ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయే హవా! | BJP-led NDA wins big in 4-state MLC polls | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయే హవా!

Oct 29 2026 5:36 AM | Updated on Oct 29 2026 6:27 AM

BJP-led NDA wins big in 4-state MLC polls

నాలుగు రాష్ట్రాల్లో 28 స్థానాలకు గాను 16 సీట్లు కైవసం  

మరో స్థానంలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు  

కాంగ్రెస్‌కు గుండు సున్నా  

బిహార్‌లో ఖాతా తెరిచిన జన సురాజ్‌ పార్టీ  

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి ఐదు స్థానాలు  

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) విజేతగా నిలిచింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. ఉత్తరప్రదేశ్‌లో ఆరు ఉపాధ్యాయ, ఐదు పట్టభద్రుల నియోజకవర్గాలకు, బిహార్‌లో నాలుగు ఉపాధ్యాయ, నాలుగు పట్టభద్రుల నియోజకవర్గాలకు, కర్ణాటకలో రెండు ఉపాధ్యాయ, రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు, మహారాష్ట్రలో మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు అక్టోబర్‌ 23న ఎన్నికలు జరిగాయి. 

నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 28 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, బుధవారం 27 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ, దాని మిత్రపక్షాలు 16 సీట్లు దక్కించుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఆరు, సమాజ్‌వాదీ పార్టీ ఐదు సీట్లు గెలుచుకున్నాయి. మహారాష్ట్రలో నాగపూర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి రెండు స్థానాలు, విపక్ష ఎన్సీపీ(శరద్‌ పవార్‌) రెండు స్థానాలు కైవసం చేసుకున్నాయి. 

బిహార్‌లో బీజేపీ మూడు, జేడీ(యూ) ఒకటి, ఆర్జేడీ ఒక సీటు దక్కించుకున్నాయి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు సైతం విజయం సాధించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సారథ్యంలోని జన సురాజ్‌ పార్టీ ఖాతా తెరిచింది. ఒక స్థానం దక్కించుకుంది. కర్ణాటకలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగ్గా, అధికార కాంగ్రెస్‌ కనీసం ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. ఇక్కడ బీజేపీ మూడు, జేడీఎస్‌ ఒక స్థానంలో జెండా ఎగురవేశాయి. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌ ప్రక్రియ కోసం బ్యాలెట్‌ పత్రాలను ఉపయోగించారు. యూపీ, గుజరాత్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్, హిమాచల్‌ ప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బీజేపీలో నూతన ఉత్సాహాన్ని నింపాయి. ఎన్డీయేకు మరింత ఊపునిచ్చాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement