గుండెల్లో ఆలోచనలు.. చేతిలో స్మార్ట్‌ఫోన్.. ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చిన తరమే జెన్‌జీ. సమాచారం కోసం పుస్తకాల కంటే గూగుల్, చర్చల కోసం వేదికల కంటే సోషల్ మీడియా, ఉద్యమాల కోసం వీధుల కంటే డిజిటల్ ప్లాట్‌ఫాంలను ఎక్కువగా ఉపయోగిస్తున్న తరం ఇది. ఇలాంటి డిజిటల్ యుగంలో మహాత్మా గాంధీ జీవించి ఉంటే ఎలా స్పందించేవారు?..
గాంధీ కాలంలో ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు ఆయన పత్రికలు, పాదయాత్రలు, సభలను ఆయుధాలుగా ఉపయోగించారు. ‘యంగ్ ఇండియా’, ‘హరిజన్’ వంటి పత్రికల ద్వారా తన ఆలోచనలను లక్షల మందికి చేరవేశారు. నేడు అలాంటి అవకాశం ఉంటే.. ఆయన చేతిలో ఒక స్మార్ట్‌ఫోన్ ఉండేదా? తన సందేశాలను కోట్లాది మందికి క్షణాల్లో చేరవేసేందుకు డిజిటల్ మాధ్యమాలను ఉపయోగించేవారా? అనేది జెన్‌జీ ఆలోచిస్తున్న ప్రశ్న.
డిజిటల్ సత్యాగ్రహం సాధ్యమా?
గాంధీ పోరాటాల్లో ప్రధానమైన అంశం ప్రజల భాగస్వామ్యం. ఉప్పు సత్యాగ్రహం నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం వరకు సామాన్యులను భాగస్వాములను చేశారు. నేటి కాలంలో అదే సూత్రం డిజిటల్ ప్రపంచంలో కనిపిస్తోంది. ఒక హ్యాష్‌ట్యాగ్ ద్వారా లక్షలాది మంది ఒకే అంశంపై స్పందించడం, ఆన్‌లైన్ పిటిషన్లు, సోషల్ మీడియా ప్రచారాలు.. ఇవన్నీ ఆధునిక ఉద్యమాల రూపాలుగా మారాయి.
అయితే గాంధీ విధానంలో కేవలం నిరసన మాత్రమే కాదు.. క్రమశిక్షణ, నిజాయితీ, అహింస కూడా కీలకం. సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించే తప్పుడు సమాచారం, ద్వేషపూరిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దాడులు ఆయన సిద్ధాంతాలకు ఎంతవరకు సరిపోతాయి? అనే ప్రశ్న కూడా ఉంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో గాంధీ ఎలా ఉండేవారు?
ఒకవేళ గాంధీకి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉంటే.. బహుశా తన జీవనశైలి, స్వచ్ఛత, గ్రామీణ అభివృద్ధి, స్వదేశీ ఆలోచనలపై పోస్టులు చేసేవారేమో. ఖరీదైన జీవనశైలికి బదులుగా సరళమైన జీవనం గురించి మాట్లాడేవారు. లక్షలాది ఫాలోవర్లను తన వ్యక్తిగత ప్రచారం కోసం కాకుండా ఒక సామాజిక లక్ష్యం కోసం ఉపయోగించుకునేవారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నేటి జెన్‌జీ ఎదుర్కొంటున్న అనేక అంశాల్లో గాంధీ ఆలోచనలకు కొత్త అర్థాలు కనిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం, మినిమలిజం, శాంతియుత నిరసనలు వంటి అంశాల్లో యువతలో ఆసక్తి పెరుగుతోంది. ఇవన్నీ గాంధీ చెప్పిన కొన్ని విలువలకు దగ్గరగా ఉన్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు.
గాంధీ ఆలోచనలు.. జెన్‌జీకి కొత్త భాషలో
కాలం మారింది.. సాధనాలు మారాయి.. కానీ సమాజాన్ని మార్చాలనే ఆలోచనకు వేదికలు మాత్రమే మారాయి. జెన్‌జీకి గాంధీ అంటే కేవలం నోట్లపై కనిపించే చిత్రం కాదు.. అహింస, సత్యం, సామాజిక మార్పుకు ప్రతీక. అయితే ఈ తరానికి గాంధీ ఆలోచనలు చేరాలంటే పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా వారి భాషలో చెప్పాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలను గౌరవించడం అహింస అని, ఫేక్ న్యూస్ మధ్య నిజాన్ని వెతకడం సత్యాగ్రహమని, స్థానిక ఉత్పత్తులు–పర్యావరణ పరిరక్షణలో స్వదేశీ భావనను చూడొచ్చని వివరించాలి. గాంధీ సందేశం మారాల్సిన అవసరం లేదు.. దాన్ని చేరవేసే మార్గమే మారాలి. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్న జెన్‌జీకి గాంధీ సిద్ధాంతాలు చేరాలంటే అవి డిజిటల్ యుగంలో కొత్త భాష మాట్లాడాల్సిందే.
గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..


