మహారాష్ట్రలో సీఎం మార్పు తప్పదా.. తెరపైకి ఏక్‌నాథ్ షిండే పేరు?! | Mahayuti Rift Explodes After MLC Poll Setback: Shiv Sena Demands Shinde for CM Again | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో సీఎం మార్పు తప్పదా.. తెరపైకి ఏక్‌నాథ్ షిండే పేరు?!

Oct 29 2026 10:02 PM | Updated on Oct 29 2026 10:05 PM

Mahayuti Rift Explodes After MLC Poll Setback: Shiv Sena Demands Shinde for CM Again

ముంబై: మహరాష్ట రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఏక్‌నాథ్‌ షిండేని మహరాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార ‘మహాయుతి కూటమి’లో చిచ్చు రాజేసినట్లు తెలుస్తోంది.  

అక్టోబర్ 23న ఐదు పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగగా, ఫలితాలు అధికార కూటమికి షాక్ ఇచ్చాయి. విపక్ష ‘మహా వికాస్ అఘాడి’ కూటమి ఏకంగా మూడు స్థానాలను కైవసం చేసుకోగా అధికార మహాయుతి కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఓటమే అధికార కూటమిలో తప్పు ఎవరిదనేదానిపై బహిరంగ వాదనలకు దారితీసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై శివసేన నాయకుడు రవీంద్ర ధంగేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, దాని ఇమేజ్ గురించిన సందేహాల వల్లే ఈ ఫలితాలు వచ్చాయని ఆయన మండిపడ్డారు. ‘గతంలో ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మహాయుతి అధికారంలోకి వచ్చింది. కాబట్టి, ఏక్‌నాథ్ షిండేనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి’ అని సంచలన డిమాండ్ చేశారు. అంతేకాదు తామేమి బీజేపీకి బానిసలం కాదని, కూటమిలో పరస్పర గౌరవం ఉండాలని ఆయన హితవు పలికారు.

శివసేన మంత్రి అబ్దుల్ సత్తార్ స్పందిస్తూ.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాల ప్రశంసలు అందుకున్న షిండే నాయకత్వమే మహాయుతికి శ్రీరామరక్ష అని, ఆయన మళ్లీ సీఎం కావాలని తామంతా కోరుకుంటున్నట్లు చెప్పారు.

శివసేన నేతల డిమాండ్లను, వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. శివసేన నేతలకు సీఎం మార్పు గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేసింది. సీనియర్ బీజేపీ నేత, మంత్రి చంద్రశేఖర్ బావన్‌కులే మాట్లాడుతూ..2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 149 స్థానాలకు గాను, బీజేపీ 137 స్థానాల్లో విజయం సాధించింది’ అని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదనే కారణం చూపుతూ ముఖ్యమంత్రిని మార్చాలనే డిమాండ్‌ సరికాదన్నారు.  

ఎమ్మెల్సీ ప్రవీణ్ దారేకర్ సైతం ధాంగేకర్‌పై విమర్శలు గుప్పించారు. తన పరిధిలో తాను ఉండాలని సూచించారు. ఫడ్నవీస్ నాయకత్వంలో రాష్ట్రం అపూర్వమైన రీతిలో పురోగమిస్తోంది. ఆయనకు ఫడ్నవీస్ అంటే ఎంత ద్వేషం ఉందంటే విమర్శించే అవకాశం దొరికినప్పుడల్లా ఈ అవకాశాన్ని వదులుకోరు’అని ఎద్దేవా చేశారు.  

మహాయుతిలోని శకుని మామలను గుర్తించాలి 
ఇదిలా ఉంటే మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అధికార మహాయుతి కూటమిలో ఉన్న శకుని మామలను గుర్తించాలని బీజేపీ నాయకుడు, మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే పిలుపునిచ్చారు. ఉద్ధవ్ థాక్రేకు నచ్చే విధంగా వ్యవహరిస్తున్న శకుని మామలు ఎవరైనా మహాయుతిలో ఉన్నారేమో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని అప్రమత్తం చేశారు. అధికార కూటమి ఆశించిన విజయాన్ని సాధించ లేకపోయినప్పటికీ, గత ఎన్నికల్లో పోటీ చేయని నియోజకవర్గాల్లో కూడా బీజేపీ రెండు స్థానాలను గెలుచుకుందని రాణే పేర్కొన్నారు.

మొత్తానికి, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర అధికార కూటమిలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలను బట్టబయలు చేశాయి. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు మహాయుతిలో ఎలాంటి రాజకీయ మలుపులకు దారితీస్తాయో వేచి చూడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement