నా ఫ్రెండ్‌ వల్ల ప్రెగ్నెంట్‌ అయ్యాను.. నా భర్త మాత్రం తనవల్లే! | IT Employee Colleague Relationship Pregnant | Sakshi
Sakshi News home page

నా ఫ్రెండ్‌ వల్ల ప్రెగ్నెంట్‌ అయ్యాను.. నా భర్త మాత్రం తనవల్లే!

Oct 1 2026 8:39 AM | Updated on Oct 1 2026 8:48 AM

IT Employee Colleague Relationship Pregnant

నేను ఒక ఐటీ ఎంప్లాయీని. నాకు రెండు సంవత్సరాల క్రితం మ్యారేజ్‌ అయింది. పెళ్లికిముందు ఆఫీసులో ఒక కొలీగ్‌తో రిలేషన్ షిప్‌లో ఉండేదాన్ని. మ్యారేజ్‌ అయిన తర్వాత కూడా కొంతకాలం అది కొనసాగింది. నా భర్త, నేను వేర్వేరు చోట్ల పనిచేస్తూ ఉండటం వల్ల మేము వీకెండ్స్‌లో కలుస్తూ ఉండేవాళ్లం. అయితే ఒక నెల ఏదో కారణం వల్ల మేము దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ అదే నెలలో నా ఫ్రెండ్‌ వల్ల నేను ప్రెగ్నెంట్‌ అయ్యాను.

 అయితే తనవల్లే నేను ప్రెగ్నెంట్‌ అయ్యానని నా భర్త అనుకుంటున్నాడు. ఇప్పుడు నాకు డెలివరీ అయింది, పాప పుట్టింది. మా ఆయన పాపను ఎత్తుకుని, అంతా తన పోలికలే ఉన్నాయని అంటుంటే, నాకు గిల్టీగా ఉంది. ఈ ఆలోచనలతో నాకు తిండి లేదు, నిద్రలేదు. పాపను కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. నా భర్త మొహం చూసినప్పుడు ఏదో అపరాధ భావం వస్తుంది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ బాధ నుంచి నేను ఎలా బయటపడాలి?                  
– ఒక సోదరి, తిరుపతి

మీ ఉత్తరం చదివిన తర్వాత మీరు పడుతున్న మానసిక బాధ, వేదన అర్థమవుతోంది. మనిషి తెలిసో తెలియకో ఒక్కోసారి కొన్ని తప్పులు చేస్తుంటాడు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కొంతమంది మళ్లీ తప్పులు చేస్తూ సమస్యను మరింత పెంచుకుంటారు. కానీ మీరు మీ తప్పును గుర్తించారు, దాని గురించి మీకు అపరాధ భావం ఉంది. అయితే ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న పరిస్థితిని కేవలం ఆ తప్పుకు సంబంధించిన గిల్ట్‌గా మాత్రమే చూడకూడదు. 

డెలివరీ తర్వాత హార్మోన్ల మార్పులు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వల్ల పోస్టుపార్టమ్‌ డిప్రెషన్‌ రావచ్చు. ఇందులో నిరంతరం బాధగా ఉండటం, ఆసక్తి తగ్గిపోవడం, మూడ్‌ స్వింగ్స్, పుట్టిన బిడ్డపై శ్రద్ధ పెట్టలేకపోవడం, గతంలోని బాధాకరమైన విషయాలు పదేపదే గుర్తుకు రావడం వంటివి ఉండవచ్చు. కాబట్టి ప్రస్తుతం మీ మొదటి ప్రాధాన్యత మీ ఆరోగ్యం, పాప భద్రత. 

ముందుగా మీరు మానసికంగా స్థిరపడాలి. వెంటనే ఒక మంచి థెరపిస్ట్‌ను కలవండి. గిల్ట్‌ను ఎదుర్కోవడానికి డిప్రెషన్‌ నుంచి బయటపడటానికి థెరపీ సహాయపడుతుంది. కాలక్రమేణా మీరు ఈ ఇబ్బంది నుంచి బయట పడడానికి కావల్సిన మానసిక స్థైర్యం వారు అందిస్తారు. అవసరమైతే సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి మందులు కూడా తీసుకోవాలి. 

మీరు పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే మీ భర్తకు ఈ విషయం చెప్పాలా, మీ సంబంధం గురించి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది థెరపిస్ట్‌ సహాయంతో ఆలోచించవచ్చు. ఈ విషయం ఎక్కువమందితో పంచుకోకండి. గతంలో మీతో సంబంధంలో ఉన్న వ్యక్తి నుంచి కూడా పూర్తిగా దూరంగా ఉండడం మంచిది. మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. జరిగిపోయిన నిన్నటిని మార్చలేం... కానీ మిగిలిన రేపటిని ఎలా రాయాలో మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ పరిస్థితి నుంచి బయటపడగలరు. ఆల్‌ ది బెస్ట్‌!

డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com a

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement