ఆకాశంలో ఏదైనా ప్రమాదం జరిగితే.. ప్రయాణికులకు తొలుత గుర్తొచ్చేది పైలట్. కానీ అత్యవసర పరిస్థితుల్లో కాక్‌పిట్ బయట ఉన్న సిబ్బంది ఎంత కీలకమో చెప్పిన ఓ పైలట్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయనే ఫ్లైదుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్. 174 మంది ప్రాణాలు కాపాడి.. రియల్ హీరో అంటూ ప్రపంచం నుంచి జేజేలు అందుకుంటున్నాడు ఈ భారతీయుడు ఇప్పుడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్(ఇజ్రాయెల్) వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడికి గురై తీవ్రంగా గాయపడినప్పటికీ.. తెగువ ప్రదర్శించిన కెప్టెన్ స్మిట్ మచ్చార్ ఎలాగోలా కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం.. విమానంలో అదనంగా ఉన్న మరో ఇద్దరు పైలట్లు విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. లేకుంటే ఘోరం జరిగి ఉండేదేమో!.
ఫ్లైదుబాయ్ ఘటనలో కెప్టెన్ స్మిట్ మచ్చార్‌కు తల, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. ఆయన భారీగా రక్తం కోల్పోయి స్పృహ కోల్పోయే స్థితికి చేరుకున్నా.. ప్రయాణికులతో మాట్లాడుతూనే ఉన్నారు. విమానం సౌదీ అరేబియా టబుక్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే వరకు చికిత్స అందించిన ఇజ్రాయెలీ డెంటిస్ట్.. మచ్చార్ పరిస్థితి తీవ్రంగానే ఉన్నప్పటికీ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయ్యిందని.. ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు చెబుతున్నారు.

“గాల్లో ఏదైనా తప్పు జరిగితే.. మీ ప్రాణాలను ఎవరు కాపాడతారు? క్యాబిన్ క్రూ కాపాడగలరు” అంటూ గతంలో స్మిట్ మచ్చార్ చెప్పిన మాటలు.. ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
స్మిట్ మచ్చార్ ప్రయాణం మొదటి నుంచీ విమానయానంతో ముడిపడి లేదు. చిన్నప్పటి నుంచీ పైలట్ కావాలన్నది ఆయన కల కాదు. గుజరాతీ మూలాలున్న స్మిట్ మచ్చర్ ముంబైలో చదువుకున్నారు. స్కూలింగ్ తర్వాత కుటుంబ వ్యాపారంతో సంబంధం ఉన్న టెక్స్‌టైల్ ఇంజినీరింగ్ కోర్సులో చేరారు. ఆ తర్వాత మేనేజ్‌మెంట్ కోర్సులో చేరారు.
అక్కడే ఓ రోజు జరిగిన ఏవియేషన్ సెమినార్ ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. విమానయానంపై ఆసక్తి కలిగింది. అప్పటికి ఆయన వయసు కేవలం 19 ఏళ్లు. పైలట్ కావాలన్నది నా చిన్ననాటి కల కాదు.. జీవితంలో చాలా తర్వాత అది నా ముందుకొచ్చింది అని 2025లో బోనాఫైడ్ బాంటర్ పోడ్‌కాస్ట్‌లో స్మిట్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
ఆ క్షణం తల్లి భయపడింది!
పైలట్ కావాలన్న తన నిర్ణయం కుటుంబంలోనూ ఆసక్తికరమైన స్పందనకు కారణమైందని మచ్చార్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. తల్లి తొలుత భయపడగా.. తండ్రి మాత్రం తన నిర్ణయాన్ని ప్రశాంతంగా స్వీకరించారు. “ఎలా, ఎక్కడ చేయాలో చూసుకో” అంటూ తండ్రి ప్రోత్సహించారని మచ్చార్ ఆ పాడ్‌కాస్ట్‌లో గుర్తుచేసుకున్నారు.
ఆ తర్వాత పైలట్ శిక్షణ కోసం న్యూజిలాండ్ వెళ్లారు. అదే ఆయన తొలి విదేశీ ప్రయాణం. చిన్న విమానంలో శిక్షణ సమయంలో తొలి ఫ్లయింగ్ అనుభవం కూడా అంత సులభంగా అనిపించలేదు. అనంతరం బెంగళూరు నుంచి ఢిల్లీకి కమర్షియల్ విమానంలో ప్రయాణించినప్పుడు కూడా భయపడ్డానని చెప్పారు. అయితే విమానం కంటే.. శిక్షణలో ఉన్న పైలట్‌గా తనపై ఉన్న బాధ్యతే ఎక్కువగా భయపెట్టిందని వివరించారు.
వేల గంటల అనుభవం
శిక్షణ పూర్తయ్యాక మచ్చార్ వాణిజ్య విమానయానంలోకి అడుగుపెట్టారు. ముంబైలోని స్పైస్‌జెట్‌లో సుమారు 11 ఏళ్లు పనిచేశారు. సీనియర్ కమాండర్‌గా మాత్రమే కాకుండా లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. అంటే ఇతర పైలట్లకు శిక్షణ ఇవ్వడం, వారి పనితీరును పరిశీలించడం వంటి బాధ్యతలు కూడా ఆయనపై ఉండేవి.
2022 జూన్‌లో ఫ్లైదుబాయ్‌లో డైరెక్ట్ ఎంట్రీ కెప్టెన్‌గా చేరారు. బోయింగ్ 737-800, 737 MAX 8, MAX 9 విమానాలపై కలిపి ఆయనకు 9,750 గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవం ఉన్నట్లు ఆయన ప్రొఫైల్‌ను బట్టి తెలుస్తోంది.
ఆ ఇంట్లో మరో పైలట్..
మచ్చార్ కుటుంబంలో విమానయానంపై ఆసక్తి ఆయనతోనే ఆగిపోలేదు. ఆయన సోదరుడు కూడా పైలట్. ఇటీవలే అతను కూడా ఫ్లైదుబాయ్‌లో చేరారంట. స్మిట్ మచ్చార్ తన భార్య, పిల్లలతో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఘటన విషయం తెలియగానే కుటుంబం ఆందోళనకు గురైంది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతుండగా.. భారత అధికారులు కుటుంబంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు.
#CaptainSmitMachchhar ने अपने एक इंटरव्यू में कहा था कि
“जब हवा में कुछ गलत होता है, तो आपकी जान बचाने वाला कौन होगा? Crew आपकी जान बचा सकता है।”
आज उनके वही शब्द सच साबित हुए।
Flydubai FZ1073 में खुद घायल होने के बावजूद इस बहादुर कैप्टन ने विमान को बचाने में अहम भूमिका… pic.twitter.com/ylRQduYqLw— Akshay Chaudhary (Modi ka Pariwar) (@_Akshay_8800) October 1, 2026
ఆ మాటలు ఇప్పుడు వైరల్
2025లో ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో మచ్చార్ క్యాబిన్ క్రూ ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు వైద్యుడు దొరకకపోవచ్చు.. కానీ క్యాబిన్ క్రూకు భద్రత, అత్యవసర పరిస్థితులు, ప్రథమ చికిత్సపై శిక్షణ ఉంటుందని చెప్పారు. “ఏదైనా తప్పు జరిగితే.. వాళ్లు అవసరం” అనే ఆయన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
టెక్స్‌టైల్ ఇంజినీరింగ్ చదివి కుటుంబ వ్యాపారంలోకి వెళ్లాల్సిన యువకుడు.. 19 ఏళ్ల వయసులో తీసుకున్న ఒక్క నిర్ణయంతో పైలట్ అయ్యారు. నేడు అదే వృత్తిలో ఎదురైన అత్యంత భయానక క్షణంలో తన అనుభవాన్ని ఉపయోగించి విమానంలోని వందలాది మందికి భద్రత కల్పించడంలో కీలకంగా నిలిచారు. ఒకప్పుడు విమానం ఎక్కేటప్పుడే భయపడిన ఆ యువకుడి మాటలే.. ఇప్పుడు ఆకాశంలో జరిగిన అత్యంత ప్రమాదకర ఘటన తర్వాత మరోసారి ప్రపంచం గుర్తుచేసుకుంటోంది.
ఇదీ చదవండి: స్మిట్.. నువ్వో హీరోవి! భారత్ గర్విస్తోంది


