పాలు తాగుతున్నా.. విలువ తెలియదా? | Only 59 percent of Urban Indians Know Milk Is Complete Protein Survey | Sakshi
Sakshi News home page

పాలు తాగుతున్నా.. విలువ తెలియదా?

Nov 26 2026 7:10 PM | Updated on Nov 26 2026 7:13 PM

Only 59 percent of Urban Indians Know Milk Is Complete Protein Survey

భారతీయుల రోజువారీ ఆహారంలో పాలు కీలక స్థానాన్ని కలిగి ఉన్నప్పటికీ వాటిలోని సంపూర్ణ ప్రోటీన్‌ పోషక విలువపై పట్టణ వినియోగదారుల్లో అవగాహన అంతంతమాత్రంగానే ఉందని కొత్త అధ్యయనం వెల్లడించింది. పాల వినియోగం విస్తృతంగా ఉన్నప్పటికీ పాలలో శరీరానికి అవసరమైన తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయన్న విషయాన్ని ప్రతి పది మందిలో నలుగురికి పైగా సరిగ్గా గుర్తించలేకపోతున్నారు.

గోద్రెజ్‌ జెర్సీ విడుదల చేసిన ‘లాక్టోగ్రాఫ్‌ 2.0’ అధ్యయనం ప్రకారం, పట్టణ భారతీయ వినియోగదారుల్లో కేవలం 59 శాతం మందికి మాత్రమే పాలు సంపూర్ణ ప్రోటీన్‌ కలిగిన ఆహారమన్న అవగాహన ఉంది. యూగోవ్‌ (YouGov) నిర్వహించిన ఈ అధ్యయనం ఎనిమిది భారతీయ నగరాల్లో పాల వినియోగ అలవాట్లు, పోషక అవగాహన, కొనుగోలు ప్రాధాన్యతలను పరిశీలించింది.

మరోవైపు, పాల వినియోగం మాత్రం రోజువారీ జీవితంలో బలంగా కొనసాగుతోంది. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది ప్రతిరోజూ టీ లేదా కాఫీ ద్వారా పాలను తీసుకుంటుండగా, 40 శాతం మంది నేరుగా పాలు తాగుతున్నారు. అంటే పాల వినియోగం అలవాటుగా ఉన్నప్పటికీ దాని పోషక ప్రయోజనాలపై అవగాహన అదే స్థాయిలో పెరగలేదని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

పాల ఉత్పత్తుల మధ్య ప్రోటీన్‌ గుర్తింపు విషయంలోనూ వ్యత్యాసం కనిపించింది. పనీర్‌ను సంపూర్ణ ప్రోటీన్‌గా గుర్తించినవారు 69 శాతం కాగా, పాలను గుర్తించినవారు 59 శాతం మాత్రమే. పెరుగును సంపూర్ణ ప్రోటీన్‌గా గుర్తించినవారి శాతం 47గా నమోదైంది. శాఖాహారుల్లో 86 శాతం మంది పాల ఉత్పత్తులను తమ ప్రధాన ప్రోటీన్‌ వనరుల్లో ఒకటిగా భావిస్తున్నప్పటికీ పాలు సంపూర్ణ ప్రోటీన్‌ అన్న విషయాన్ని గుర్తించినవారు 65 శాతం మాత్రమే.

అందుబాటులో ఉన్న ప్రోటీన్‌ వనరుగా పాలు

ప్రోటీన్‌ కోసం ఖరీదైన ఆహార పదార్థాలనే ఆశ్రయించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని కూడా అధ్యయనం స్పష్టం చేసింది. పరిశీలించిన 13 ప్రోటీన్‌ ఆహార వనరుల్లో రోజువారీ ప్రోటీన్‌ కోసం పాలను అత్యంత అందుబాటులో ఉండే ఆహారంగా 69 శాతం మంది పేర్కొన్నారు. ముంబై, చెన్నై నగరాల్లో ఈ అభిప్రాయం 80 శాతానికి చేరింది. అయితే, అధిక ప్రోటీన్‌ కలిగిన పాల ఉత్పత్తులపై ఆసక్తి ఉన్నప్పటికీ వాటి రోజువారీ వినియోగం పరిమితంగానే ఉంది. ఎనిమిది మందికి పైగా వినియోగదారులకు హై-ప్రోటీన్‌ పాలపై అవగాహన ఉండగా, కేవలం 25 శాతం మంది మాత్రమే వాటిని క్రమం తప్పకుండా వినియోగిస్తున్నారు. రుచి నచ్చకపోవడం 50 శాతం మందికి, ధర 45 శాతం మందికి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి.

పరిశుభ్రతకు ప్రాధాన్యం

పాలను కొనుగోలు చేసే విధానంలోనూ వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతున్నట్లు అధ్యయనం వెల్లడించింది. 44 శాతం మంది ప్రధానంగా బ్రాండెడ్‌ ప్యాకేజ్డ్‌ పాలను కొనుగోలు చేస్తుండగా, 27 శాతం మంది నేరుగా రైతుల నుంచి పాలు తీసుకుంటున్నారు. మరో 17 శాతం మంది స్థానిక పాల విక్రేతలు లేదా డెయిరీల నుంచి పాలను కొనుగోలు చేస్తున్నారు. పాల కొనుగోలులో పరిశుభ్రమైన నిర్వహణకు 71 శాతం మంది ప్రాధాన్యత ఇచ్చారు.

దేశంలో పాల ఉత్పత్తి పెరుగుదల

భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశంలో పాల ఉత్పత్తి 2024–25లో 247.87 మిలియన్‌ టన్నులకు (దాదాపు 248 మిలియన్‌ టన్నులకు) చేరింది. 2014–15లో 146.31 మిలియన్‌ టన్నులుగా ఉన్న పాల ఉత్పత్తి 69.41 శాతం వృద్ధితో ఈ స్థాయికి చేరుకుందని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పాల ఉత్పత్తి రంగంలో దేశం సాధిస్తున్న వృద్ధికి ఇది సూచిక. అయితే, పాల ఉత్పత్తి పెరుగుదలతో పాటు వాటిలోని పోషక విలువలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం కూడా అవసరమని తాజా అధ్యయనం సూచిస్తోంది.

ఇదీ చదవండి: మాటలతో తేలేలాలేదు.. టీవీఎస్‌ ఆస్తులపై హైకోర్టులో దావా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement