‘ఫ్లై దుబాయ్’ హీరోకు రూ.కోటి నజరానా.. | Flydubai Pilot Captain Smit Machchhar Rs 1 Crore Reward Mankind Pharma | Sakshi
Sakshi News home page

‘ఫ్లై దుబాయ్’ హీరోకు రూ.కోటి నజరానా..

Oct 3 2026 2:55 AM | Updated on Oct 3 2026 3:00 AM

Flydubai Pilot Captain Smit Machchhar Rs 1 Crore Reward Mankind Pharma

దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్‌ విమానం క్రాష్‌ అవకుండా తన ప్రాణాలకు తెగించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌కు ప్రముఖ ఫార్మా సంస్థ మాన్‌కైండ్‌ ఫార్మా రూ.కోటి నజరానాను ప్రకటించింది. ఆయన ధైర్యసాహసాలను గుర్తిస్తూ ఈ మొత్తాన్ని కెప్టెన్‌ మచ్చార్‌, ఆయన కుటుంబానికి అందించనున్నట్లు సంస్థ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ జునేజా లేఖ ద్వారా తెలిపారు.

సెప్టెంబర్‌ 30న దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్‌ FZ1073 విమానంలో కెప్టెన్‌ మచ్చార్‌ అసమాన తెగువను చూపించారు. సుమారు 33 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్‌లో కెప్టెన్‌ మచ్చార్‌తో కో-పైలట్‌ ఘర్షణకు దిగి తీవ్రంగా గాయపరిచాడు. ఈ క్రమంలో విమానం ప్రమాదం దిశగా తీవ్ర వేగంతో కిందికి దూసుకెళ్తుందని గమనించిన కెప్టెన్‌ మచ్చార్‌ అతి కష్టం మీద కాక్‌పిట్‌ తలుపు తెరవడంతో సిబ్బంది, ప్రయాణికులు లోపలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సహకరించారు. అనంతరం విమానం టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. విమానంలో సిబ్బంది సహా 182 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ ఘటనలో కెప్టెన్‌ మచ్చార్‌ చూపిన ధైర్యాన్ని ప్రశంసిస్తూ.. ‘సంక్షోభ సమయంలో ఆయన ప్రదర్శించిన ధైర్యం, సమయ స్ఫూర్తి, బాధ్యత ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ప్రభావితం చేశాయని మాన్‌కైండ్‌ ఫార్మా ఎండీ రాజీవ్‌ జునేజా పేర్కొన్నారు. ఆయన కాపాడిన ప్రాణాల విలువను డబ్బును పోల్చలేమని, ఈ రూ.కోటి నజరానా తమ కృతజ్ఞతను వ్యక్తం చేసే చిన్న ప్రయత్నం మాత్రమేనని తెలిపారు.

కాగా, ఈ ఘటనలో కెప్టెన్‌ మచ్చార్‌ పాత్రను భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కూడా ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన చూపిన తెగువ విమానంలో ఉన్నవారిని రక్షించడంలో కీలకంగా నిలిచిందని నెతన్యాహు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement