సైబర్‌ మోసాల బాధితులకు పరిహారం!  | Banks Must Compensate Digital Arrest Scam Victims if Due Diligence Fails | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసాల బాధితులకు పరిహారం! 

Oct 30 2026 4:00 AM | Updated on Oct 30 2026 4:00 AM

Banks Must Compensate Digital Arrest Scam Victims if Due Diligence Fails

బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల మోసాలు జరిగితే పరిహారం చెల్లించాలి  

అది బాధితులు కోల్పోయిన మొత్తానికి తగ్గకుండా ఉండాలి  

పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేస్తే అడ్డుకొనే యంత్రాంగం ఉండాలి  

డిజిటల్‌ అరెస్ట్‌ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు, దర్యాప్తు వివరాలతో నివేదికలు సమరి్పంచండి  

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశం  

న్యూఢిల్లీ: డిజిటల్‌ మోసాల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు తగిన శ్రద్ధ వహించడంలో విఫలం కావడం వల్లే డిజిటల్‌ నేరం జరిగినట్లు దర్యాప్తులో తేలితే.. మోసపోయిన బాధితులకు వారు కోల్పోయిన కనీస మొత్తాన్ని పరిహారంగా చెల్లించేలా బ్యాంకులను జవాబుదారీగా చేయాలని పేర్కొంది. దేశంలో సైబర్‌ నేరాలు 50 శాతం తగ్గినప్పటికీ ఈ ఏడాది ఇప్పటివరకు బాధితులు రూ.800 కోట్లు నష్టపోయారని వెల్లడించింది. 

డిజిటల్‌ అరెస్టు కుంభకోణాలు, సైబర్‌ ఆధారిత ఆర్థిక నేరాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన ధర్మాసనం గురువారం సుమోటోగా విచారణ చేపట్టింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ప్రతిపాదిత నియంత్రణ చట్టంలో పరిహారం, నివారణ చర్యలు, సంస్థాగత జవాబుదారీతనానికి సంబంధించి అమలు చేయదగిన నిబంధనలను చేర్చాలని పేర్కొంది. ఈ ఆదేశాలను నవంబర్‌ 30 నాటికి నోటిఫై చేసి, డిసెంబర్‌ 31 నాటికి అమల్లోకి తీసుకురావాలని వెల్లడించింది. ప్రతిపాదిత ఆర్బీఐ నో యువర్‌ కస్టమర్‌(కేవైసీ) సవరణ ఆదేశాలను మొదట పరిశీలిస్తామని జస్టిస్‌ సూర్యకాంత్‌ చెప్పారు.  

శిక్షార్హమైన ఆదేశాలు జారీ చేస్తేనే..  
డిజిటల్‌ అరెస్ట్‌ లేదా సైబర్‌ మోసాల వల్ల నష్టపోయిన బాధితులకు సదరు బ్యాంకులు తగిన పరిహారం చెల్లించేలా నిబంధనలు ఉండాలని ధర్మాసనం తేల్చిచెప్పింది. బ్యాంకుల నిర్లక్ష్యం వల్లనే డిజిటల్‌ నేరం జరిగినట్లు తేలితే.. అప్పుడు బాధితులకు చెల్లించే పరిహారం వారు కోల్పోయిన మొత్తానికి తగ్గకుండా ఉండాలని ఉత్తర్వులో స్పష్టంచేసింది. బ్యాంకులకు స్పష్టమైన బాధ్యతలను నిర్దేశించాలని, నిబంధనలను పాటించని పక్షంలో తగిన చర్యలు తీసుకొనేలా చూడాలని ధర్మాసనం వెల్లడించింది. బ్యాంకులకు శిక్షార్హమైన ఆదేశాలు జారీ చేస్తే తప్ప, అవి తమ పద్ధతులను ఎన్నటికీ మార్చుకోవు అని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. ఖాతాదారుని నిర్ధారిత లావాదేవీల చరిత్రకు విరుద్ధంగా ఉన్న లావాదేవీలను బ్యాంకులు తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పారు. 

బ్యాంకులు ‘రక్షణ గొడుగులు’ 
డిజిటల్‌ అరెస్టుల వల్ల ప్రజలు భారీగా నష్టపోతున్నారని, అయినప్పటికీ మనం ఇంకా బలమైన చర్యలు తీసుకోలేకపోతున్నామని జస్టిస్‌ సూర్యకాంత్‌ వెల్లడించారు. ఒక ఖాతాదారుడు తన సాధారణ బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు విరుద్ధంగా పెద్ద మొత్తాన్ని అకస్మాత్తుగా బదిలీ చేయడానికి ప్రయత్నించినప్పుడు బ్యాంకులు ఎందుకు జోక్యం చేసుకోలేకపోయాయని సీజేఐ ప్రశ్నించారు. వినియోగదారులకు బ్యాంకులు ‘రక్షణ గొడుగులు’గా అభివరి్ణంచారు. 

బ్యాంకుల వద్ద ఖాతాదారుల సమాచారం ఉంటుందని, ఖాతా నుంచి డబ్బు బయటకు వెళ్లేలోపే మోసాన్ని నివారించడానికి ఆ సమాచారాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు. కోట్ల రూపాయల లావాదేవీలు ఉండే వాణిజ్య ఖాతాలకు, సాధారణ వ్యక్తిగత ఖాతాలకు మధ్య వ్యత్యాసం ఉంటుందని గుర్తుచేశారు. ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఆర్టీజీఎస్‌ ద్వారా పెద్ద మొత్తాన్ని బదిలీ చేయాలని ప్రయతి్నస్తే, దాన్ని అడ్డుకొనే యంత్రాంగం ఉండాలని పేర్కొన్నారు. 

ఆర్థిక సంస్థలు ఖాతాలను వాటి స్వభావం, లావాదేవీల సరళి ప్రకారం వర్గీకరించవచ్చని, అలాగే డిజిటల్‌ మోసాలను గుర్తించడానికి కృత్రిమ మేధ(ఏఐ) సహా సాంకేతికతను ఉపయోగించుకోవచ్చని సూచించారు. బ్యాంకులు జవాబుదారీతనం పాటించడం, సైబర్‌ నేరాల ద్వారా వచ్చిన సొమ్మును స్వీకరించడానికి లేదా బదిలీ చేయడానికి మ్యూల్‌ ఖాతాలను ఉపయోగించడం అనే రెండు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీజేఐ పేర్కొన్నారు. డిజిటల్‌ అరెస్ట్‌ కేసుల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, వాటి ఆధారంగా జరిగిన దర్యాప్తుల వివరాలతో కూడిన నివేదికలను సమరి్పంచాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట అమలు సంస్థలను ఆదేశించారు.

మొబైల్‌ ఫోన్‌ను గోడకు కొడితే..  
దేశంలో డిజిటల్‌ అరెస్టులు పెరిగిపోతుండడంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై అవగాహన కార్యక్రమాలు, వార్తా కథనాలు, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ విద్యావంతులు సైతం డిజిటల్‌ అరెస్టుల బారిన పడుతుండటం విచారకరమని పేర్కొంది. మొబైల్‌ ఫోన్‌ను గోడకు కొడితే డిజిటల్‌ అరెస్టు అనేది ఆగిపోతుందని తేల్చిచెప్పింది. మనుషుల్లో ఏదో లోపం ఉందని, వాళ్లలో ఏముందో దేవుడికే తెలియాలని వ్యాఖ్యానించింది. ప్రజా స్వామ్య దేశంలో మొబైల్‌ కారణంగా అరెస్టు అవుతామని భావిస్తున్నారంటే వారి గురించి ఏమనుకోవాలని ప్రశ్నించింది. డిజిటల్‌ అరెస్టులను అరికట్టడానికి ఎంతో కృషి జరుగుతున్నప్పటికీ, ఈ సమస్య కొనసాగుతూనే ఉందని ఈ కేసులో అమికస్‌ క్యూరీ అయిన సీనియర్‌ న్యాయవాది ఎన్‌.ఎస్‌.నప్పినై ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement