కోల్‌కతా అక్రమ ఆయుధాల ముఠాతో మల్లేశ్ డీల్
ఆర్మీ అధికారులపై కోపంతో పాటు ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు చోరీ
బీర్బల్ షా, అవల్ దేయ్‌ల కోసం పోలీసుల గాలింపు
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు ఉప్పుతోళ్ల మల్లేశ్‌ను 10 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. రాష్ట్రానికి చెందిన మల్లేశ్‌కు 2022లో కోల్‌కతాలో బ్యారక్‌పూర్ కంటోన్మెంట్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో యూనిట్ సమీపంలోని స్థానిక దుకాణదారుడు బీర్బల్ షాతో పరిచయం ఏర్పడింది. ఈ బీర్బల్ అక్రమంగా తుపాకులు విక్రయించే అవల్ దెయ్ అలియాస్ ఓబీ అనే వ్యక్తిని మల్లేశ్‌కు పరిచయం చేశాడు.
అయితే ముందునుంచీ నేర ప్రవృత్తి ఉన్న మల్లేశ్.. తుపాకీతో అమాయకులను బెదిరించి దారి దోపిడీలు చేయాలని భావించాడు. ఈ క్రమంలో ఓబీ నుంచి రూ.10 వేలకు ఓ తుపాకీని కొనుగోలు చేశాడు. అయితే క్రమశిక్షణారాహిత్యం కారణంగా మల్లేశ్‌ను ఆర్మీ ఉన్నతాధికారులు కోల్‌కతా నుంచి హైదరాబాద్‌లోని మద్రాస్ రెజిమెంట్‌కు బదిలీ చేశారు. దీంతో మల్లేశ్‌కు కొనుగోలు చేసిన తుపాకీని తన స్వగ్రామంలో దాచిపెట్టేశాడు.
చోరీ చేసిన ఆయుధాలు అమ్మేందుకు ఒప్పందం
మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాలు చోరీ చేసిన తర్వాత మల్లేశ్.. కోల్‌కతాలో ఉన్న బీర్బల్ షాను సంప్రదించాడు. ఇతని ద్వారా ఓబీకి చోరీ చేసిన ఆయుధాలు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. నాలుగు ఏకే–47లకు రూ.5 లక్షలు, పిస్టళ్లకు రూ.3 లక్షలు ఇచ్చేలా డీల్ కుదిరింది. మల్లేశ్ పలుమార్లు వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా ఆయుధాలు, తూటాలను చూపించి ఒప్పందం ఖరారు చేసుకున్నాడు. అయితే మల్లేశ్‌ను పోలీసులు పట్టుకోవడంతో డీల్‌కు బ్రేక్ పడింది. మరోవైపు బీర్బల్ షా, ఓబీ కోసం పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. బీర్బల్ షా బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు వచి్చనట్లు పోలీసులు గుర్తించారు.
ఆయుధాలు విక్రయించి సొమ్ము చేసుకోవాలని..
కోల్‌కతా నుంచి బొల్లారం ఆర్మీ క్యాంపస్‌కు బదిలీ అయ్యాక మల్లేశ్ తన కుటుంబంతో కలిసి యాప్రాల్‌లో అద్దె ఇంట్లో నివసించాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయన్న అంచనాతో అప్పులు చేసి నాగర్‌కర్నూల్‌లో తనకు ఉన్న ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణం మొదలుపెట్టాడు. అయితే క్రమశిక్షణారాహిత్యం కారణంగా ఆర్మీ ఉన్నతాధికారులు మల్లేశ్‌ను మరో మూడేళ్ల సర్వీస్ ఉండగానే ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. మరోవైపు ఇంటి నిర్మాణం సగంలోనే ఆగిపోయింది. దీంతో ఆర్మీ ఉన్నతాధికారులపై ఆగ్రహం పెంచుకున్న మల్లేశ్ వారిపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు తనకు రావాల్సిన సొమ్మును ఆయుధాలను చోరీ చేసి విక్రయించడం ద్వారా భర్తీ చేసుకోవాలని భావించాడు.
ఈ క్రమంలోనే ఆర్మీ ఆయుధాల చోరీకి పథకం వేశాడు. తొలుత తన చిన్ననాటి స్నేహితులైన నిరంజన్, మల్లికార్జున్‌లతో కలిసి చోరీకి ప్లాన్ చేశాడు. బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దొంగతనాలకు సంబంధించిన వెబ్ సిరీస్‌లు, వీడియోలు చూసి వాటిని స్నేహితులకు పంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే అకస్మాత్తుగా నిరంజన్, మల్లిఖార్జున్‌లు చోరీకి అంగీకరించకపోవడంతో మద్రాస్ రెజిమెంట్‌లోనే పని చేస్తున్న శేషు, ప్రవీణ్‌లను సంప్రదించాడు. అక్కడే పనిచేస్తున్న వినోద్‌ను కూడా చోరీకి సహకరించాలని కోరాడు.
ఇందుకోసం శేషు ద్వారా వినోద్‌కు అడ్వాన్స్‌గా రూ.లక్ష ఇచ్చాడు. చోరీకి వారం రోజుల ముందే వినోద్ సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశాడు. చోరీ జరిగిన రోజు కెమెరాలపై మల్లేశ్ తెల్లటి ఫోమ్‌ను చల్లాడు. ప్రవీణ్, శేషులు వీధిదీపాలు ఆరి్పవేశారు. మల్లేశ్ ఆయుధాలు తరలిస్తున్న సమయంలో అక్కడున్న ఇతర జవాన్లను శేషు, ప్రవీణ్‌లు మాటలతో మభ్యపెట్టి డైవర్ట్ చేశారు. చోరీ తర్వాత మల్లేశ్ ఆయుధాలు, మందుగుండు సామగ్రి నాగర్‌కర్నూల్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి దాచిపెట్టాడు.


