హెల్త్‌పై వర్రీ వేలం వెర్రి | Sakshi Funday Special Story on Protein Rich Foods | Sakshi
Sakshi News home page

హెల్త్‌పై వర్రీ వేలం వెర్రి

Nov 29 2026 12:05 AM | Updated on Nov 29 2026 12:05 AM

Sakshi Funday Special Story on Protein Rich Foods

మార్కెట్‌లో వడ్డిస్తున్న ప్రొటీన్‌ ఫుడ్‌

మన రోజువారీ ఆహారంలో ప్రొటీన్‌ తప్పనిసరి సమతుల ఆహారంలో ప్రొటీన్‌ కీలకమైనది. రోజువారీ ఆహారం ద్వారా దొరికే కేలరీల్లో ముప్పయి శాతం వరకు ప్రొటీన్‌ ద్వారా లభించాలని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతారు. ప్రొటీన్‌ కండరాల నిర్మాణానికి దోహదపడుతుంది. దెబ్బతిన్న కండరాలను మరమ్మతు చేస్తుంది. శరీరంలోని రోగనిరోధకతను కాపాడుతుంది. గాయాలను త్వరగా మాన్పుతుంది. ప్రొటీన్‌ మన ఎముకలను, చర్మాన్ని, వెంట్రుకలను, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆహారంలో తగినంత ప్రొటీన్‌ తీసుకున్నట్లయితే ఆకలి, బరువు నియంత్రణలో ఉంటాయి.

ప్రొటీన్‌పై శ్రద్ధ మంచిదే గాని, ‘కరోనా’ తర్వాత సోషల్‌ మీడియాలో ప్రచారం ఎక్కువవడంతో జనాల్లో దీనిపై ‘అతి’శ్రద్ధ పెరిగింది. ఆహారం ద్వారా తగినంత ప్రొటీన్‌ అందుతుందో లేదోననే అనుమానంతో ఎడాపెడా ప్రొటీన్‌ పౌడర్లను, ఇతర ప్రొటీన్‌ ఉత్పత్తులను వాడటం మొదలైంది. ప్రొటీన్‌ పౌడర్లలో నాణ్యత లోపాల వల్ల, ప్రొటీన్‌ మోతాదు మితిమీరడం వల్ల జనాలు సమస్యలను ‘కొని’తెచ్చుకుంటున్నారు. కఠిన శారీరక శ్రమ చేసేవారికి కొంత అదనపు ప్రొటీన్‌ అవసరం ఉంటుంది. అలాంటివాళ్లు నిపుణుల సలహాపై ప్రొటీన్‌ వాడవచ్చు.

‘కరోనా’ తర్వాత జనాల్లో ఏర్పడ్డ భయం కారణంగా చాలామంది రోగనిరోధకత పెరుగుతుందనే అపోహతో నిపుణుల సలహాలతో పనిలేకుండానే, కేవలం సోషల్‌ మీడియా ప్రచారాన్ని నమ్మి ప్రొటీన్‌ పౌడర్లను, ఇతర ప్రొటీన్‌ ఉత్పత్తులను వాడుతున్నారు. ఈ ఉత్పత్తుల్లో భారలోహాలు, పురుగుమందులు, ఇతర ప్రమాదకర రసాయనాలు ఉంటున్నట్లు పలు పరీక్షల్లో వెల్లడవుతున్నా, మన దేశంలో వీటి అమ్మకాల జోరు మాత్రం తగ్గడం లేదు. ఇంతకీ ప్రొటీన్‌ మంచిదా, చెడ్డదా? ఎవరికి ఎంత మోతాదులో అవసరం? మితిమీరితే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి? అనే దానిపై ఒక విహంగ వీక్షణంగా ఈ కథనం...

ప్రొటీన్  ఒక్కటే పోషకం కాదు!
ప్రొటీన్ పై అవగాహన పెరగడం మంచిదే! కాని, ఆరోగ్యం అంటే ఒక్క ప్రొటీన్  మాత్రమే కాదు. పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, కొవ్వులతో పాటు విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి సూక్ష్మ పోషకాలూ శరీరానికి అవసరమే! ప్రొటీన్  ఉత్పత్తులను మార్కెట్‌ చేయడం సులభం కాబట్టి ఆహార ఉత్పత్తుల సంస్థలు వీటిపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. మార్కెట్‌ మాయ ఫలితంగా ప్రొటీన్‌ ఆహారం స్థాయి నుంచి జీవనశైలి గుర్తింపుగా మారుతోంది.

ఎవరికెంత ప్రొటీన్  అవసరం?
అందరికీ ఒకే మోతాదులో ప్రొటీన్  అవసరం ఉండదు. సాధారణంగా ఆరోగ్యవంతులైన పెద్దలకు రోజుకు ప్రతి కిలో శరీర బరువుకు సుమారు 0.8 గ్రాముల ప్రొటీన్  ప్రాథమిక అవసరంగా పరిగణిస్తారు. కండరాలను పెంచుకోవడానికి క్రమం తప్పకుండా బరువులతో వ్యాయామం చేసేవారికి ప్రతి కిలో శరీర బరువుకు 1.4 నుంచి 2 గ్రాముల వరకు అవసరం కావచ్చు. వయసు, వ్యాయామ తీవ్రత, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ మోతాదు మారుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం సాధారణంగా రోజుకు మహిళలకు 46 గ్రాములు, పురుషులకు 56 గ్రాముల ప్రొటీన్  అవసరం. అయితే వయసు, శరీర బరువు, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితులను బట్టి ఈ అవసరం మారుతుంది. వైద్యనిపుణులు చెబుతున్న ప్రకారం ఎవరికెంత ప్రొటీన్‌ అవసరమంటే...

మార్కెట్‌ మాయాజాలం
ఈ ప్రొటీన్  పరుగులో మనం ఒక విషయం మర్చిపోతున్నాం. ‘ప్రతి పౌడర్‌ ఆరోగ్యానికి మేలు చేసేదేనా? దాని నాణ్యత, అది తయారు చేసేందుకు ఉపయోగించే పదార్థాలు ఏమిటో తెలుసుకుంటున్నామా?’ అనేది. అందుకే ప్రోటీన్  పౌడర్‌ కొనేముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి. 
⇒ మార్కెట్లో కనిపించే ప్యాకెట్‌పై ౖ‘హె ప్రోటీన్‌’ అని రాసి ఉన్నంత మాత్రాన అది సంపూర్ణ పోషకాహారం కాదు. అందులో చక్కెర, ఉప్పు, కొవ్వులు, ప్రిజర్వేటివ్స్‌ ఎంత మోతాదులో ఉన్నాయో కూడా చూడాలి. 
⇒ ప్రొటీన్  పౌడర్లలో కొన్ని రకాల భార లోహాలు, రసాయనాల అవశేషాలు ఉన్నట్లు పలు పరిశోధనల్లో వెల్లడైంది. ‘క్లీన్  లేబుల్‌ ప్రాజెక్ట్‌’ 2025లో 134 ప్రొటీన్  ఉత్పత్తులను పరీక్షించింది. వీటిలో సీసం, ఆర్సెనిక్, కాడ్మియం, పాదరసం వంటి భారలోహాలతో పాటు ‘బిస్‌ఫినాల్‌–ఎ’ (బీపీఏ), పురుగుమందుల అవశేషాలనూ గుర్తించింది. 

⇒ పాలు, పాల ఉత్పత్తుల నుంచి తయారుచేసే ప్రొటీన్  పౌడర్లను తీసుకున్నప్పుడు కొందరికి జీర్ణ సమస్యలు ఎదురుకావచ్చు. ముఖ్యంగా పాలలోని లాక్టోస్‌ సరిపడనివారు కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి, విరోచనాలు వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
⇒ ప్రొటీన్  పౌడర్లలో చక్కెర, తీపి కలిగించే కృత్రిమ పదార్థాలు, నీటిలో సులువుగా, మృదువుగా కరిగిపోయేందుకు ఉపయోగపడే జిగురు పదార్థాలు, కొవ్వు పదార్థాలు కూడా ఉంటాయి. వీటిలోని మోతాదుకు మించిన చక్కెర వల్ల బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయులు అకస్మాత్తుగా పెరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. 

⇒ ప్రొటీన్  పౌడర్లు పోషకాహార సప్లిమెంట్ల కిందకు వస్తాయి. అందువల్ల వాటి వివరాలు, నాణ్యతను తయారీ సంస్థలే నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే ప్యాకెట్‌ లేబుల్‌పై ఉన్న వివరాలను నమ్మే పరిస్థితి లేదు. న్యూట్రిషన్  ఫౌండేషన్  ఆఫ్‌ ఇండియా 2018లో నిర్వహించిన పరీక్షల్లో 36 ప్రొటీన్  బ్రాండ్లలో 14 ఉత్పత్తుల్లో ప్యాకెట్‌పై తెలిపిన దానికంటే 20 శాతానికి పైగా తక్కువ ప్రొటీన్  ఉన్నట్లు గుర్తించారు. కన్జ్యూమర్‌ గైడెన్స్ సొసైటీ ఆఫ్‌ ఇండియా 2023లో పరీక్షించిన పది ‘వే ప్రొటీన్ ’ బ్రాండ్లలో నాలుగింటిలో ప్రకటించిన ప్రొటీన్  పరిమాణం కంటే చాలా తక్కువ ఉన్నట్లు వెల్లడైంది.

⇒ కొన్ని సంస్థలు చౌకగా లభించే టారిన్ , గ్లైసిన్  వంటి అమైనో యాసిడ్స్‌ కలిపి ప్రొటీన్  పరిమాణం ఎక్కువగా ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తుంటాయి. ఇవి సాధారణ ప్రొటీన్  మాదిరిగా కండరాల నిర్మాణానికి సమానమైన ప్రయోజనాన్ని ఇవ్వవు. అందుకే కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి.\

 

నిపుణులను సంప్రదించాలి
‘కోవిడ్‌’ కాలంలో రోగనిరోధకత కోసం ప్రొటీన్‌ తినాలనే ప్రచారం ఎక్కువ కావడంతో మన దేశంలో ప్రొటీన్‌ వినియోగం బాగా పెరిగినట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. నిజానికి మన దేశంలో తగినంత ప్రొటీన్‌ తీసుకునేవారు తక్కువగానే ఉన్నారు. సోషల్‌ మీడియా ప్రచారం వల్ల ఇప్పటికే రోజువారీగా ప్రొటీన్‌ తీసుకుంటున్న వారే మరింతగా ప్రొటీన్‌ తీసుకునే ధోరణి పెరిగింది. ముఖ్యంగా టీనేజ్‌ పిల్లలు ప్రొటీన్‌ పౌడర్లు, ఇతర ప్రొటీన్‌ ఉత్పత్తులు ఎక్కువగా వాడుతున్నారు.

వీరిలో చాలామంది జిమ్‌ ట్రైనర్ల సూచనపై వీటిని తీసుకుంటున్నారు. రోజువారీ ప్రొటీన్‌ అవసరాలను తొంభై శాతం వరకు సహజమైన ఆహారం ద్వారానే భర్తీ చేసుకోవాలి. సప్లిమెంట్లు తీసుకునేట్లయితే ముందుగా వైద్యులను సంప్రదించడం మంచిది. మన దేశంలో దొరికే పదార్థాలలో చాలావరకు కల్తీలే! ప్రొటీన్‌ ఉత్పత్తులు కూడా అందుకు అతీతం కాదు. అతిగా ప్రొటీన్‌ వాడితే జీర్ణకోశ సమస్యలు, కిడ్నీలు దెబ్బతినడం వంటి ప్రమాదాలు ఉంటాయి. ప్రొటీన్‌ ఉత్పత్తులను నిపుణులు సూచించిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
∙సుజాతా స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్‌


ప్రొటీన్‌ ఎందుకు అవసరం?
ప్రొటీన్  కేవలం కండలు పెంచే పదార్థం మాత్రమే కాదు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఈ పోషకం కీలకమే. కండరాల నిర్మాణానికి, పెరుగుదలకు, దెబ్బతిన్న కణజాలం మరమ్మతులకు ప్రొటీన్  అవసరం. ఎదిగే పిల్లల్లో శారీరక అభివృద్ధికి ప్రొటీన్‌ చాలా కీలకం. రోగనిరోధక వ్యవస్థ మెరుగుదలకు, గాయాలు త్వరగా మానడానికి; జుట్టులోని కెరాటిన్ , చర్మంలోని కొలాజెన్  నిర్మాణానికి ప్రొటీన్  అవసరం. హార్మోన్లు, ఎంజైమ్‌ల తయారీలోనూ ప్రొటీన్‌ కీలకంగా పనిచేస్తుంది. బరువు అదుపులో ఉంచుకోవడానికి, వ్యాయామం చేసేవారిలో కండరాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. 

నాడు వ్యర్థం... నేడు ప్రొటీన్‌! 
నేడు వేల రూపాయలు పెట్టి కొంటున్న ‘వే ప్రోటీన్‌’ కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఒక పనికిరాని వ్యర్థ పదార్థం. పాల నుంచి జున్ను తయారు చేసేటప్పుడు మిగిలిపోయే నీటిని కంపెనీలు నదుల్లో పారబోసేవి. దీనివల్ల పర్యావరణ కాలుష్యం పెరగడంతో, ఆ నీటిని ఎండబెట్టి పౌడర్‌గా మార్చడం మొదలుపెట్టారు. అలా వృథాగా అనుకున్న పదార్థం నేడు ఫిట్‌నెస్‌ ప్రపంచాన్ని శాసిస్తోంది. కొన్ని నాసిరకం కంపెనీలు తమ పౌడర్‌లో ప్రొటీన్‌ శాతం ఎక్కువగా ఉన్నట్లు ల్యాబ్‌ టెస్టుల్లో చూపించడానికి చౌకైన అమైనో యాసిడ్లను (టారిన్, గ్లైసిన్‌ వంటివి) కలుపుతాయి. దీనిని ‘అమైనో స్పైకింగ్‌’ అంటారు. దీనివల్ల డబ్బాపై 25 గ్రాముల ప్రొటీన్‌ అని రాసి ఉన్నా, శరీరానికి అందే అసలు ప్రొటీన్‌ చాలా తక్కువగా ఉంటుంది.

మితిమీరితే ముప్పే!
⇒ ‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అనే సూత్రం ప్రొటీన్‌కు కూడా వర్తిస్తుంది. ప్రొటీన్‌ మంచిదే కదా అనే భావనతో అతిగా తీసుకుంటే, మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. దీర్ఘకాలం అతిగా ప్రొటీన్‌ తీసుకుంటున్నట్లయితే...
⇒ అతిగా తీసుకున్న ప్రొటీన్‌ కారణంగా ఏర్పడే నైట్రోజన్‌ వ్యర్థాలను బయటకు పంపే ప్రక్రియలో కిడ్నీలు అలసిపోతాయి. శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ పరిమాణం పెరుగుతుంది. క్రమంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. కొన్నాళ్లకు కిడ్నీలు పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరుకుంటాయి.
⇒ ప్రొటీన్‌ పుష్కలంగా ఉంది కదా అని చాలామంది ప్రాసెస్డ్‌ మాంసాహార పదార్థాలను తీసుకుంటుంటారు. వీటి ద్వారా ప్రొటీన్‌తో పాటు అదనపు కొవ్వు కూడా ఒంట్లోకి చేరుతుంది. దీనివల్ల శరీరంలో ‘లోడెన్సిటీ లిపిడ్స్‌’ (ఎల్‌డీఎల్‌) పెరిగి, గుండెకు చేటు కలిగిస్తాయి. మోతాదుకు మించి శరీరంలోకి చేరిన ప్రొటీన్‌ కూడా అంతిమంగా కొవ్వుగానే మారుతుంది. ఫలితంగా గుండె ప్రమాదంలో పడుతుంది.\

⇒ శరీరంలోకి అతిగా చేరిన ప్రొటీన్‌ వ్యర్థాలను బయటకు పంపడానికి అదనంగా నీరు అవసరం అవుతుంది. వ్యర్థాలను బయటకు పంపే క్రమంలో శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్‌ తలెత్తవచ్చు. ఈ పరిస్థితిలో శరీరం నుంచి, నోటి నుంచి పులిసిన పండ్లలాంటి దుర్వాసన వెలువడుతుంది. దీనిని ‘కీటో బ్రీత్‌’ అంటారు.
⇒ ముఖ్యంగా జంతుసంబంధ ప్రొటీన్‌ పదార్థాల ద్వారా ఎక్కువగా తయారయ్యే యాసిడ్స్‌ నేరుగా రక్తంలోకి చేరుకుంటాయి. వీటిని నిర్వీర్యం చేయడానికి శరీరం స్పందించి, క్యాల్షియం నిల్వలను ఉపయోగించుకుంటుంది. ఈ ప్రక్రియలో ఎముకలు బలహీనపడి ఆస్టియోపొరాసిస్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి.

⇒ రోజువారీ ఆహారం ద్వారా లభించే కేలరీల్లో ప్రొటీన్‌ ద్వారా లభించే కేలరీలు 35 శాతానికి మించినట్లయితే ‘ప్రొటీన్‌ పాయిజనింగ్‌’ పరిస్థితి తలెత్తుతుంది. దీనివల్ల వాంతులు, వికారం, విరేచనాలు, అలసట, నీరసం, రక్తపోటు పడిపోవడం, శ్వాస అమోనియా వాసన రావడం వంటి లక్షణాలు తలెత్తుతాయి. సత్వర చికిత్స అందించకుంటే, ఈ పరిస్థితి ప్రాణాలకు ముప్పు తెచ్చే అవకాశాలు ఉంటాయి.

తక్కువ ప్రొటీన్‌... ఎక్కువ ఆయుష్షు
చాలామంది తినే ప్రతి దానిలో ప్రొటీన్‌ ఉండాలని భావిస్తున్నారు. దీంతో మార్కెట్లు సైతం వినియోగ దారుల ఆలోచనలకి అనుగుణంగా ప్రతి ఆహార పదార్థంలోనూ ప్రొటీన్‌ను జోడించి అమ్ముతున్నాయి. అయితే అవసరానికి మించి ప్రొటీన్‌ తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నాయి తాజా పరిశోధనలు. ‘సెల్‌ ప్రెస్‌ బ్లూ’ జర్నల్‌లో ప్రచురితమైన ఆర్టికల్‌లో అమెరికాలోని విస్కాన్సిన్ –మాడిసన్  విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని సమీక్షించారు. 

ప్రొటీన్ , అమైనో ఆమ్లాల వినియోగానికి వృద్ధాప్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు 350కి పైగా శాస్త్రీయ పరిశోధనా పత్రాలను విశ్లేషించారు. ప్రొటీన్  మోతాదును కాస్త తగ్గించడం వల్ల శరీర జీవక్రియలో మార్పులు రావడంతో పాటు వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదించే అవకాశం ఉందని గుర్తించారు. వీరు పరిశోధనల్లో తేల్చిన సారాంశం ప్రకారం ప్రొటీన్‌ను గరిష్ఠ పరిమితి కంటే కొంచెం తక్కువగా తీసుకుంటేనే మేలు. తక్కువ ప్రొటీన్‌ తీసుకుంటున్నట్లయితే, త్వరగా వయసు మళ్లిపోకుండా ఎక్కువకాలం జీవించవచ్చు.

∙రమా జంబుల 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement