ఒకే గర్భిణి.. రెండు ఆస్పత్రుల్లో ప్రసవం | Khammam Pregnant Woman Incident | Sakshi
Sakshi News home page

ఒకే గర్భిణి.. రెండు ఆస్పత్రుల్లో ప్రసవం

Oct 3 2026 7:18 AM | Updated on Oct 3 2026 7:19 AM

Khammam Pregnant Woman Incident

నిండు గర్భిణిని ప్రసవానికి ఒక ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఒక బిడ్డకు జన్మనివ్వగానే పరిస్థితి విషమించడంతో మరో ఆస్పత్రికి తరలించగా ఇంకో శిశువుకు జన్మనిచ్చింది. గంటన్నర వ్యవధిలో వేర్వేరు ఆస్పత్రుల్లో కవలలకు జన్మనివ్వగా.. రెండు ఆస్పత్రుల వైద్యులు సమన్వయంతో వ్యవహరించగా తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరుకు చెందిన గుత్తికోయ మహిళ భీమమ్మకు పురిటినొప్పులు రావడంతో గురువారం రాత్రి 10 గంటలకు మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, ఆమె గర్భం దాల్చినప్పటి నుంచి వైద్య పరీక్షలు చేయించుకోలేదు. 

దీంతో వైద్యులు పరీక్షించగా హిమోగ్లోబిన్‌ లోపించడమే కాక తీవ్ర రక్తహీనత, రక్తపోటు ఉండడంతో చికిత్స ప్రారంభించగా రాత్రి 11 గంటలకు 1.6 కిలోల బరువుతో మగబిడ్డ సాధారణ ప్రసవంలో జన్మించాడు. ఆమె కడుపులో ఇంకో బిడ్డ ఉండడంతో అరగంట పర్యవేక్షించినా ఫలితం లేక శస్త్రచికిత్స అవసరం కావడం, ఆస్పత్రిలో ఆమెకు అవసరమైన బీ–పాజిటివ్‌ రక్తం పూర్తిగా లేక భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముందస్తు సమాచారంతో భద్రాచలం వైద్యులు సిద్ధమై గురువారం అర్ధరాత్రి దాటాక 12.30 గంటలకు శస్త్రచికిత్స చేయగా 2.2 కిలోల బరువుతో ఆడబిడ్డ జన్మించింది. 

ఇలా తొలి బిడ్డ పుట్టాక పరిస్థితి క్లిష్టంగా మారడంతో మణుగూరు వైద్యులు సకాలంలో భద్రాచలం పంపించడం, ఈ ఆస్పత్రి వైద్యులు సమయానికి శస్త్రచికిత్స చేయడంతో ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. కాగా, మణుగూరు, భద్రాచలం ఆస్పత్రుల్లో వైద్యులు శ్రీనిధి, వంశీ, సుప్రియ, పూజ, మల్లేష్‌  డాక్టర్‌ విజయరావు, సాయికిషోర్‌ చికిత్సలో పాలుపంచుకోగా, పాల్గొన్న సిబ్బంది ఇందిర, ఆదిలక్ష్మి, స్రవంతి, లలిత, శైలజ, ఖాజా, శివ తదితరులను భద్రాద్రి జిల్లా డీసీహెచ్‌ఎస్‌ జి.రవిబాబు అభినందించారు.

భద్రాచలం అర్బన్‌/మణుగూరు రూరల్‌: 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement