ప్రముఖ బిలియనీర్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశారు. ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కొందరు ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతుండగా.. మరికొందరు తేలికగా తీసుకోవాలని సూచిస్తూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదం ఎక్స్ (X) వేదికగా మొదలైంది. జైగర్ క్యాపిటల్ అనే యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించినట్లు ప్రకటిస్తూ.. “ఇది సహజంగానే మహిళల కోసం ఉన్న యాప్. ఎలాంటి ప్రయోజనం లేదు” అంటూ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన మస్క్.. ఇన్‌స్టాగ్రామ్ అమ్మాయిల కోసమే “Instagram is for girls” అంటూ కామెంట్ చేశారు. ఇక్కడి నుంచి అసలు దుమారం మొదలైంది.
కొత్తేం కాదు
ఇన్‌స్టాగ్రామ్‌పై మస్క్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మేలో సోషల్ మీడియా వినియోగ అలవాట్లపై జరిగిన ఓ చర్చలోనూ ఆయన ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, స్టోరీస్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పోస్టులు ఎక్కువగా ఉంటాయనే అంశాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పురుషులు తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్‌ను తనకు పంపినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుందని కూడా మస్క్ గతంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లోనూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
Instagram is for girls
— Elon Musk (@elonmusk) October 1, 2026
ఎవరేమన్నారంటే..
మస్క్ తాజా వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికలు ఏ ఒక్క లింగానికి మాత్రమే పరిమితం కావని, ఇన్‌స్టాగ్రామ్‌ను అన్ని వర్గాల వారు ఉపయోగిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. “అయితే ఎక్స్(దీనికి ఓనర్ మస్కే కదా) ఎవరి కోసం?” అంటూ ఓ యూజర్ ప్రశ్నించగా.. “ఇన్‌స్టాగ్రామ్ అందరికీ చెందిన వేదిక” అంటూ మరికొందరు స్పందించారు. ఇంకొందరు మస్క్ వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ఆయన చెప్పింది కంటెంట్ ట్రెండ్‌లను ఉద్దేశించిందేనని అభిప్రాయపడ్డారు.
వాస్తవం ఏంటంటే..
ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువగా మహిళలే ఉపయోగిస్తారన్న అభిప్రాయం ఉన్నప్పటికీ.. గణాంకాలు మాత్రం మరో చిత్రాన్ని చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల్లో పురుషుల వాటా సుమారు 52.7 శాతం ఉండగా.. మహిళల వాటా 47.3 శాతంగా ఉంది. అంటే ప్రపంచ స్థాయిలో పురుషుల వినియోగమే స్వల్పంగా ఎక్కువగా ఉంది. భారత్‌లోనూ ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల్లో పురుషుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు డేటా సూచిస్తోంది. అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం.. దేశంలోని అడల్ట్ యూజర్లలో పురుషుల వాటా సుమారు 70 శాతం, మహిళల వాటా దాదాపు 30 శాతంగా ఉంది.
అయితే ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ఫొటోలు, రీల్స్ వంటి కంటెంట్ కారణంగా ఇన్‌స్టాగ్రామ్‌ను కొందరు మహిళలతో ఎక్కువగా అనుసంధానం చేస్తుంటారు. ఇదే నేపథ్యంలో మస్క్ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియా వేదికల స్వభావంపై చర్చకు తెరలేపాయి.
ఇదీ చదవండి: అదే నిజమైతే ఇరాన్ నామరూపాల్లేకుండా పోతుంది!


