నేడే సీజేపీ మరో ఉద్యమం.. ట్విస్ట్‌ ఇచ్చిన పోలీసులు! | CJPs Fresh Protest Against CEC Gyanesh Kumar: Mumbai Police Twist | Sakshi
Sakshi News home page

నేడే సీజేపీ మరో ఉద్యమం.. ట్విస్ట్‌ ఇచ్చిన పోలీసులు!

Oct 2 2026 7:21 AM | Updated on Oct 2 2026 7:36 AM

CJPs Fresh Protest Against CEC Gyanesh Kumar: Mumbai Police Twist

భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాక్రోచ్‌ జనతా పార్టీ మరో ఉద్యమానికి సిద్ధమైంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR)ను వెంటనే నిలిపివేయాలని, ఎన్నికల వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకురావాలని కోరుతూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ ప్రకటించింది. గాంధీ జయంతి సందర్భంగా గురువారం నుంచి ముంబై వేదికగా ఆందోళనలకు శ్రీకారం చుట్టనుంది. అయితే ఈ ఉద్యమానికి ముందు నగరంలో హైడ్రామా నడిచింది. 

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కేను ముంబైలోని మెరైన్‌ డ్రైవ్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారం జోరుగా చర్చనీయాంశంగా మారింది. ప్లకార్డులు పట్టుకుని మెరైన్‌ డ్రైవ్‌ వద్ద దీప్కే, ఆయన మద్దతుదారులు కనిపించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆయనను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే దీప్కేను అరెస్టు చేయలేదని ముంబై పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసుల వివరణ ప్రకారం.. మెరైన్‌ డ్రైవ్‌ వద్ద దీప్కే ప్రజలను కలుస్తూ, అక్కడ విధుల్లో ఉన్న పోలీసులను ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఒక మహిళా పోలీసు అధికారి ఆయనను గుర్తింపు, స్వస్థలం వంటి వివరాలు అడిగిన అనంతరం స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే దీప్కే మాత్రం భిన్నంగా స్పందించారు. 

తనను ఓ మహిళా పోలీసు అధికారి ‘టీ తాగుదాం రండి’ అంటూ వెంట తీసుకెళ్లారని, అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో కొంతసేపు ఉంచి వెళ్లిపోవచ్చని చెప్పారని తెలిపారు. తన సమయాన్ని వృథా చేసేందుకే ఇలా చేశారని ఆరోపించారు. తర్వాత చెంబూర్‌లోని అంబేడ్కర్‌ హాస్టల్‌లో విద్యార్థులను కలిసినట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

అనుమతి నిరాకరణ
ముంబైలోని శివాజీ పార్క్‌ వద్ద భారీ నిరసన నిర్వహించాలని సీజేపీ నిర్ణయించింది. అయితే ఈ కార్యక్రమానికి ముంబై పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. శివాజీ పార్క్‌ పరిధిలోని నిబంధనలు, ట్రాఫిక్‌ రద్దీ, అత్యవసర వాహనాల రాకపోకలకు ఇబ్బందుల నేపథ్యంలో అనుమతి ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు. అయినప్పటికీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని సీజేపీ స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీంతో ఇవాళ్టి నిరసనలపై ఉత్కంఠ నెలకొంది.

సీఈసీ రాజీనామానే ప్రధాన డిమాండ్‌
కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రధానంగా సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా, SIR ప్రక్రియ నిలిపివేత, ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు వంటి డిమాండ్లతో ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఓటర్ల జాబితా సవరణ పేరుతో ప్రజల ఓటు హక్కుకు భంగం కలగకుండా చూడాలని ఆ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. సీఈసీ పదవి నుంచి జ్ఞానేశ్‌ కుమార్‌ తప్పుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ప్రకటించారు. ముంబైలో ప్రారంభమయ్యే నిరసనలు అనంతరం దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్‌ కూడా అదే బాటలో..
ఇదే అంశంపై.. కాంగ్రెస్‌ పార్టీ కూడా విడిగా ఆందోళనలకు సిద్ధమైంది. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. సర్‌ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతూ పలు రాష్ట్రాల్లో నిరసనలు చేపట్టబోతోంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 8వ తేదీ దాకా సేవ్‌ డెమొక్రసీ మార్చ్‌లను నిర్వహించనుంది. మహారాష్ట్ర కాంగ్రెస్‌ సహా వివిధ రాష్ట్రాల పార్టీ విభాగాలు ఈ అంశంపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికల సంఘం స్వతంత్రత, ఓటర్ల జాబితా నిర్వహణపై సమగ్ర చర్చ అవసరమని కాంగ్రెస్‌ పేర్కొంటోంది.

SIRపై కొనసాగుతున్న వివాదం
మరోవైపు ఎన్నికల సంఘం మాత్రం SIR ప్రక్రియ చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగానే జరుగుతోందని చెబుతోంది. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శక విధానాలు పాటిస్తున్నామని స్పష్టం చేస్తోంది. సీజేపీ ఉద్యమ పిలుపు, కాంగ్రెస్‌ నిరసనలతో SIR అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. సీఈసీ రాజీనామా డిమాండ్‌, ఎన్నికల ప్రక్రియపై కొనసాగుతున్న వివాదం రాబోయే రోజుల్లో మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌లోకి వచ్చేయండి ప్లీజ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement