ఫ్లైదుబాయ్ విమానంలో పెను ప్రమాదాన్ని అడ్డుకుని వందలాది మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఘటన మరోలా ముగిసి ఉంటే.. భారత్‌పై ఎలాంటి ముద్ర పడేదో ఊహించలేమంటూ ఆయన పేర్కొన్నారు.
‘‘మీరు అందరినీ కాపాడారు. చాలా గొప్ప పని చేశారు’’ అంటూ కెప్టెన్ మచ్చార్‌ను ప్రధాని మోదీ అభినందించారు. యూఏఈలో చికిత్స పొందుతున్న మచ్చార్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ.. ‘‘ఇలా జరగకపోయి ఉంటే.. భారత్ ఏం ఎదుర్కోవాల్సి వచ్చేదో, భారత పైలట్లు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేదో, వారిని ప్రజలు ఎలా చూసేవారో ఎవరికి తెలుసు. మీరు అందరినీ కాపాడారు. మీరు చాలా గొప్ప పని చేశారు. భారత్, భారత పైలట్ల ప్రతిష్ఠను కాపాడారు’’ అని మోదీ వ్యాఖ్యానించినట్లు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి.
తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చార్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తిని ప్రధాని ప్రశంసించారు. ‘‘దేశం మొత్తం మీ కోసం ప్రార్థిస్తోంది. మీ ఆరోగ్యం కోసం మహా మృత్యుంజయ జపం కూడా చేస్తున్నారు. మీ ధైర్యం, సమయస్ఫూర్తి, ప్రశాంతత ఎంతోమంది ప్రాణాలను కాపాడాయి. భారతీయులు ఇతరుల ప్రాణాలు తీసేవారు కాదు.. ఇతరులను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేవారు అని దేశం గర్వంగా చెప్పుకోగలదు’’ అని మోదీ పేర్కొన్నారు. ఇదే సమయంలో.. సోషల్ మీడియాలో ఈ ఘటనపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కాక్‌పిట్‌లో దాడి.. ప్రాణాలకు తెగించి
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఒమన్‌కు చెందిన కో-పైలట్ కెప్టెన్ మచ్చార్‌పై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత విమానాన్ని కూల్చేయాలని అతను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మచ్చార్.. పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులను సహాయం కోరేలా చేశారు. దీంతో ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి చేరుకుని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఉన్న అదనపు సిబ్బందిలో పైలట్లు.. విమానాన్ని కంట్రోల్ చేసి సౌదీ అరేబియాలో సేఫ్ ల్యాండ్ చేశారు. ఆ తర్వాత రక్తపు గాయాలైన మచ్చార్‌ను ఆస్పత్రిలో చేర్చి.. అతని ప్రాణాలను కాపాడగలిగారు.
సోషల్ మీడియాలో మరో చర్చ
ఫ్లైదుబాయ్ ఘటన తర్వాత.. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు, థియరీలు కనిపించాయి. ఎక్స్‌లో కొన్ని సంచలనాత్మక పోస్టులు కనిపించాయి. విమానం ప్రమాదానికి గురై ఉంటే.. భారత్‌ను బద్నాం చేసేందుకు కుట్రలు జరగాయని అందులో ఉన్నాయి. అందులోని భారత పైలట్‌పైనా ప్రశ్నలు, నిందలు గుప్పించేందుకు రంగం సిద్ధమైందన్నది వాటి సారాంశం. వీటిని ప్రధానంగా పాకిస్థాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలు ప్రచారం చేసేందుకు రెడీ అయ్యాయని ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది. అయితే ప్రధాని మోదీ తన సంభాషణలో ఆ పోస్టులను నేరుగా ప్రస్తావించలేదు. కానీ, భారత పైలట్లపై ఏర్పడే అవకాశం ఉన్న అభిప్రాయాన్ని మాత్రమే ప్రస్తావించారు.
An unforgettable conversation with Captain Smit, filled with pride and emotions. pic.twitter.com/CCf46PKOWR
— Narendra Modi (@narendramodi) October 2, 2026
ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు
కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. మచ్చార్ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. విమానంలో 170 మందికి పైగా ప్రయాణికులు ఉన్న సమయంలో ఆయన ప్రదర్శించిన తెగువ కీలకంగా మారింది. లేకుంటే ఘోరమే జరిగి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: మీరే నాకు స్ఫూర్తి.. మోదీతో మచ్చార్


