57 రోజుల పోరాటం.. అమెరికాలో నల్గొండ యువతి మృతి | 26 Year Old Indian Woman from Nalgonda Passes Away | Sakshi
Sakshi News home page

57 రోజుల పోరాటం.. అమెరికాలో నల్గొండ యువతి మృతి

Oct 3 2026 7:40 AM | Updated on Oct 3 2026 7:43 AM

26 Year Old Indian Woman from Nalgonda Passes Away

నల్లగొండ: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన వేములపల్లి మండలానికి చెందిన యువతి క్యాన్సర్‌ బారిన పడి మృతి చెందింది. ఉన్నత చదువులు పూర్తిచేసి తమకు అండగా నిలుస్తుందనుకున్న కూతురు హఠాన్మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన కందిమళ్ల లక్ష్మారెడ్డి గతంలో సల్కునూరు పీఏసీఎస్‌ చైర్మన్‌గా, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 

పిల్లల చదువుల కోసం పదేళ్ల క్రితం లక్ష్మారెడ్డి, పద్మ దంపతులు హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా.. పెద్ద కుమార్తె మాలతి బీటెక్‌ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండగానే వివాహం చేశారు. చిన్న కుమార్తె మాన్వితరెడ్డి(25) 2023లో బీఫార్మసీ పూర్తి చేసింది. అనంతరం ఆమె కోరిక మేరకు ఉన్నత విద్య కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అమెరికాకు పంపించారు. అక్కడ ఎంఎస్‌ పూర్తిచేసుకున్న మాన్విత.. హెచ్‌1–బీ వీసా పొంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది.

నెల రోజులుగా ఆస్పత్రిలో పోరాటం..
సెప్టెంబర్‌ 4న మాన్విత అకస్మాత్తుగా గొంతు నొప్పితో అనారోగ్యానికి గురికాగా.. స్నేహితులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు క్యాన్సర్‌ స్టేజ్‌–4గా నిర్ధారించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం సెప్టెంబర్‌ 13న ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. చేతికొచ్చిన కూతురు మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

రేపు హైదరాబాద్‌కు మృతదేహం..
మాన్వితరెడ్డి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు కృషి చేస్తున్నట్లు తెలిసింది. ఆదివారం నాటికి మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంటుందని బంధువులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement