విద్యుత్, ఇతరత్రా ప్రోత్సాహకాల కల్పనలో భేష్
తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్
2032 నాటికి 26.3 గిగావాట్లకు సామర్థ్యం..
ఎస్ అండ్ పీ గ్లోబల్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అత్యంత ఆకర్షణీయమైన పాలసీని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో నిలిచింది. ముఖ్యంగా విద్యుత్ రాయితీలు ఇతరత్రా నియంత్రణపరమైన ప్రోత్సాహకాల కల్పనలో ముందంజలో ఉంది. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఎనర్జీ తాజా నివేదిక ‘ఇండియా ఫార్వార్డ్: రీఇమేజినింగ్ గ్రోత్’లో ఈ విషయాన్ని వెల్లడించింది.
మౌలిక వసతులు, మూలధనం, నియంత్రణ యంత్రాంగాల రూపంలో విస్తృత ప్యాకేజీలను అందిస్తున్న మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక గుజరాత్ ఊరించే విద్యుత్ ప్రోత్సాహకాలు, సులభతరమైన వ్యాపార విధానాల (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్–ఈఓడీబీ)పై ఫోకస్ చేస్తూ పెద్దయెత్తున క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజాలను (హైపర్‌స్కేలర్స్) ఆకర్షిస్తోంది.
మొత్తంమీద డేటా సెంటర్ పాలసీ అట్రాక్టివ్‌నెస్ ఇండియా (డీసీపీఏఐ) ఇండెక్స్‌లో ముందంజలో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలు 50–100 మధ్యలో స్కోర్ చేశాయి. ఐటీ, ఐటీఈఎస్, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీలు)కు సంబంధించి 19 రాష్ట్రాల విధానాలను మదింపు చేసి ఈ ఇండెక్స్‌ను రూపొందించారు.
ప్రధానంగా విద్యుత్, భూమి, మూలధనం (క్యాపిటల్), నిర్వహణ–సాంకేతికపరమైన మద్దతు, నియంత్రణపరమైన, ఈఓడీబీ కార్యాచరణ.. ఈ నాలుగు అంశాలను ర్యాంకింగ్స్ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. 42–45 మధ్య స్కోర్ చేసిన రెండో అంచె రాష్ట్రాల్లో ఒడిశా, హరియాణా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఉన్నాయి. 30–40 స్కోర్‌తో మూడో అంచెలో రాజస్తాన్, తమిళనాడు, పశి్చమబెంగాల్ నిలిచాయి.
నివేదికలో ఇతర ముఖ్యాంశాలివీ...
→ డేటా సెంటర్ల పరిశ్రమ భారీ విస్తరణ నేపథ్యంలో రాష్ట్రాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
→ ప్రస్తుతం భారత్‌లో డేటా సెంటర్ల సామర్థ్యం 1.5 గిగావాట్లు (జీడబ్ల్యూ) కాగా.. వచ్చే దశాబ్దకాలంలో 5 జీడబ్ల్యూ సామర్థ్యం గల డేటాసెంటర్లు ఏర్పాటు కానున్నాయి. అదనంగా మరో 6–7 జీడబ్ల్యూ సామర్థ్యాన్ని జోడించేందుకు కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి.
→ మొత్తంమీద చూస్తే 2031–32 నాటికి దేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం 26.3 జీడబ్ల్యూకు చేరే అవకాశం ఉంది.
→ దీనిప్రకారం హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్, ఆపరేషనల్ లోడ్స్ సహా డేటా సెంటర్ల నుంచి మొత్తం విద్యుత్ డిమాండ్ 2025–35 మధ్యలో వార్షికంగా (సీఏజీఆర్) 18 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా.


