సహోద్యోగిని చంపేందుకు ఘోరమైన ప్లాన్ వేసింది ఓ మహిళ. ఆస్ట్రేలియాలోని పశ్చిమ ఆస్ట్రేలియా రాష్ట్రంలో సహోద్యోగి తెచ్చిన కర్రీలో నత్తలను చంపేందుకు ఉపయోగించే విషపదార్థాన్ని కలిపింది. నిందితురాలి(43)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతరుల ప్రాణాలు, ఆరోగ్యం లేదా భద్రతకు ముప్పు కలిగించినట్లు ఆమెపై అభియోగం మోపారు. ఈ కేసులో ఆమె నవంబర్ 5న కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెర్త్ నగరానికి ఆగ్నేయంగా ఉన్న ఓల్డ్బరీలో ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగింది. 58 ఏళ్ల మహిళ తన సహోద్యోగులతో పంచుకునేందుకు ఇంటి నుంచి కర్రీని తీసుకొచ్చారు. ఉదయం విరామ సమయంలో పలువురు ఆ ఆహారాన్ని తిన్నప్పటికీ ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. మధ్యాహ్న భోజన సమయంలో మిగిలిన కర్రీని తినేందుకు వచ్చిన ఆ మహిళకు ఆహారంలో ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులోని చిన్న రేణువులు కనిపించాయి.
రుచి చూసినప్పుడు నాలుక మొద్దుబారి..
కొద్దిగా రుచి చూసినప్పుడు నాలుక మొద్దుబారినట్లు అనిపించడంతో ఆమె అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ ఆహారాన్ని భద్రపరిచి పోలీసులకు అప్పగించారు. విషపదార్థాన్ని గుర్తించిన పోలీసులు ఆహారాన్ని పరిశీలించిన దర్యాప్తు అధికారులు అందులో మెటల్డిహైడ్ అనే విషపదార్థం ఉన్న నత్తల నివారణ గుళికలను గుర్తించారు. తోటలు, పంటలకు హాని చేసే నత్తలను చంపేందుకు ఇటువంటి పదార్థాలను ఉపయోగిస్తారు.
వీటిని తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్యం కలగడంతో పాటు ప్రాణాపాయం కూడా ఏర్పడవచ్చు. ఈ ఘటనపై పోలీసులు నెలలపాటు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిగా పేర్కొన్న మహిళ పేరు వెల్లడించలేదు. ఆమె బాధితురాలితో సన్నిహిత సంబంధంలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు ఆహారం ఉంచిన కార్యాలయ విశ్రాంతి గదికి తిరిగి వెళ్లడానికి ముందు రసాయనాలను నిల్వ చేసే షెడ్ను సందర్శించారు.
అనంతరం కర్రీలో విషపదార్థాన్ని కలిపినట్లు అనుమానిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలు న్యాయస్థానంలో నిరూపించాల్సి ఉంది. పశ్చిమ ఆస్ట్రేలియా పోలీసు కమిషనర్ కోల్ బ్లాంచ్ మాట్లాడుతూ.. ఈ విషం తీవ్రమైన గాయాలకు లేదా మరణానికి కారణమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆహారంలో ఏదో అసాధారణంగా ఉందని గుర్తించి బాధితురాలు అప్రమత్తమైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనలో బాధితురాలు సమయానికి అనుమానాస్పద పదార్థాన్ని గుర్తించి ఆహారాన్ని పోలీసులకు అప్పగించడం కీలకమైంది. నవంబర్ 5న జరిగే కోర్టు విచారణలో నిందితురాలిపై నమోదైన అభియోగాలకు సంబంధించిన తదుపరి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఒక్కరి కోసం సొంత దేశ ప్రజలతోనే మోదీ, షా యుద్ధం: దీప్కే


