ఫ్లైదుబాయ్‌ ఘటనలో కొత్త ట్విస్టులు | Flydubai Incident: Netanyahu's Claims Chilling Cockpit Video Out | Sakshi
Sakshi News home page

ఫ్లైదుబాయ్‌ ఘటనలో కొత్త ట్విస్టులు

Oct 2 2026 10:18 AM | Updated on Oct 2 2026 10:39 AM

Flydubai Incident: Netanyahu's Claims Chilling Cockpit Video Out

దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌ వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో జరిగిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాక్‌పిట్‌లో జరిగిన దాడి వెనుక ఉద్దేశం ఏమిటి? విమానాన్ని కూల్చే ప్రయత్నమేనా? లేక మరేదైనా కారణమా? అన్న అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి.

ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహూ.. ఒమన్‌కు చెందిన కో-పైలట్‌ ఇస్లామిక్‌ తీవ్రవాద భావజాలానికి ప్రభావితుడై ఉండొచ్చని తెలిపారు. అతడి వ్యక్తిగత సమాచారంలో కొన్ని అంశాలు బయటపడ్డాయని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. అదుపులోకి తీసుకున్న సమయంలో కో-పైలట్‌ “కిల్‌ మీ.. కిల్‌ మీ” అంటూ అరచినట్లు పేర్కొన్నారు. అతడు ఆత్మహత్యా ధోరణిలో ఉన్నట్లు కనిపించిందని, విమానాన్ని ప్రమాదంలోకి నెట్టే ఉద్దేశం ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఫ్లైదుబాయ్‌ ఘటనను తీవ్రంగా పరిగణించారు. భారత పైలట్‌ స్మిట్‌ మచ్చార్‌పై దాడి చేసిన ఆ కోపైలట్‌కు ఇరాన్‌తో లింకులు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. దర్యాప్తు జరుగుతోందని.. అదే గనుక నిజమని తేలితే ఇరాన్‌పై భీకరదాడులు జరుపుతామని హెచ్చరించారు.

కాక్‌పిట్‌లో రక్తపాతం..వీడియో బయటకు
ఫ్లైదుబాయ్‌ ఎఫ్‌జెడ్‌1073 విమానం దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విమానంలో 174 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. విమాన కాక్‌పిట్‌లో కో-పైలట్‌ భారతీయ కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌పై దాడి జరిగింది. ఈ సమయంలో విమానం ఒక్కసారిగా వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి దిగడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

బయటకు వచ్చిన వీడియోల్లో విమానం లోపల గందరగోళ పరిస్థితులు కనిపించాయి. ప్రయాణికులు కాక్‌పిట్‌ వైపు పరుగులు తీస్తూ కనిపించారు. “అతడు విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు” అంటూ కొందరు ప్రయాణికులు అరుస్తున్న దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి.

గాయాలతోనే తలుపు తెరిచి..
దాడిలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్‌ స్మిట్‌ మచ్చర్‌ రక్తస్రావంతో ఉన్నప్పటికీ కాక్‌పిట్‌ తలుపు తెరిచినట్లు  ఆ దృశ్యాలు ఉన్నాయి. దీంతో ప్రయాణికులు లోపలికి వెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. “అతడు నన్ను చాలా సార్లు కొట్టాడు” అంటూ కెప్టెన్‌ చెప్పిన దృశ్యాలు వీడియోల్లో కనిపించినట్లు సమాచారం.

ఈ సమయంలో కొందరు ప్రయాణికులు ధైర్యంగా ముందుకు వచ్చారు. ట్జ్వికా మానెస్‌, అసఫ్‌ రాజువాన్‌, యానివ్‌ హయూన్‌ వంటి ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంలో సహకరించారు.

ప్లంబర్‌, డెంటిస్ట్‌.. ప్రయాణికులే హీరోలు
ఈ ఘటనలో ప్రయాణికుల పాత్ర కీలకంగా మారింది. విమానంలో ఉన్న డెంటిస్ట్‌ షోటా ముసాయెవ్‌ గాయపడిన కెప్టెన్‌కు ప్రథమ చికిత్స అందించారు. అలాగే విమానంలో ఉన్న ఆఫ్‌-డ్యూటీ పైలట్లు పరిస్థితిని చక్కదిద్దడంలో సహకరించారు. ప్రయాణికుడు యానివ్‌ హయూన్‌.. విమాన ప్రమాదాలకు సంబంధించిన టీవీ షోలు చూసిన అనుభవం ఆ సమయంలో తనకు ఉపయోగపడిందని చెప్పినట్లు సమాచారం.

కోలుకుంటున్న భారత పైలట్‌
ఘటన తర్వాత సౌదీ అరేబియాలోని టబూక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన కెప్టెన్‌ స్మిట్‌ మచ్చర్‌ను అనంతరం యూఏఈకి తరలించారు(ఎయిర్‌లిఫ్ట్‌). యూఏఈలో భారత రాయబారి దీపక్‌ మిట్టల్‌ ఆస్పత్రికి వెళ్లి కెప్టెన్‌, ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. స్మిట్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారని తెలిపారు. “ధైర్యవంతుడైన భారత ముద్దుబిడ్డ” అంటూ స్మిట్‌ను ఆయన ప్రశంసించారు. మానవ ప్రాణాలను కాపాడటంలో ఆయన గొప్ప సేవ చేశారని పేర్కొన్నారు.

కో-పైలట్‌ UAE అదుపులోకి
ఘటన తర్వాత సౌదీ అధికారులు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని యూఏఈ అధికారులకు అప్పగించారు. ఈ ఘటన ఉగ్రవాద సంబంధమా? ముందస్తు ప్రణాళిక ఉందా? కో-పైలట్‌ ఒక్కడే ఈ చర్యకు పాల్పడ్డాడా? అన్న అంశాలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ దర్యాప్తులో ఇజ్రాయెల్‌ కూడా భాగం కావొచ్చని సమాచారం. 

ఘటనపై అనుమానాలు?
ఈ ఘటన తర్వాత విమాన భద్రతా వ్యవస్థపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒమన్‌, ఇజ్రాయెల్‌కు అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ.. ఆ దేశానికి చెందిన వ్యక్తి ఇజ్రాయెల్‌ వెళ్లే విమానంలో విధులు నిర్వహించడం ఎలా సాధ్యమైందన్న చర్చ మొదలైంది. ఏమైనా లోపాలు జరిగాయా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మరోవైపు.. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్లంబర్‌ అయిన యానివ్‌ హయూన్‌ ఆ సమయంలో విమానం కంట్రోల్‌ చేశాడన్న కోణాన్ని ఏకిపారేస్తున్నాయి. హయూన్‌ నేరుగా ప్రధాని నెతన్యాహూను కలవడం, ఆ సమయంలో జరిగిందంతా డ్రామాగా అభివర్ణిస్తూ కథనాలు ఇస్తున్నాయి. ఇటు ఒమన్‌కు చెందిన వ్యక్తికి.. ఇజ్రాయెల్‌కు విమానం నడిపే అవకాశం ఎలా దక్కింది? అని మాజీ పైలట్లు ప్రశ్నిస్తున్నారు. ఇంకోవైపు ఎన్నికల్లో లబ్ధి కోసమే నెతన్యాహూ ఈ డ్రామాలు ఆడుతున్నారేమో అని ఇజ్రాయెల్‌ ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 

ఇదీ చదవండి: ఎలక్షన్‌ దాకా ఆగడం ఎందుకు? బాంబులేస్తే పోలా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement