ప్రణాళిక దశలోనే 350 కి.మీ. వేగానికి ఆటంకం
భారీ వ్యయం దృష్ట్యా జపాన్ రైళ్లకు దూరం
సొంత రైలు తయారీకి కేంద్రం నిర్ణయం
భారత్ రైళ్ల ఆపరేషనల్ స్పీడ్ 250 కి.మీ. మాత్రమే
రెండు గంటల్లో ముంబై, చెన్నై, బెంగళూరు ఇప్పట్లో అసాధ్యం!
సాక్షి, హైదరాబాద్: భారత్ త్వరలో బుల్లెట్ రైలు వసతి ఉన్న దేశాల జాబితాలో చేరనుంది. దేశంలో తొలి బుల్లెట్ రైలు కారిడార్ అహ్మదాబాద్–ముంబై మధ్య వేగంగా సిద్ధమవుతోంది. 95 కి.మీ. నిడివి కలిగిన ఈ కారిడార్‌లో సరిగ్గా మరో పది నెలల్లో బుల్లెట్ రైలు పరుగులెట్టనుంది. అయితే బుల్లెట్ రైళ్లు గంటకు 350 కి.మీ. వేగంతో దూసుకెళతాయని, ప్రతిపాదిత కారిడార్లు సిద్ధమైతే హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలకు కేవలం రెండు గంటల్లోనే చేరుకోవచ్చని అంటున్నా..ప్రస్తుత వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
త్వరలో పట్టాలెక్కనున్న బుల్లెట్ రైలు గంటకు 250 కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణించనుంది. దీంతో అటు బుల్లెట్ రైలుకు తక్కువ...ఇటు వందే భారత్‌కు ఎక్కువ అన్న తరహాలో ‘భారత్ బుల్లెట్’పట్టాలెక్కబోతోంది. హైదరాబాద్‌కు మంజూరైన కారిడార్లు సిద్ధమయ్యేందుకు మరో పదేళ్ల సమయం పట్టనుంది. అప్పటి పరిస్థితిని అంచనా వేయటం ఇప్పుడే సాధ్యం కాదు, కానీ 2032 వరకు మాత్రం మన బుల్లెట్ రైలు వేగం 250 కిలోమీటర్లేనని అంటున్నారు.
జపాన్ రైళ్లు వద్దనుకోవడంతో..
దేశంలో బుల్లెట్ రైళ్ల యుగం మొదలవుతున్న వేళ.. ‘దేశీ’హైస్పీడ్ రైలు ప్రాజెక్టును కేంద్రం స్లో అండ్ స్టడీ సూత్రంతో ప్రారంభిస్తోంది. తొలుత 350 కి.మీ. వేగంతో దూసుకెళ్లే రైళ్లను పట్టాలెక్కించాలని భావించినా, పరిస్థితులు కళ్లెం వేశాయి. భారీ వ్యయంతో కూడిన జపాన్ రైళ్లకు బదులు సొంతంగా బుల్లెట్ రైళ్లను తయారు చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో తొలి హైస్పీడ్ రైలు ప్రాజెక్టు అయిన ముంబై–అహ్మదాబాద్ కారిడార్ నిర్మాణంలో జపాన్ సాంకేతిక సహాయం అందిస్తోంది.
ఈ కారిడార్‌తో పాటు దేశంలోని మిగతా ప్రాంతాల్లో చేపట్టబోయే కారిడార్లలో జపాన్ రైళ్లను నడపాలని, ఈ మేరకు రైళ్లను కొనుగోలు చేయాలని కేంద్రం తొలుత భావించింది. మనకు సరఫరా చేసేందుకు ఆ దేశం ప్రత్యేకంగా షింకన్సెన్–ఈ 10 రైళ్లను తయారీ చేయనున్నట్టు ప్రకటించింది. దీని గరిష్ట వేగం గంటకు 350 కి.మీ.లు కాగా ఆపరేషనల్ వేగం 320 కి.మీ.గా ఉంటుందని పేర్కొంది. అయితే మనం ఒక్కో రైలు సెట్‌ను కొనాలంటే దాదాపు రూ.750 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు దేశంలో వందేభారత్ రైళ్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. దీంతో కేంద్రం మనసు మార్చుకుంది.
వందేభారత్ ఇచ్చిన నమ్మకంతో..
వందేభారత్ పనితీరు ఇచ్చిన నమ్మకంతో సొంతంగా బుల్లెట్ రైళ్ల తయారీ ఆలోచనకొచ్చింది. చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, బెంగుళూరు భారత్ ఎర్త్ మూవర్స్ లిమెటెడ్‌లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును తీసుకున్నాయి. ఇటీవలే రైలు డిజైన్‌కు ఆమోదం రాగా, వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో తొలి ప్రొటోటైప్ రైలు సిద్ధమై ట్రయల్స్ ప్రారంభించనుంది.
ఈ రైలు తయారీకి ఒక్కో సెట్‌కు రూ.435 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ రైలు గరిష్ట వేగం 280 కి.మీ. కాగా ఆపరేషనల్ స్పీడ్ 250 కి.మీ.గా తేలింది. తదుపరి ఐదారేళ్ల పాటు ఈ రైళ్లే సేవలందించే అవకాశం ఉంది. ఆ తర్వాత 350 కి.మీ. వేగంతో దూసుకెళ్లే బీ35 రకం రైళ్లను కూడా తయారు చేయాలన్నది ఆలోచన. వందేభారత్ విషయంలో మన ప్రయోగం విజయవంతమైనా, అనుకున్న గడువులోపు తయారు చేయటంలో మాత్రం విఫలమయ్యాం. ఇదే పరిస్థితి బుల్లెట్ రైళ్ల విషయంలోనూ జరిగితే, మరికొన్నేళ్లపాటు 250 కి.మీ. వేగంతో ప్రయాణం చేయాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భారత్ రైలుతో పెరగనున్న ప్రయాణ సమయం
హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్–ముంబై వయా పుణె, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై కారిడార్లు సిద్ధం కావాల్సి ఉంది. ఈ పనుల్లో వేగం అనుకున్నదానికంటే ఎక్కువగా ఉంటే ప్రాజెక్టులు తొందరగానే సిద్ధమవుతాయి. అదే సమయంలో రైళ్ల తయారీ వేగంగా జరగకుంటే, మన కారిడార్లలో కూడా 250 కి.మీ. రైళ్లే పరుగుపెడతాయి. జపాన్ రైళ్లు వస్తాయన్న అంచనాతో ఇప్పటికే ప్రకటించిన ప్రయాణ సమయాలను బేరీజు వేసుకుంటే, హైదరాబాద్–ముంబై సమయం 2.40 గంటలు కాగా భారత్ రైలుతో అది 3.25 గంటలు కానుంది. హైదరాబాద్– బెంగుళూరుకు జపాన్ రైలు ప్రకారం 2 గంటలు అయితే భారత్ రైలు ప్రకారం 2.45 గంటలుగా అవుతుంది. చెన్నై విషయంలో అది 2.15 గంటల నుంచి 2.55 గంటలకు పెరగనుంది. అయితే కారిడార్లు సిద్ధమవటానికి ఇంకా చాలా ఏళ్ల సమయం పట్టనున్నందున ఈ విషయంలో స్పష్టత రావటానికి సమయం పట్టనుంది.


