరెన్స్‌లో పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం, రైతు సంక్షేమం) ఎంవీఎస్ నాగిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ లీగల్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ తూమాటి మాధవరావు తదితరులు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి హాజరు కాగా.. పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డితో పాటు పార్టీ జిల్లాల అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి (కోనసీమ), దాడిశెట్టి రాజా (కాకినాడ), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (తూర్పు గోదావరి), ముదునూరి ప్రసాదరాజు (పశ్చిమ గోదావరి), బి.ప్రసాద్ (అనకాపల్లి), పేర్ని వెంకట్రామయ్య (నాని) (కృష్ణా), మత్స్య విశ్వేశ్వరరాజు (అల్లూరి సీతారామరాజు), పరీక్షిత్‌రాజు (పార్వతీపురం మన్యం), బెల్లాన చంద్రశేఖర్ (విజయనగరం), ధర్మాన కృష్ణదాస్ (శ్రీకాకుళం), అంబటి రాంబాబు (గుంటూరు), మేరుగు నాగార్జున (బాపట్ల), దేవినేని అవినాష్ (ఎన్టీఆర్), కెకె రాజు (విశాఖ) తదితరులు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.


