సాక్షి,హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరానికి సమయం సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ స్థానానికి సామ రామ్మోహన్‌రెడ్డిని, వరంగల్–నల్గొండ–ఖమ్మం అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తం రెడ్డిని ఖరారు చేసింది. కాంగ్రెస్ ఆనవాయితీకి భిన్నంగా ఈసారి అందరికంటే ఎంతో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించగా, ఈ ఎన్నికల్లో సత్తా చూపుతామంటున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థుల ఎంపికపై స్పష్టత ఇవ్వకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. ఎలాంటి లీకులు కూడా ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అధిష్టానం దృష్టిలో..?
బీఆర్‌ఎస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సీటుపై పార్టీ సామాజిక సమీకరణాల తర్జనభర్జనలో ఉంది. కాంగ్రెస్ రెండు గ్రాడ్యుయేట్ సీట్లకూ రెడ్డి (ఓసీ) సామాజికవర్గానికి చెందిన నేతలకే అవకాశమివ్వడంతో, దీనిని ప్రధాన ఆయుధంగా మలుచుకోవాలనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ స్థానాన్ని బీసీ వర్గాలకు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. అధిక సంఖ్యలో ఉన్న బీసీ ఓటర్లను ఆకట్టుకోవడానికి బలమైన ఆ వర్గం నాయకుడిని లేదా బీఆర్‌ఎస్ యువజన/విద్యార్థి విభాగం (గ్రేటర్ హైదరాబాద్) నాయకులను బరిలోకి దించాలనే ఆలోచనలో కేసీఆర్, కేటీఆర్ ఉన్నారనే ప్రచారం కూడా మొదలైంది. మరోవైపు, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఈ స్థానంపై కన్నేసి తమ ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. వీరితోపాటు నగర విద్యావంతులను ప్రభావితం చేయగల విద్యావేత్తలు, కార్పొరేట్ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తల పేర్లు కూడా చర్చల్లో ఉన్నాయి.
వ్యూహాత్మకమా..?
ఓటర్ల జాబితా పూర్తయ్యాకే అభ్యరి్థని ప్రకటిస్తారని చెబుతున్న వారితో పాటు.. కాంగ్రెస్ ఈ సీటును ఓసీలకిచి్చనందున తాముకూడా ఓసీకే ఇచ్చి ఎదుర్కోవాలా? లేక బీసీని బరిలో దింపి కాంగ్రెస్‌కు బీసీలంటే చిన్నచూపనే ప్రచారంతో నెగ్గాలా? అనే మీమాంసలో బీఆర్‌ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఇప్పటికే ప్రచారం దిశగా అడుగులు వేస్తుండగా, బీఆర్‌ఎస్ ఆశావహులు మాత్రం అయోమయంలో ఉన్నారు. బీజేపీ కూడా గట్టి పట్టుదలతో ఉన్నందున త్రిముఖ పోటీ అనివార్యమైనందున నగర పట్ట భద్రులను ఆకట్టుకునేందుకు బీఆర్‌ఎస్ ఏదైనా ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకోవచ్చని అంటున్న వారూ ఉన్నారు. గత ఎన్నికల్లో వాణీదేవిని ఎంపిక చేయడాన్ని ప్రస్తావిస్తున్నారు.
రేసులో వీరు
ఏదేమైనా కొన్ని పేర్లు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. వారిలో కాసాని వీరేశ్, నాగేందర్‌గౌడ్, కాసాని వీరేశం, రవియాదవ్‌లతో పాటు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు వీరిలో ఉన్నారు. బీజేపీ కూడా దాదాపుగా అగ్ర కులాల అభ్యరి్థనే బరిలో దించుతుందనే ప్రచారం నేపథ్యంలో బీఆర్‌ఎస్ బలహీనవర్గాల అభ్యరి్థని పోటీలో దింపడం ద్వారా సామాజిక సమీకరణలను అనుకూలంగా మలుచుకోవాలని యోచిస్తోంది. ఈ క్రమంలో బీసీలవైపే గులాబీ మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు
చెబుతున్నాయి.


