అంతర్జాతీయ లాజిస్టిక్స్ సంస్థ ఫెడ్‌ఎక్స్ హైదరాబాద్‌లో తన కార్యాలయ కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. నగరంలోని ఫీనిక్స్ సెంటారస్ వాణిజ్య సముదాయంలో మరో 1.19 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది. దీంతో ఈ భవనంలో సంస్థ మొత్తం కార్యాలయ విస్తీర్ణం సుమారు 3.70 లక్షల చదరపు అడుగులకు చేరింది.
ఈ లావాదేవీలో భాగంగా భవన యజమాని ఎథీనా గ్లోబల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌తో ఫెడ్‌ఎక్స్ ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ సప్లై చైన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. చదరపు అడుగుకు నెలకు రూ.78 అద్దె చొప్పున ఈ లీజు ఖరారైంది. దీని ప్రకారం నెలవారీ అద్దె సుమారు రూ.93.2 లక్షలుగా ఉండనుంది. ఐదేళ్ల లీజు కాలంలో మొత్తం అద్దె చెల్లింపులు సుమారు రూ.55.6 కోట్లకు చేరనున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఫెడ్‌ఎక్స్ రూ.8.39 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. ప్రతి మూడేళ్లకు అద్దెలో 15 శాతం పెంపు నిబంధనను కూడా ఒప్పందంలో చేర్చారు.
ప్రాప్‌స్టాక్ వివరాల ప్రకారం, ఫీనిక్స్ సెంటారస్‌లో ఫెడ్‌ఎక్స్ గతంలోనూ పలుమార్లు కార్యాలయ స్థలాలను లీజుకు తీసుకుంది. 2025 జూలైలో 16వ అంతస్తులో 1.25 లక్షల చదరపు అడుగులను చదరపు అడుగుకు నెలకు రూ.58 అద్దెతో లీజుకు తీసుకుంది. అంతకుముందు, 2024 జూన్‌లో ఐదో అంతస్తులో 69,871 చదరపు అడుగులను నెలకు చదరపు అడుగుకు రూ.62 అద్దెతో లీజుకు తీసుకుంది. 2023 అక్టోబర్‌లోనూ ఇదే అంతస్తులో 55,538 చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అదే అద్దె రేటుతో లీజుకు తీసుకుంది.
తాజా లావాదేవీతో ఫీనిక్స్ సెంటారస్‌లో ఫెడ్‌ఎక్స్ కార్యాలయ విస్తీర్ణం మరింత పెరిగింది. హైదరాబాద్ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయ కార్యకలాపాలను విస్తరిస్తున్న తీరుకు ఈ ఒప్పందం మరో ఉదాహరణగా నిలుస్తోంది.


