టెల్ అవీవ్: దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం హైజాక్ యత్నం ఘటనలో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భారతీయ పైలట్‌పై కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చేందుకు యత్నించిన ఒమన్ కో-పైలట్‌కు సంబంధించిన మరిన్ని సంచలన వివరాలను ఇజ్రాయెల్ మీడియా, అధికారులు బయటపెట్టారు.
నిందితుడు తన సోషల్ మీడియా ఖాతాలలో యూదులను చంపడం గురించి తరచూ చర్చించాడని ఓ ఇజ్రాయెల్ అధికారి ‘ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’తో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన ఒమన్ జాతీయుడు పూర్తిగా ఇస్లామిస్ట్ ఉగ్రవాద భావజాలానికి బానిసయ్యాడని, అతని సోషల్ మీడియా పోస్టులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
కరపత్రాల్లో ఏముందంటే?
ఎమిరేట్స్ వర్గాలను ఉటంకిస్తూ ‘ఐ24న్యూస్’ జర్నలిస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడైన కో-పైలట్ లగేజీలో ‘ఫ్రీ పాలస్తీనా’ గ్రూపులకు సంబంధించిన కరపత్రాలు, ప్రచురణలు, ఇతర పాలస్తీనా అనుకూల సామగ్రి లభించాయి. ఆ పైలట్ పదేపదే పాలస్తీనియన్లకు మద్దతు తెలుపుతూ, ఇజ్రాయెల్ పట్ల తీవ్రమైన శత్రుత్వాన్ని వ్యక్తం చేశాడని ఆ మూలం తెలిపింది. కో-పైలట్ ఇస్లామిక్ తీవ్రవాద భావజాలం, ఉగ్రవాద ఉద్దేశ్యాల కోణంలో ఈ ఆధారాలు కీలకంగా మారాయి.
నన్ను చంపండి.. నన్ను చంపండి
ప్రయాణికులు, సిబ్బంది కలిసి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కట్టేసిన తర్వాత, అతను విమాన సిబ్బందిని ఉద్దేశించి ‘నన్ను చంపండి.. నన్ను చంపండి’ అంటూ అరిచాడని అధికారులు తెలిపారు. ఇతను ఆత్మహత్య చేసుకోవడానికి, విమానంతో సహా కుప్ప కూలిపోవడానికి పక్కా ప్రణాళికతో వచ్చినట్లు స్పష్టమవుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ‘ఫాక్స్ న్యూస్’తో అన్నారు.
అక్కడ ఉన్న ప్రయాణికుల భద్రత, నిందితుడి ఇస్లామిస్ట్ ధోరణులు, తీవ్రవాద భావజాలం, దొరికిన కరపత్రాలను పరిగణనలోకి తీసుకుంటే ఇదొక ఉగ్రవాద యత్నంగా భావించడానికి తగిన ఆధారాలున్నాయని నెతన్యాహు పేర్కొన్నారు. అయితే, దర్యాప్తు పూర్తిగా ముగిసే వరకు తుది ఉద్దేశంపై కచ్చితమైన నిర్ధారణకు రాలేమని, సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయెల్ దర్యాప్తు బృందాలు సంయుప్తంగా విచారణ జరుపుతున్నాయని అధికారులు వెల్లడించారు.
ఎఫ్‌జెడ్ 1073 విమానంలో ఏం జరిగింది?
ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్ 1073 యూఏఈలోని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఇజ్రాయెల్ మెట్రో నగరం టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరింది. ప్రయాణం ప్రారంభమైన సుమారు రెండున్నర గంటల తర్వాత, ఒమన్ జాతీయుడైన కో-పైలట్ అకస్మాత్తుగా విమానాన్ని హైజాక్ చేసి కూల్చేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాక్‌పిట్‌లో ఆపత్కాలంలో సిబ్బంది వినియోగించే క్రాష్ యాక్స్‌తో భారతీయ సంతతి పైలట్ స్మిత్ మచ్చార్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ పెనుగులాట కారణంగా విమానం ఒక్కసారిగా 33 వేల అడుగుల క్రూయిజింగ్ ఎత్తు నుంచి దాదాపు 16,600 అడుగుల ఎత్తు వరకు (17 వేల అడుగులకు పైగా) కుప్పకూలినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా స్పష్టం చేసింది.
ప్రాణాలకు తెగించి.. సురక్షిత ల్యాండింగ్
ఈ ప్రమాదకర సమయంలో తీవ్ర గాయాలనప్పటికి, కెప్టెన్ స్మిత్ మచ్చర్ వెనకడుగు వేయలేదు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి కాక్‌పిట్ డోర్ తెరిచి విమానాన్ని అదుపులోకి తెచ్చేందుకు పోరాడారు.ఇంతలో అప్రమత్తమైన సిబ్బంది, ప్రయాణికులు వెంటనే కాక్‌పిట్‌లోకి చొచ్చుకెళ్లి దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని కట్టేశారు. ఆ తర్వాత కెప్టెన్ మచ్చార్ సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.


